రాష్ట్రీయం

గోదాట్లో.. ప్రాణాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మే 12: ప్రకృతిని ఆస్వాదిస్తూ చేసే జల ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నీటిపై ప్రయాణమంటే చిన్న పిల్లవాడి మొదలు వృద్ధుల వరకు అందరిలోనూ ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ ఉత్సాహమే కొందరి తప్పిదాల వల్ల నీరుగారిపోతోంది. నిబంధనలను నిర్లక్ష్యం చేయడం.. అడుగడుగునా అభద్రత నెలకొనడంతో పాపికొండల్లో జల విహారం ప్రాణ సంకటంగా మారుతోంది. సెలవుల్లో ఉల్లాసంగా గడుపుదామని వచ్చే పర్యాటకులు ఇక్కడి పరిస్థితులు చూసి ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ పర్యాటక చిత్రపటంలో సుస్థిర స్థానం పొందిన అభయారణ్యంలోని పాపికొండల విహార యాత్రలో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా.. పర్యాటకుల ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వడం లేదు. అనుమతి లేని లాంచీలు.. అనుభవం, అవగాహన లేని డ్రైవర్లు, చూసీ చూడనట్లు వ్యవహరించే అధికారుల తీరుతో దారుణ లోపాలే కనిపిస్తున్నాయి. ఇవన్నీ బయటకు కనిపించే లోపాలు కాగా గుట్టుగా సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు పర్యాటక ప్రాముఖ్యతను మసకబార్చడమే కాదు, పర్యాటకులకు రక్షణ లేకుండా పోతోంది. ఆహ్లాదకరంగా సాగే నదీ ప్రయాణంలో అనేక మలుపులు ఉన్నట్లే అనేక అవరోధాలు ఉంటున్నాయి. కుటుంబాలతో కలిసి దేశం నలుమూలల నుంచి ఇక్కడకు పర్యాటకులు వస్తున్నా పర్యాటక శాఖ కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదు. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది తిరిగి వెళ్తున్నారనే దానిపై ఒకపట్టాన అవగాహన ఉండడం లేదు. లక్షలాది మంది వచ్చిపోయే పర్యాటక ప్రాంతంలో నది లోతు, ప్రమాద స్థలాలు, ఇసుక తినె్నలు తదితరాలను గుర్తించి కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఏటా ప్రమాదాల రూపంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. పర్యాటకులు ప్రమాదాల్లో నీట మునిగి జల సమాధి అవుతుంటే ఇక్కడ వాస్తవ పరిస్థితులు కూడా ఎవరికీ కనిపించక జల సమాధి అవుతున్నాయి.
ప్రాణాలతో చెలగాటం
ఏడాదికి సుమారు 5 లక్షల మంది పర్యాటకులు దేశవ్యాప్తంగా పాపికొండల అందాలను, ప్రకృతిని ఆస్వాదించేందుకు వస్తున్నారు. అభయారణ్యంలో ఉన్న పాపికొండలకు వస్తున్న పర్యాటకులకు మాత్రం ఎటువంటి రక్షణ ఉండటం లేదు. పిల్ల పాపలతో హాయిగా నదిలో ప్రయాణించే వారంతా తిరిగి ఒడ్డుకు చేరే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. అటు లాంచీ నిర్వాహకులు నిబంధనలను పాటించడం లేదు. ఇటు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పర్యాటకం కాస్తా ప్రమాదకరంగా మారుతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు ఇక్కడ ప్రాణాలు విడుస్తున్నారు. మరికొందరు గాయాలతో తిరిగి వెళ్తున్నారు. ముఖ్యంగా పాపికొండల పర్యాటకంలో లాంచీ నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు సరిహద్దున ఉన్న వీఆర్ పురం మండలం నుంచి, రాజమండ్రి నుంచి పాపికొండలకు నిత్యం లాంచీలు తిప్పుతున్నారు. కానీ లాంచీల్లో భద్రత మాటేమిటి..? పాపికొండల విహార యాత్రలో రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. ఎక్కడో మూలన పడేసిన లాంచీలను కొనుగోలు చేసి వాటికి రంగులు అద్ది నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పర్యాటకులను తిప్పుతున్నారు. ఇది బహిరంగ రహస్యమైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. పర్యాటక శాఖ లాంచీలను నామమాత్రంగా తిప్పడంతో ప్రైవేట్ లాంచీల ఇష్టారాజ్యం ఇక్కడ ఎక్కువైంది. తిప్పేందుకు వీలు లేని లాంచీలను అధికారులకు మామూళ్లు ఇస్తూ నడిపిస్తున్న ప్రైవేట్ ఆపరేటర్లు పర్యాటకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు బోటింగ్‌కు అనుమతి ఇవ్వాలంటే అనేక కఠిన నిబంధనలు పాటించాలి. సాగునీరు, పీడబ్య్లూడీ, రెవెన్యూ, మత్స్య శాఖల నుంచి అనుమతి పత్రాలు సమర్పిస్తేనే ప్రైవేట్ లాంచీ ఆపరేటర్లతో పర్యాటక శాఖ అగ్రిమెంట్ చేసుకుటుంది. అయితే ఇన్ని కఠినమైన నిబంధనలు ఉన్నా పట్టించుకోకుండా యథేచ్ఛగా లాంచీలను తిప్పడం గమనార్హం. పర్యాటకులను లాంచీ ఎక్కించుకుంది మొదలు వారి భద్రతను పర్యవేక్షించేందుకు నదిలో గజ ఈతగాళ్లు తప్పనిసరిగా ఉండాలి. కానీ లాంచీ నిర్వాహకులు ఆ విషయానే్న విస్మరిస్తున్నారు.

