రాష్ట్రీయం

పెళ్లకూరువద్ద ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లకూరు, మే 26: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోడానికి వెళుతూ నలుగురు దుర్మరణం చెందడం, మరో 12 మందికి తీవ్రగాయాలైన హృదయ విదారకమైన సంఘటన మండల పరిధిలోని పెళ్లకూరు వద్ద శనివారం తెల్లవారుఝామున చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేట -పూతలపట్టు 71వ నంబరు జాతీయ రహదారిపై మండల కేంద్రమైన పెళ్లకూరు సమీపంలో శనివారం తెల్లవారు ఝామున గుంటూరు జిల్లా వెల్లటూరు మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన పత్తి శ్రీనివాసులు-కోటేశ్వరి దంపతులు వారి కుమారుడు సాయివెంకటకిరణ్(3) , కుమార్తె పూజిత(2)లకు తలనీలాలు శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో సమర్పించాలన్న కోరికతో బంధువుల సమేతంగా వారు తుఫాన్ జీపు వాహనంలో తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నాయుడుపేట వద్ద కొద్దిసేపు కారు ఆపి కాఫీ తాగి తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో మళ్లీ ప్రయాణం చేస్తుండగా పెళ్లకూరు వద్ద జామాయిల్ కొయ్యల లోడుతో శ్రీకాళహస్తి వైపు వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి పరార్ కావడంతో ట్రాక్టర్‌లో ఉన్న కొయ్యలు రోడ్డు మీద జారిపడ్డాయి. అదే సమయంలో ఆవైపుగా వస్తున్న తుఫాన్ జీపును బెంగళూరు నుండి బాపట్లకు ప్రయాణికులతో వెళ్తున్న వినాయక ట్రావెల్స్ ప్రైవేటు బస్సు అతివేగంగా వెళుతూ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న జీపును వచ్చి ఢీకొంది. దీంతో జీపు నడుపుతున్న డ్రైవర్ వెన్నపూస పుల్లారెడ్డి(26) క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి మృతి చెందాడు. ఇతను ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అందులో ప్రయాణిస్తున్న మాచబోయిన సుబ్బులు(50) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈమె గుంటూరు జిల్లా వెల్లటూరు మండలం నాయుడుపాలెం మండలంగా తెలిసింది. ప్రమాద సంఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు , స్థానికులు స్పందించి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారులు సాయి వెంకటకిరణ్, పూజితలను నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారు ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పత్తి శ్రీనివాసులు, కోటేశ్వరి, ఆదిలక్ష్మి, ఆంజనేయులు, చరణ్, వడ్ల భార్గవి, భూలక్ష్మి, ఇరుమళ్ల శ్రీను, ఎడ్ల నాగరాజు, మరో ఇద్దరిని స్థానిక ఎస్సై షేక్ మహ్మద్ హనీప్ తన వాహనంలో నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈప్రమాదానికి కారకుడైన బస్సు డ్రైవర్ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని నాయుడుపేట ఇంచార్జి సిఐ ఉప్పాళ్ల సత్యనారాయణ, ఎస్సై హనీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.