రాష్ట్రీయం

షాకు నిరసనల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 11: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చి తిరుగు ప్రయాణమైన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నిరసనల సెగ తాకింది. ఆయన ప్రయాణిస్తున్న వాహన శ్రేణిని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్న సంఘటన శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో అలిపిరి వద్ద చోటుచేసుకుంది. ఈక్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక దశలో అమిత్ షా వాహనంపై తెలుగుదేశం శ్రేణులు దాడికి ప్రయత్నించాయి. అయితే పోలీసుల వలయంలో అమిత్ షా వాహనం సురక్షితంగా ముందుకు వెళ్లింది. అయితే ఆయన వెంట వస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ నేత కోలా ఆనంద్ వాహనంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి వాహనం అద్దాలు పగలగొట్టారు. దీంతో కోలా ఆనంద్, ఆయన అనుచరులు ఒక్కసారిగా వాహనం నుండి కిందకు దిగి టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. మాటల యుద్ధం సాగుతున్న
తరుణంలో ఇరువర్గాలు ఆవేశాలకు లోనై ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలకు దిగారు. ఈనేపధ్యంలో డిఎస్పీ మునిరామయ్య నేతృత్వంలో భారీఎత్తున మోహరించిన పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలను శాంతపరిచే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో కోలా ఆనంద్, టీడీపీ తెలుగు యువత అధ్యక్షులు శ్రీ్ధర్‌వర్మల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈనేపధ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని కోలా ఆనంద్, ఆయన అనుచరులను కారులో ఎక్కించి అక్కడ నుండి పంపేశారు. అటు తరువాత పోలీసులు టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. దీంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ కన్వీనర్ రవినాయుడు, జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని అలిపిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సుమారు గంటపాటు అలిపిరి వద్ద ఉన్న గరుడ విగ్రహం వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. అటు తరువాత బీజేపీ నేతలు ప్రయాణిస్తున్న వాహనాలు సురక్షితంగా వెళ్లిపోయాయి.
టీడీపీ నేతలు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, జిల్లా మహిళా అధ్యక్షురాలు పుష్పావతి, నగర అధ్యక్షులు దంపూరి భాస్కర్‌యాదవ్ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని నెరవేర్చకుండా ఆ పార్టీ అధ్యక్షులు తిరుమల శ్రీవారిని దర్శించుకునే అర్హత లేదని విమర్శించారు.
అమిత్ షా వాహనాన్ని అడ్డుకోవడంపై బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి, అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్, అజయ్‌కుమార్, ప్రచార కార్యదర్శి గుండాల గోపీనాథ్‌రెడ్డిలు మాట్లాడుతూ టీటీడీ కుసంస్కారం మరోసారి బట్టబయలైందన్నారు. ప్రత్యేక హోదా వద్దని చెప్పింది టీడీపీ అధినేత చంద్రబాబేనని, నేడు కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్న తలెత్తడంతో రాద్ధాంతం చేస్తున్నది టీడీపీ నేత చంద్రబాబేనన్నారు. అమిత్ షా వాహనంపై దాడి ప్రయత్నం వెనుక చంద్రాబునాయుడు ప్రోద్బలం ఉందన్నారు. అయితే ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ నాయకులు చేసిన చర్య హేయమైనదని చంద్రబాబు చెప్పడం ఒక నాటకమన్నారు.