రాష్ట్రీయం

కూలర్ల కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 10: విజయవాడ నగరంలో అంతర్భాగమైన కానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని న్యూ ఆటోనగర్‌లో ఓ కూలర్ల తయారీ కంపెనీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు. ఈ మంటలు పరిసరాల్లోని ఇతర పరిశ్రమల వైపు విస్తరించకుండా అగ్నిమాపక, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు, సిబ్బంది చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. కూలర్ కంపెనీలో ప్రజ్వరిల్లిన మంటలను అదుపు చేయడానికి 15కు పైగా ఫైరింజన్లు రంగంలోకి దిగాయంటే ఈ ప్రమాదం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, జాయింట్ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాతా తదితరులు తమ తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను అదుపుచేసేందుకు పెద్దఎత్తున సాయుధ పోలీస్ బలగాలను మోహరింప చేయాల్సి వచ్చింది. అగ్నిమాపక శాఖ డీజీ కె.సత్యనారాయణ, డైరెక్టర్ జయరాం నాయక్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ మురళీమోహన్, జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, వారి సిబ్బంది 15కు పైగా ఫైరింజన్‌లతో ఘటన స్థలానికి చేరుకుని ముందు మంటలను అదుపుచేసే చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు ఈ నెల 22న జరగనున్న శంకుస్థాపన ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీకాంతం ఉదయం 10.30 నిముషాలకు స్థానిక తన క్యాంప్ కార్యాలయంలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమవుతుండగా అగ్నిప్రమాద ఘటన సమాచారం తెలుసుకుని వారినందరినీ వెంటబెట్టుకుని బయలుదేరారు. ఇదిలా ఉండగా ఉదయం 11 గంటల ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది కూలర్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలోనే సాంకేతిక కారణాలతో నిమిషాల్లోనే అదుపు చేయలేనంత స్థాయిలో మంటలు చెలరేగాయి. స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చారు. ముందుగా పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి ట్రాఫిక్‌ను అందుపుచేశారు. ఈ ప్రమాదం వల్ల మండుటెండలో సైతం దట్టమైన పొగ కమ్మేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం స్వయంగా ప్రాథమిక విచారణ జరిపి జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్ అధ్యక్షతన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, జిల్లా ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ మైనార్టీస్‌తో ఒక కమిటీని ఏర్పాటుచేసి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీచేశారు. 15 రోజుల్లో నివేదిక అందచేయాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.

మోదీ కక్ష సాధింపు!
* గోద్రాపై రాజీనామా చేయాలని డిమాండ్ చేసినందుకే వేధింపు
కర్నూలు, మే 10: ప్రధాని నరేంద్ర మోదీ పాత విషయాన్ని మనసులో పెట్టుకుని కక్ష సాధిస్తున్నారని, తనను వేధిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గోద్రా అల్లర్లకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని డిమాండ్ చేశానని, ఆయనపై అప్పటి ప్రధాని వాజపేయికి కూడా ఫిర్యాదు చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు ఆయన తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులోని ఏపీ ఎస్పీ బెటాలియన్ మైదానంలో మేథావులు, విద్యార్థులు, ఏన్జీఓలతో ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై గురువారం నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. గోద్రా అల్లర్లలో నరేంద్ర మోదీ పాత్ర ఉందని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయని, ఆ సంఘటనతో కలత చెందిన తాను నాటి ప్రధాని వాజ్‌పేయికి ఫిర్యాదు చేశానన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీతో రాజీనామా చేయించాలని కోరినట్లు గుర్తుచేశారు. ఒక భారతీయునిగా తన బాధ్యతగా భావించే గోద్రా అల్లర్లను వ్యతిరేకించానని ఆయన పేర్కొన్నారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరపున 28 మంది ఎంపీలు గెలిచారని, వాజపేయి ప్రభుత్వానికి మద్దతు తెలిపినప్పటికీ ఆయన మంత్రివర్గంలో చేరలేదని గుర్తుచేశారు. అయితే వాజపేయి స్వయంగా తనకు పలుమార్లు ఫోన్ చేసి లోక్‌సభ సభాపతికి టీడీపీ నుంచి ఒకరిని ఎంపిక చేయాలని పదేపదే కోరడంతో చివరి నిమిషంలో బాలయోగిని ఎంపిక చేశామని తెలిపారు. