రాష్ట్రీయం

టీడీపీ నుంచి మోత్కుపల్లి బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), మే 28: గవర్నర్ పదవి రాలేదన్న అక్కసుతో పార్టీపై, పార్టీ అధినేతపై బహిరంగ విమర్శలు చేస్తున్న మోత్కుపల్లి నరసింహులును పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్వీ రమణ ప్రకటించారు. తన విపరీత ధోరణితో బహిష్కరించేలా ప్రవర్తించిన మోత్కుపల్లి ఏం అర్హత ఉందని ఎన్టీర్‌తో కేసీఆర్‌ను పోల్చుతారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కొందరు కుట్రదారులతో చేతులు కలిపిన మోత్కుపల్లి పార్టీ కేడర్‌ను బలహీనపరిచేలా ప్రవర్తిస్తుండటంతో బహిష్కరణ వేటు వేసినట్లు తెలిపారు. విజయవాడలో రెండు రోజులుగా జరుగుతున్న టీడీపీ మహానాడు మీడియా పాయింట్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎల్వీ రమణ మాట్లాడారు. యువకునిగా పార్టీలో చేరిన మోత్కుపల్లి ఇటీవలి కాలంలో విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారని ఆయనన్నారు. టీడీపీలో గతంలో సంక్షోభాలు, రాజకీయ, ప్రభుత్వ పరంగా ఎన్ని సమస్యలు వచ్చినా అందరం కలిసి మొక్కవోని దీక్షతో ఎదురీది పార్టీని కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. కానీ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నాటకీయ పరిణామాలు, కుట్ర రాజకీయాలతో తెలంగాణలో పార్టీ నాయకత్వాన్ని, రాష్ట్రంలో పార్టీని
బలహీన పరిచేలా ఆయన ప్రవర్తించారని విమర్శించారు. దీన్ని పార్టీ సీరియస్‌గా పరిగణిస్తోందన్నారు. రాష్ట్ర నాయకత్వం దీనిపై పూర్తిగా సమీక్ష నిర్వహించిందన్నారు. వాస్తవాలు, రాజకీయ పరిణామాలు, అందులో మోత్కుపల్లి పాత్రపై క్షుణ్ణంగా చర్చించామన్నారు. గతంలో మోత్కుపల్లికి గవర్నర్ పదవి కోసం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసి సంప్రదింపులు జరిపారని, ఇదే విషయాన్ని నాడు వెంకయ్య నాయుడు కూడా ధ్రువీకరించినట్లు తెలిపారు. తమిళనాడు వంటి రాష్టమ్రైతే వెళతానని, కేరళలో ఇస్తే భాషాపరమైన ఇబ్బందులు వస్తాయని తనతోనూ మోత్కుపల్లి చర్చించారని ఆయన గుర్తుచేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు సైతం ముగియటం, గవర్నర్ పదవి రాకపోవడంతో గత దసరా నుండి ఆయన పార్టీ పట్ల విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నట్లు చెప్పారు. పరిణతి, అనుభవం కలిగిన నేత ఆవేదన, ఆందోళనతో ఏదో మాట్లాడి ఉండవచ్చని ఇప్పటివరకు ఓపిక పట్టామన్నారు. కేంద్ర కమిటీకి, జాతీయ అధ్యక్షునికి ఎలాంటి సంబంధం లేని అంశాలపై ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ముందు మోకరిల్లేలా మోత్కుపల్లి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. స్వార్థ రాజకీయాలు, తాత్కాలిక ప్రయోజనాల కోసం కొందరు పార్టీని వీడినప్పటికీ కేడర్ నిరుత్సాహ పడకుండా టీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక పాలనపై పోరాడుతున్న సమయంలో సీనియర్ నేతగా వెన్నంటి ఉండాల్సిన మోత్కుపల్లి పార్టీని అస్థిర పరిచేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర కమిటీ నిర్ణయంతో తెలంగాణలో దిగ్విజయంగా మినీ మహానాడు 17 పార్లమెంట్ స్థానాల్లో నిర్వహించుకున్నామని, వాటికి మోత్కుపల్లి కనీసం హాజరు కాలేదన్నారు. తెలంగాణలో ఇసుక మాఫియా దళితులపై దాడి చేసినపుడు, మంద కృష్ణమాదిగను అరెస్టు చేసినప్పుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన మోత్కుపల్లి ఇప్పుడు కేసీఆర్ ఎన్టీఆర్‌కు ప్రతిరూపమని ఎలా అనగలుగుతున్నారంటూ ప్రశ్నించారు. మేక వనె్న పులిలా నేడు తన నిజరూపాన్ని బయటపెట్టారని ధ్వజమెత్తారు. మోత్కుపల్లి ప్రవర్తన క్షమించరానిదన్నారు. అనుభవజ్ఞుడైన ఆయన ప్రవర్తనతో అందరం బాధపడుతూనే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని, 2019లో తెలంగాణలో పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఎల్వీ రమణ ధీమా వ్యక్తం చేశారు.
చిత్రం..మోత్కుపల్లి నరసింహులు