రాష్ట్రీయం

సువర్ణ్ధ్యాయానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రైతుబంధు పథకంతో 58 లక్షల మందికి లబ్ధి రూ.6వేల కోట్లు బ్యాంకుల్లో ఉంచాం
కరీంనగర్, మే 10: ‘్భరతదేశంలోనే ఇవాళ సువర్ణ అధ్యాయం, రాష్ట్రంలోని 58 లక్షలమంది రైతులకు చెక్కులు, పాసు పుస్తకాలు అందిస్తున్నాం. రైతులకు పెట్టుబడి సాయం చేసిన గౌరవం తెలంగాణకే దక్కింది. దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలువనుంది’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతుబంధు పథకం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.12వేల కోట్లు కేటాయించామని, రైతులకు అందించే చెక్కులకు సంబంధించి బ్యాంకుల్లో రూ.6వేల కోట్లు వేశామని, పెట్టుబడి సాయం సద్వినియోగం చేసుకుని బంగారు పంటలు పండించాలని రైతులను కోరారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి (ఇందిరానగర్)లో గురువారం రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. రైతుబంధు పథకంలో అందించే చెక్కుల్లో అక్కడక్కడా ఒకటో, రెండో, మూడో క్లియరెన్స్ కాకపోతే ఇబ్బందిపడవద్దని, అందరికీ సొమ్ము అందజేస్తామని అన్నారు. డబ్బులతో కూడిన వ్యవహారం కాబట్టి, అన్ని పరిశీలించాకే అందజేస్తారని తెలిపారు. ఇదేకాక జూన్ 2 తరువాత పంట రుణాలు పొందేందుకు ఎలాంటి పాసు బుక్కులు బ్యాంకులో తాకట్టుపెట్టకుండానే పంట రుణాలు ఇస్తామని అన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి, 2 కోట్ల 38 లక్షల భూమి రికార్డులను అధికారులు పరిశీలించారని వివరించారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వబోమని మరోసారి స్పష్టం చేశారు. పాసు పుస్తకాలలో పట్టాదారు పేరు మాత్రమే ఉంటదని, అనుభవదారుడి పేరు ఉండదని, రైతుకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అన్నారు.
ప్రజలకు పాలనను చేరువచేసే క్రమంలో జూన్ 2 నుంచి మరో విప్లవాత్మక కార్యక్రమం ప్రారంభించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఆరోజు నుంచి కొత్త రిజస్ట్రేషన్ విధానం అమలు చేయనున్నట్టు చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పోను 430 మండలాల్లో తహశీల్దార్లే రిజిస్ట్రేషన్లు చేస్తారని అన్నారు. భూములు అమ్మాలన్నా.. కొనాలన్నా..రిజిస్ట్రేషన్ ప్రక్రియ గంటల్లోపే పూర్తవుతుందని, వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలు, పాసు బుక్కులు సైతం పోస్టులో ఇంటికొస్తాయని అన్నారు. కులాలు, మతాలకతీతంగా నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యనందిస్తున్నామని, కొత్త రాష్టమ్రైనప్పటికీ ఇండియాలో 20శాతం రాబడి సాధించామని, అలాగే 28శాతం అత్యధికంగా క్యాపిటల్ ఇనె్వస్ట్‌మెంట్ చేసిన రాష్ట్రం కూడా తెలంగాణ అని అన్నారు. అగ్రకులాల్లోని పేదలకు తగిన పథకాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని, వారికి తమ అండదండలు ఉంటాయని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతుబంధు ప్రారంభ వేదికగా డిమాండ్ చేశారు. కూలీలకు ఇచ్చే డబ్బును సగం కేంద్ర ప్రభుత్వం భరించాలని, సగం రైతు భరించాలని కేంద్రానికి సూచించారు. కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాలుగో వంతు మక్కలకు, వడ్లకు ఎంఎస్‌పీ ద్వారా మద్దతు ధర రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం దండగ కాదు..పండుగ అని రాబోయే రోజుల్లో చేసి చూపిస్తామని అన్నారు.
జూన్ 2 నుంచి రాష్ట్రంలో రైతు ఎలాంటి ఇబ్బందిపడ్డా, చనిపోయినా రైతుకి రూ.5లక్షలు బీమా ఇస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా రాబోయే పది, పదిహేను రోజుల్లో ఇంటింటికీ తాగునీరు అందించబోతున్నామని అన్నారు. పోరాడి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కోటి ఎకరాల మాగాణికి నీళ్లు అందించేవరకు నిద్రపోనని అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. కాళేశ్వరం, ప్రాణహిత, చెవేళ్ల ప్రాజెక్టుల నీళ్లు వచ్చేలా సిడబ్ల్యూసీ ఆమోదం పొందామని తెలిపారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో దొరుకుతున్నాయని, 24గంటలు కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. 20, 30 యేళ్ల ఆంధ్ర పాలకులు పాలించినా కూడా జరగని అభివృద్ధి ఈనాడు తెలంగాణ ఏర్పడ్డాక నాలుగేళ్లల్లోనే అనేక రంగాల్లో సాధించుకున్నామని తెలిపారు. ఆనాడు తెలంగాణ వస్తే చీకట్లో మగ్గుతారని, పాలన చేయరాదని, తెలివిలేదని అవహేళన చేసిన నేతలకు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి చూపిస్తున్నామని, మొన్నటి సివిల్స్‌లో రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా బిడ్డడు అనుదీప్‌కు మొదటి ర్యాంకు వచ్చిందని, ఇది మా బిడ్డల తెలివికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ సిద్ధించాక రాజకీయ నాయకుల లాగ అధికారులు కూడా అభివృద్ధిలో తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొంటూ, వారికి కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తోపాటు జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.