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడం సహజమేనని, అయితే దాన్ని మనసులో పెట్టుకుని ఒక రాష్ట్రం అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ పని చేయడం సహించరాని విషయమని మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీ నేతగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను గోద్రా అల్లర్లపై స్పందించానని, తన స్థానంలో ఎవరున్నా అదే చేస్తారని అన్నారు. అయితే వ్యక్తిగతంగా తనపై కక్ష గట్టినట్లు మోదీ వ్యవహరిస్తుంటే ఆయనకు వైకాపా నాయకులు వంత పాడారని, దాని ఫలితమే రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయమని చంద్రబాబు స్పష్టం చేశారు. విభేదాల అంశం పక్కన పెడితే ప్రధానిగా వాజపేయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను పని చేసిన సమయంలో తన పట్టుదల, ప్రధానితో తాను చేయించుకున్న పనులు స్వయంగా పరిశీలించిన మోదీ ఇప్పుడు తనకు ఏ మాత్రం అవకాశమిచ్చినా భవిష్యత్తులో ఇబ్బందేనన్న భావనతో సహకరించడం లేదని ఆరోపించారు. తాను ప్రజల మనిషినని, దేశ ప్రధానిగా ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసమే పనిచేస్తానన్న విషయం నరేంద్ర మోదీకి స్పష్టంగా తెలుసునని అన్నారు. తనకు అవకాశమిస్తే అతి తక్కువ సమయంలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెడతానన్న భయం ప్రధానికి ఉందని అన్నారు. భావితరాల కోసం తాను హైదరాబాద్ నగరాభివృద్ధికి చేసిన కృషి ఫలితం నేడు ప్రస్పుటంగా కనిపిస్తోందన్నారు. ప్రపంచ నేతలకు చంద్రబాబు అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేనంత గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. వ్యక్తిగత విషయాలు మనసులో పెట్టుకుని ప్రజలను వేధిస్తే అది నరేంద్ర మోదీకి మంచి చేయబోదని హెచ్చరించారు. తనను ఏ రకంగా వేధించినా ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం రాజీపడే ప్రశే్న లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
అశాస్ర్తియంగా విభజన జరుగుతోందని, న్యాయం చేయాలని లోక్‌సభలో నాటి ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ నేతల వెంట పడి న్యాయం కోసం ప్రయత్నించానని బాబు గుర్తుచేశారు. తాను పడిన కష్టం ఫతితమే నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో రాజ్యసభలో ప్రత్యేక హోదా విషయంపై అధికారిక ప్రకటన చేయించగలిగామని అన్నారు. ఆ ప్రకటన చేస్తేనే రాజ్యసభలో విభజన చట్టానికి మద్దతు తెలుపుతామని బీజేపీ పక్ష నేత వెంకయ్యనాయుడుతో ప్రకటన చేయించడంతో కాంగ్రెస్ అందుకు అంగీకరించిందని అన్నారు. విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని నరేంద్ర మోదీ సహా ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. దాంతో కాంగ్రెస్ అధికారంలోకి రాదని గుర్తించి బీజేపీతో ఉంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించి వారితో కలిసి అడుగు వేశానన్నారు. తన తపన, ఆలోచనలకు ప్రజలు మద్దతు తెలిపి రాష్ట్రంలో అధికారం అప్పగించారన్నారు. రాష్ట్ర ప్రజల సహకారాన్ని తాను జీవితంలో మర్చిపోలేనని అన్నారు. తాను సాధించిన అనేక విజయాల కన్నా గత ఎన్నికల్లో సాధించిన విజయం ప్రత్యేకమైందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను పరితపిస్తుంటే కేసుల ఎత్తివేత, అధికార దాహాన్ని తీర్చుకోవడం కోసం వైకాపా నేతలు బీజేపీతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు గానీ తరువాత గానీ బీజేపీతో వైకాపా కలవడం ఖాయమని ఆయన అన్నారు. తనపై అక్రమకేసులు పెట్టి జైలుకు పంపడానికి వారు ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. అయితే తాను భయపడి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడబోనని, అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు న్యాయం చేయడానికే ప్రాధాన్యనిస్తానని స్పష్టం చేశారు. తనపై కేసులు లేవని, ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించడం లేదన్నారు. అలాంటపుడు తాను ఎవరి పంచన చేరాల్సిన పనిలేదని ఆయన అన్నారు. బీజేపీ, వైకాపా తీరును ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. తనకు అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని బాబు అన్నారు.