అచ్చోసిన నిర్లక్ష్యం..
నదులు, జలాశయాలు, సముద్రం నీటిపై విహారమంటే పర్యాటకులకు లైఫ్ జాకెట్లు ఇవ్వాల్సిందే. పర్యాటక శాఖకు చెందిన బోట్లలో ఈ నిబంధనలు కచ్చితంగా పాటిస్తారు. ఒడ్డుపై లైఫ్ జాకెట్ వేసుకున్నాకే పడవలోకి అనుమతిస్తారు. కానీ ప్రపంచ దృష్టిని ఆకర్షించే పాపికొండల ప్రయాణంలో లాంచీ నిర్వాహకులు దీన్ని పట్టించుకోవడం లేదు. అత్యంత దారుణమేమిటంటే పర్యాటకులు లైఫ్ జాకెట్లు అడిగినా నిర్వాహకులు ‘మేమున్నామనే’ సమాధానం ఇస్తున్నారు. అడపాదడపా ప్రమాదాలతో అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు చిన్నపాటి లైఫ్ జాకెట్లను చూపుతున్నారు. ఇవి 15 కేజీల బరువును మాత్రమే తట్టుకునేలా అంటే చిన్నపిల్లలు ఉపయోగించేందుకు వీలుగా మాత్రమే ఉన్నాయి. అవి కూడా అరకొరగా ఉంచుతున్నారు. పైగా అలంకారప్రాయంగా మారిపోయాయి. లైఫ్ జాకెట్లు ధరించడం వల్ల ఎలాంటి ప్రమాదం జరిగినా సురక్షితంగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే వేసవి కాలంలో పాపికొండల ప్రయాణం ప్రమాదమని పలుసార్లు నిరూపణ అయింది. గోదావరి నదిలో నీరు తగ్గి ఇసుకదిబ్బలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో లాంచీలను రూట్ మ్యాప్ లేకుండా నడుపుతున్నారు. గతంలో ఇలా లాంచీ నది మధ్యలో ఇసుక దిబ్బల్లో ఇరుక్కుపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. రెండు గంటల తర్వాత మరొక లాంచీ వచ్చే వరకు ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఇదిలా ఉంటే పాపికొండలకు పర్యాటకులను చేరవేస్తున్న లాంచీల్లో ఎటువంటి అగ్నిమాపక పరికరాలూ కనిపించడం లేదు. దేవీపట్నం వద్ద శుక్రవారం లాంచీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇవన్నీ తెరపైకి వస్తున్నాయి. ఇక లాంచీల్లో ఎంతమంది పర్యాటకులు ఎక్కుతున్నారో కూడా రికార్డుల్లో ఉండటం లేదు. ఎందుకంటే ఒక్కో ప్రయాణికుడిపై పర్యాటక శాఖకు ఇంత మొత్తం అని చెల్లించాల్సి ఉంటుంది. అందుకే పర్యాటకుల సంఖ్యపై ఆపరేటర్లు సరైన రికార్డులు నిర్వహించడం లేదు. పాపికొండల్లో తిరుగుతున్న లాంచీల్లో ఒక్కదానికి కూడా రాష్ట్ర జల వనరుల శాఖ, జాతీయ అంతర్గత రవాణా సంస్థల అనుమతులు కూడా లేవు. కనీసం ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు కూడా ఇక్కడ మార్గం లేకుండా పోయింది. దీంతో గత ఏడాది ఇద్దరు ప్రయాణికులు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు.

చీకటిమాటున చిందులు
పాపికొండల అభయారణ్యంలో చట్టాలకు తూట్లు పొడుస్తూ కొందరు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అధికారులు కనె్నత్తి చూడక పోవడంతో నిబంధనలు పక్కదారి పడుతున్నాయి. అభయారణ్యంలో ఉన్న పాపికొండల్లో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధమైనా ఎంతోకాలంగా మద్యం అమ్మకాలు ఈ ప్రాంతంలో జోరుగా సాగుతున్నాయి. వైల్డ్ లైఫ్ నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలో ఫ్లాస్టిక్‌ను నిషేధించారు. కానీ ఆ నిబంధనలు ఎవరికీ పట్టడం లేదు. వైల్ట్ లైఫ్, ఎక్సైజ్ అధికారులు పర్యాటకులు ఎలాపోతే మాకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. ప్లాస్టిక్ నియంత్రణ సాధ్యపడటం లేదు. మద్యం మత్తులో పర్యాటకులు నదిలో దిగి లోతు తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పర్యాటకుల విడిది కోసం బ్యాంబో హట్స్‌ను ఏర్పాటు చేసిన కొందరు ఈ ప్రాంతంలో చీకటిమాటున అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నట్లు పలుమార్లు వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల క్రితం హైదరాబాద్, ఖమ్మం నగరాలకు చెందిన కొందరు పర్యాటకులు భోజనం బాగు లేదని చెప్పడంతో నిర్వాహకులు, వారి అనుచరులు వెంటపడి కర్రలతో కొడుతూ పరుగులు పెట్టించారంటే ఇక్కడ ఎంత దౌర్జన్యం సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అభయారణ్యంలో ముఖ్యంగా లక్షలాది మంది వచ్చే పాపికొండల ప్రాంతంలో కనీసం సెల్‌ఫోన్ సిగ్నల్ వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో బాహ్య ప్రపంచానికి ఇవన్నీ తెలియడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పర్యాటకుల భద్రతపై ఆలోచించాలి. లాభాపేక్ష తప్ప ప్రజల సౌకర్యాలను పట్టించుకోని లాంచీ నిర్వాహకులు, పాపికొండల్లో తిష్టవేసిన దళారుల చీకటి వ్యాపారాన్ని నియంత్రించాలి.