రాష్ట్రీయం

పశ్చిమకు అల్లూరి పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 25: వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాకు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ విధంగా జిల్లాలో జన్మించిన క్షత్రియ యోధునికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరిలో పాదయాత్ర చేస్తున్న జగన్ శుక్రవారం సాయంత్రం ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు, గుమ్మలూరు సెంటర్లలో బహిరంగ సభలో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించినప్పటికీ ఇక్కడ ప్రజలు, రైతులకు ఏవిధమైన మేలు చేయకుండా చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు ఉండగా, ఆ రైతులు అన్ని విధాలా ఇబ్బందులుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వైకాపా అధికారంలోకి వస్తే ఆక్వా రంగానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా ఆ రైతుల కోసం అప్పట్లో మహానేత వై ఎస్ ఆర్ ఆరు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేశారని, అయితే ఇప్పుడు చంద్రబాబు ఆ సబ్‌స్టేషన్లకు కరెంటు సరఫరా చేయడం లేదన్నారు. ఇక రొయ్యలు, చేపలకు ఏ మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదని, వ్యాపారులంతా సిండికేట్ కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు స్వయంగా దళారీగా మారారని, అందువల్లే రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఉండి నియోజకవర్గంలో చుట్టూ నీరు ఉన్నప్పటికీ తాగడానికి మాత్రం గుక్కెడు నీరుండదని, బోరు వేస్తే ఉప్పునీరు వస్తోందని, నీళ్లు లేక చేపల చెరువులు, రొయ్యల చెరువులుగా మారుస్తున్నారన్నారు. దీని వలన భూగర్భభ జలాలు కూడా కలుషితమవుతున్నాయని చెప్పారు. సమస్యలు ఇలా ఉండగా, ఎమ్మెల్యే అడగ్గానే ఏలూరు సమీపంలో ఎకరం కోటిన్నర విలువ చేసే భూమిని కేవలం 12.50 లక్షల రూపాయలు చొప్పున ఏకంగా 350 ఎకరాలు అప్పనంగా ఇచ్చేశారన్నారు. ముడుపులు కోసమే ఈ విధంగా చంద్రబాబు భూమిని ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.
అన్ని వర్గాలకు ఎంతో మేలు చేసిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన రామరాజ్యం కాగా, గత నాలుగేళ్లలో సాగుతున్న చంద్రబాబు పాలన రాక్షస పాలన అని ఆయన అభివర్ణించారు.చంద్రబాబు పాలనలో మనం చూసింది కేవలం అబద్దాలు చెప్పడం, మోసం చేయడం, అవినీతి చేయడం, రాజ్యాంగాన్ని హేళన చేయడం, అడ్డగోలుగా సంపాదించిన నల్లధనంతో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తూ అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోవడం ఇదే చంద్రబాబు పాలన అంటూ ఆయన ఎద్దేవాచేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. బెల్టుషాపులు తొలగిస్తామని చెప్పిన బాబు పాలనలో నాలుగేళ్ల తరువాత చూస్తే మినరల్ వాటర్ లేకపోయినా గ్రామాల్లో మద్యం మాత్రం దొరుకుతోందన్నారు. రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ పై అత్యధిక సన్ను వసూలు చేస్తున్నారన్నారు.
కష్టపడి వరి పండిస్తే మార్కెట్‌లో కనీస ధర రావడం లేదని, వరి మద్దతు ధర రూ.1550 ఉంటే మార్కెట్‌లో రూ.1130 కూడా రావడం లేదన్నారు. దీని వలన రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఉదయం పెదకాపవరం శివారు నుండి ప్రారంభమైన పాదయాత్ర చినకాపవరం మీదుగా గుమ్ములూరు, కోళ్లపర్రు మీదుగా ఆకివీడు వరకు సాగింది. మార్గం మధ్యంలో పలువురు తమ సమస్యలను విన్నవించారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఆకివీడు మండల ఉపాధ్యాయులు వినతిపత్రం సమర్పించారు.