రాష్ట్రీయం

బాబు వైపే తెలంగాణ చూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తెలంగాణ ప్రజలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు సామాజిక న్యాయం కోసం అక్కడ పోరాటం చేస్తున్నామని, అవకాశం వచ్చినప్పుడు సామాజిక న్యాయం అమలు చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో టీఆర్‌ఎస్ పాలనలో కొరవడిన సామాజిక న్యాయం అంశంపై తీర్మానాన్ని ఆదివారం రమణ ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలు, దళితులకు అవకాశాలు లేదని ఆరోపించారు. అధికారం ఉంటే పెత్తనం చలాయించవచ్చని ఆయన భావిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో పేదలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 5.3 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ రూపొందించినప్పటికీ పేదల జీవితాలు ఇప్పటికీ బాగుపడలేదన్నారు. పెత్తందారీ వ్యవస్థ కొనసాగుతోందని, అది పోవాలంటే టీడీపీ రాక అవసరమని చెప్పారు. నీతిగా పాలన అందించే టీడీపీ వైపు ప్రజలు ఆశగా చూస్తున్నారన్నారు. ఆరు ఎంపీ స్థానాల్లో టీడీపీ, మరో 10 స్థానాల్లో భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు. 10 ఎంపీ స్థానాల్లో గెలిస్తేనే అసలైన టీడీపీ వారసులుగా భావిస్తామన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని, బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ ప్రతిపాదనను కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారని ఆరోపించారు. నాలుగేళ్లుగా కుటుంబ పాలన సాగుతోందని, దానికి తెరదించాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీపీ ప్రధాన కార్యదర్శి బుల్లం మల్లయ్య మాట్లాడుతూ అనేక మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఉద్యోగాలు ఎక్కడ వస్తాయంటూ చెప్పే పరిస్థితి దాపురించిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ది దొరల పాలనని, రైతులకు బేడీలు వేసి నడిపించారని గుర్తుచేశారు. గతంలో ఉద్యమించిన ప్రజాసంఘాలు టీఆర్‌ఎస్‌లో లేవని తెలిపారు. దొరల పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ టీడీపీ ఏర్పాటే సామాజిక న్యాయం కోసం అని గుర్తుచేశారు. బలహీన, బడుగు వర్గాలకు గుర్తింపు ఇచ్చింది తమ పార్టీయేనని తెలిపారు. అభివృద్ధి, రాజకీయాల్లో అధికారంలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉంటేనే తృప్తి, ఆనందం అంటూ వ్యాఖ్యానించారు. పార్టీ సుస్థిరంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణాలో సామాజిక న్యాయం కోసం పోరాడతామని సామాజిక న్యాయం కోసం పాటుపడుతుంది కనుకనే అక్కడి ప్రజల గుండెల్లో టీడీపీ నిలిచిఉందని గుర్తుచేశారు. సామాజిక న్యాయం పాటిస్తామని, సమతుల్యత కూడా చేస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది చేస్తున్న కుట్రలో భాగంగా తనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనవల్లనే పైకి వచ్చినవారు కుట్రదారులతో కలిసి విమర్శిస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల సాధికారితే తమ పార్టీ లక్ష్యమని అవకాశం వచ్చినప్పుడు సామాజిక న్యాయం అమలుచేస్తామని స్పష్టం చేశారు. తనను విమర్శించేవారు వేరే పార్టీల్లో జరిగే అన్యాయం గురించి కనీసం నోరెత్తిలేకపోతున్నారని అన్నారు. అటువంటి వారికి టీడీపీని విమర్శించే హక్కు లేదని విమర్శించారు.

చిత్రం..మహానాడులో ప్రసంగిస్తున్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