రాష్ట్రీయం

యుద్ధం.. అనివార్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 22న వెంకయ్యనాయుడి రాకపై కమలనాథుల్లో మిశ్రమ స్పందన
విజయవాడ, మే 12: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని స్థితి. నాలుగేళ్లపాటు భారతీయ జనతాపార్టీతో కేంద్రంలోను, రాష్ట్రంలోను చెట్టాపట్టాలేసుకు తిరిగిన సీఎం చంద్రబాబు తీసుకున్న ‘యూ’ టర్న్ దీనికంతటికీ కారణంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రధాని నరేంద్రమోదీపై బాబు అనునిత్యం విమర్శనాస్త్రాలు సంధించడమే గాక ధర్మపోరాట దీక్షలు సాగిస్తుంటే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు మోదీని తూర్పారపడుతూ సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష వైకాపా నేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం నేటి వరకు ప్రధాని మోదీని పల్లెత్తు మాట అనటం లేదు. ఘాటైన పదజాలం కాదుకదా.. సాధారణ విమర్శలు కూడా సంధించని పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడితో చంద్రబాబు తీరుపై కమనాథులు మండిపడుతూ నిప్పులు చెరుగుతున్నారు. దాడి వెనుక బాబు ప్రోద్బలం ఉందని బీజేపీ నేతలందరూ ధ్వజమెత్తుతున్నారు. కరకట్టపై నివాసం ఉంటున్న చంద్రబాబు రోడ్డెక్కటానికి గంట ముందుగానే అటు.. ఇటు కనీసం ఐదారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిపివేసే పోలీసులు జడ్ కేటగిరీ ఉన్న వ్యక్తి.. అందునా రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు పోలీసులు సరైన రక్షణ కల్పించలేదంటున్నారు. దూసుకెళ్లే కాన్వాయ్‌లోని బులెట్ ఫ్రూప్ కారు ఐదారుసార్లు బ్రేక్ వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శతృత్వం ఉండదన్నట్లుగా రాష్ట్రంలో ఇక బీజేపీ, తెలుగుదేశంల మధ్య అమిత్ షాపై దాడి అగ్గికి ఆజ్యం పోసినట్లయి రెండు పార్టీల మధ్య ప్రత్యక్ష యుద్ధం ఆరంభమైందని, కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంపై ముఖ్యంగా చంద్రబాబుపై కేంద్రం దృష్టి పెడుతుందంటున్నారు. ప్రధానంగా టీడీపీ
ప్రజా ప్రతినిధులు, నేతల అరాచకాలు, అవినీతిపై ఇక ప్రత్యక్ష దాడి ప్రారంభిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కెవి లక్ష్మీపతిరాజా ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. ఇక టీడీపీపై ముప్పేట దాడి తప్పేలా కన్పించడం లేదు. ఇప్పటికే వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన, వైకాపాలు చంద్రబాబుపై విమర్శల దాడి చేస్తున్నాయి. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితమే కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ విజయవాడ పర్యటనకు వస్తే టీడీపీ ప్రజాప్రతినిధులందరూ ముఖం చాటేశారు. ప్రధానంగా ఆయుష్ ఆసుపత్రి భవనాలను ప్రారంభించే కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో బీజేపీకి టీడీపీ దూరమైన తరువాత తొలిసారిగా ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈనెల 21 తేదీ రాత్రి స్వర్ణ్భారతి ట్రస్ట్ ప్రాంగణానికి రాబోతున్నారు. 22 తేదీ కొండపావులూరులో కేంద్ర నిధులు రూ.40 కోట్లతో నిర్మించబోయే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ భవనాల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే భూమి సమకూర్చింది. రాష్ట్రంలో అధికారపక్షం ముఖ్యంగా చంద్రబాబు ఒకటే పనిగా ప్రధాని మోదీని దుమ్మెత్తి పోస్తుంటే లోపాయికారీగా నివారించే చర్యలు చేపట్టకుండా రాష్ట్రానికి ఎలా వస్తున్నారని బీజేపీలోని ఒక వర్గం బాహాటంగా విమర్శిస్తోంది. దీనికి తగ్గట్లే ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలంటూ డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు ముందు తన పదవికి రాజీనామా చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. విపక్షాలు ఆరోజు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాయి. దీనిపై టీడీపీ వైఖరి ఏమిటో ఇంకా స్పష్టం కాలేదు. ఏదిఏమైనా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మాత్రం ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.