రాష్ట్రీయం

తేమ రహిత గ్యాస్‌కు ఎందుకింత తాత్సారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 25: వివిధ సంస్థలకు సహజవాయువు (నేచురల్ గ్యాస్) సరఫరా సందర్భంగా తలెత్తే ప్రమాదాల నివారణకు ఓఎన్జీసీ కేజీ బేసిన్‌లో అత్యాధునిక విధానంలో చేపట్టిన గ్యాస్ డీహైడ్రేషన్ ప్లాంట్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. సహజవాయువులో ఉండే తేమను తొలగించేవే ఈ డీహైడ్రేషన్ ప్లాంట్లు. ఎంపికచేసిన బావుల నుండి వెలికితీసే చమురు, సహజ వాయువులను ఓఎన్జీసీ పైపులైన్ల ద్వారా సమీపంలోని కలెక్టింగ్ స్టేషన్లకు చేరుస్తుంది. సహజవాయువును వివిధ పరిశ్రమలు ఇంథనంగా ఉపయోగిస్తుంటాయి. అందువల్ల పైపులైన్ల ద్వారా సహజవాయువును ఆయా పరిశ్రమలకు సరఫరాచేస్తారు. అయితే బావుల నుండి వెలికితీసి, సరఫరాచేసే సహజవాయువులో కొంత శాతం తేమ ఉంటుంది. ఇలాంటి తేమ ఉన్న గ్యాస్ కారణంగా ప్రమాదాలు తలెత్తే అవకాశాలుండటంతో తేమలేని గ్యాస్ సరఫరా చేయాలని సహజవాయువు ఉపయోగించుకునే సంస్థలు కోరుతున్నాయి. సంస్థలు కోరినట్టు గ్యాస్‌లో తేమ శాతం లేకుండా చేయాలంటే డీహైడ్రేషన్ ప్లాంట్లు నెలకొల్పాల్సివుంది. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన తూర్పు గోదావరి జిల్లా ‘నగరం’ గెయిల్ గ్యాస్ పైపులైన్ విస్ఫోటనం తేమ ఉన్న గ్యాస్ కారణంగానే తలెత్తిందని నిపుణులు తేల్చారు. 2014లో సంభవించిన ఈ ప్రమాదంలో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన సంగతి విదితమే. గ్యాస్‌లో ఉండే తేమ
కారణంగా పైపులైన్లు తుప్పుపట్టి, క్రమంగా బీటలు వారి గ్యాస్ లీకేజీ, పేలుడు వంటి ఘటనలకు అవకాశముంటుంది. నగరంలో సంభవించిన ప్రమాదం ఈ కోవకు చెందినదే. దీనితో గ్యాస్ కొనుగోలు చేసే పారిశ్రామిక సంస్థలు తేమరహిత గ్యాస్ కావాలని డిమాండుచేస్తున్నాయి. కొన్ని సంస్థలైతే తేమవున్న గ్యాస్ తీసుకోవడానికి విముఖత వ్యక్తంచేస్తున్నాయి. కాగా నగరం ప్రమాదం నేపథ్యంలో ఓఎన్జీసీ ఏనాటి నుండో ఉపయోగిస్తున్న పైపులైన్ల స్థానంలో కొత్త పైపులైన్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే సుమారు 900 కిలో మీటర్ల వరకు గ్యాస్ పైపులైన్ నిర్మాణం పూర్తయింది. అలాగే తేమ లేని గ్యాస్ సరఫరా చేయాలని ఓఎన్జీసీ నిర్ణయించింది. ఇందుకోసం తొమ్మిది చోట్ల డీ హైడ్రేషన్ ప్లాంట్లు ఏర్పాటుకు చర్యలుచేపట్టింది. ఈ క్రమంలో 2015లో కోట్ల రూపాయల వ్యయంతో టెండర్లు పిలిచి, ఏజెన్సీని కూడా ఓఎన్జీసీ ఖరారుచేసింది. అహ్మదాబాద్‌కు చెందిన ‘డీప్ ఇండస్ట్రీస్’ అనే సంస్థకు ఈ పనుల కాంట్రాక్టు
దక్కింది. ఈ సంస్థ తూర్పు గోదావరి జిల్లాలోని పాశర్లపూడి జీసీఎస్, మండపేట, యండమూరు, నర్సాపురం, తాటిపాక జీసీఎస్, కేశనపల్లి, మోరి తదితర తొమ్మిది ప్రాంతాల్లో డీహైడ్రేషన్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. పనులు జరుగుతున్న క్రమంలో డీ హైడ్రేషన్ల ప్లాంట్ల నిర్మాణ పనులను ఓఎన్జీసీ హఠాత్తుగా నిలుపుచేసి, టెండరు రద్దుచేసింది. తిరిగి టెండర్లు పిలిచి, ముంబైకి చెందిన ‘జాన్ ఎనర్జీ’ అనే సంస్థకు పనులు అప్పగించింది. ఈ సంస్థకు 300 రోజుల్లో పనులు పూర్తిచేయాల్సిందిగా గత నవంబర్‌లో నిర్దేశించింది. ఈ గడువు కాస్తా మే 26 అంటే నేటితో పూర్తవుతోంది. అయితే కొత్తగా పనులు అప్పగించిన సంస్థ కనీసం సగం ప్లాంట్ల నిర్మాణం కూడా పూర్తిచేయలేకపోయింది. దీనికి తోడు నాసిరకం మిషనరీని వినియోగించారని కూడా ఓఎన్జీసీ స్థానిక అధికారులు ఓఎన్జీసీ ఈడీ-అసెట్ మేనేజర్, సీఎండీ, ఆన్‌షోర్ డైరెక్టర్ తదితరులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. నాసిరకం మిషనరీ వినియోగించడం వల్ల వెట్ గ్యాస్ అయినా, డ్రై గ్యాస్ అయినా పైపులైన్లలో ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంటుందని, దీనివల్ల తలెత్తే సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని ముందుగానే సంబంధిత అధికారులు తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు.
అర్ధాంతరంగా ఆగిపోయిన ఈ పనులను పాత కాంట్రాక్టరుకే ఇచ్చి చేయిస్తారా లేక కొత్త కాంట్రాక్టర్ ద్వారా నాణ్యత కలిగిన పనులను చేయిస్తారా అనేది తేలాల్సి వుంది. తేమతో కూడిన గ్యాస్ తీసుకోవడానికి కొన్ని సంస్థలు విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తులు మందగించే అవకాశముంది. ఏదేమైనప్పటికీ ప్రమాదావకాశాలు తక్కువగా ఉండే తేమ రహిత గ్యాస్‌కు డిమాండు పెరుగుతున్న క్రమంలో ఓఎన్జీసీ ఎందుకు తాత్సారం చేస్తోందనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధ్యమైనంత త్వరలో నాణ్యమైన సామాగ్రితో గ్యాస్ డీ హైడ్రేషన్ ప్లాంట్లను పూర్తిచేయాలని నిత్యం గ్యాస్ పైపులైన్ల నడుమ జీవనం సాగించే గోదావరి జిల్లాల వాసులు కోరుతున్నారు.