రాష్ట్రీయం

తెలంగాణలో టీడీపీనే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారనున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. గురువారం నాడు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో 6 శాతం ఓట్లు తమ పార్టీకి దక్కాయని, ప్రస్తుతం ఓట్ల శాతం 12 శాతానికి పెరిగిందని, అందుచేత రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కీలకంగా వ్యవహరించబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పుట్టిందని ఆయన చెప్పారు. పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉండడానికి సమయం కేటాయిస్తానని చెప్పారు. బీజేపీ దుర్మార్గాలను ప్రజలకు ఎత్తిచూపించాల్సిన సమయం ఆసన్నమైనదని అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 14 సంత్సరాలుగా ప్రతి పక్షంలో ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో మనమే అధికారాన్ని చేపట్టడం ఖాయమని ఆయన భరోసా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని ప్రపంచానికి తెలిసిన విషయమన్నారు. ప్రపంచ నేతలు ఇక్కడకు రావడానికి ఇష్టపడకపోతే శంషాబాద్ విమానాశ్రయాన్ని చేపట్టింది తామేనని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే, ఆ ఇంటికి పెద్ద కుమారుడులాగా ఆదుకుంటున్నామన్నారు. అధికారం ఊరికే రాదు, కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం తెలుగుదేశం పార్టీకి కోట అన్నారు. తెలంగాణలో టీడీపీ ఎదురులేని శక్తిగా ఎదుగుతుందని ఆయన విస్పష్టంగా చెప్పారు. ఇకపై ప్రతి కార్యకర్త వచ్చే ఎన్నికల వరకు నిద్రపోకుండా కష్టపడాలని, ఎన్నికల అనంతరం స్వేచ్ఛగా తిరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మీరు కష్టపడండి తెలంగాణాలో అధికారాన్ని ఎలా రాబట్టాలో తాను చెబుతానని, మార్గనిర్దేశనం చేస్తానని ఆయన కేడర్‌కు సూచించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, గిరిజనులకు విశ్వవిద్యాలయాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేవారు. పార్టీ కార్యకర్తలు సైనికులుగా పని చేయాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌కు గుర్తింపు వచ్చిందంటే తన హయాంలో ఐటి అభివృద్ధికి చేసిన కృషే కారణమన్నారు. ఇక్కడ ఐటీని గణనీయంగా అభివృద్ధి చేయడం వల్లే తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు ఇనుమడించాయన్నారు. హైదరాబాద్ ఇంత సుందరంగా ఉందంటే అందుకు కారణం కూడా తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నగరంపై పెట్టిన ప్రత్యేక దృష్టే కారణమని బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐటి రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే నేడు యువతకు లక్షలాది ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. తాను దూరదృష్టితో పని చేయడం వల్లే నేడు తెలంగాణలో సంపద పెరిగిందన్నారు. కర్నాటకలో బీజేపిని ఓడించాలని తాము ప్రచారం చేసిన కారణంగానే అక్కడ అధికారానికి బీజేపీ దూరమైందన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపి నమ్మక ద్రోహం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుజాతిని అభివృద్ధి చేయడానికి ధర్మపోరాటం చేస్తున్నానని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో ఎకనామిక్ నాలెడ్జికి పునాది వేసింది తానేనని చెప్పారు, తెలంగాణలో టీడీపి జెండా రెపరెపలాడాలని అందుకు కేడర్ పూర్తి స్థాయిలో పని చేయాలన్నారు. టీడీపి బలంగా ఉన్నప్పడే మన చుట్టూ తిరగడానికి నేతలు ముందుకు వస్తారన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

చిత్రం..హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన మహానాడులో
విల్లును సంధిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు దరహాసం