రాష్ట్రీయం

రక్తమోడిన రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 29: సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ఘటన మరువకముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రం ఉలిక్కిపడేలా చేసింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఏడుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయ. పదుల సంఖ్యలో ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. ఒళ్లు జలదరించే బీభత్స ప్రమాద ఘటన అందరినీ కలిచివేసింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామం వద్ద కరీంనగర్ -వరంగల్ హైవేపై మంగళవారం ఉదయం ఈ ఘోరం చోటుచేసుకుంది. మానకొండూర్ మండలం ముంజంపల్లికి చెందిన పిల్లి లక్ష్మి (58), హన్మకొండలోని గోపాల్‌పూర్ కాలనీకి చెందిన రాయబారి సుభాషిణి (40), జమ్మికుంట పట్ణణానికి చెందిన గుండా హరిప్రసాద్ (35), వరంగల్ జిల్లా గీసుకొండకు చెందిన అయిలోని నాగరాజు (28), సైదాపూర్ మండలం దుద్దెనపల్లికి చెందిన పేరాల ప్రభాకర్‌రావు (56), హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన జాకీర్ హుస్సేన్ (50) అక్కడికక్కడే మృతి చెందారు. యూపీలోని అలహాబాద్‌కు చెందిన రాజేష్‌కుమార్ పటేల్ (48)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ప్రమాదంలో 32 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్ నుంచి కరీంనగర్ వైపునకు వస్తున్న (టీఎస్02జడ్- 2099) నెంబరుగల హుజురాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో
మొత్తం 51మంది ప్రయాణిస్తున్నారు. మానకొండూర్ మండలం చెంజర్ల వద్దకు రాగానే ఎదురుగా కరీంనగర్ నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న (ఆర్‌జె09జీసీ-5178) నెంబరు గల రాజస్థాన్‌కు చెందిన లారీ ముందున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సును ఢీకొని ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెనుక మూడో సీటు నుంచి లారీ దూసుకెళ్లడంతో, ఆ సీట్లల్లో కూర్చున్న ప్రయాణికులు చిన్నాభిన్నమయ్యారు. వీరితోపాటు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కొండపల్కలకు చెందిన చల్ల రాజయ్య అనే యువకుడు, సైకిల్‌పై వెళున్న చెంజర్ల గ్రామోవాసి ఎం.డి.ఉమర్‌లు గాయపడ్డారు. బస్సులోని ప్రయాణికుల హాహాకారాలు.. ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. సమాచారం అందుకున్న మంత్రి ఈటల రాజేందర్ తన కార్యక్రమాలు రద్దు చేసుకుని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే, సీపీ కమలాసన్‌రెడ్డితోపాటు పలువురు పోలీసు అధికారులు ఘటన స్థలికి చేరుకుని ప్రయాణికులను రక్షించే ఏర్పాట్లు సమీక్షించారు. మంత్రి రాజేందర్ స్వయంగా మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. క్షతగాత్రులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రితోపాటు అపోలోరీచ్, మ్యాక్స్‌క్యూర్, ప్రతిమ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 23 మంది, అపోలోరీచ్‌లో 15 మంది, మ్యాక్స్‌క్యూర్‌లో ఇద్దరు, ప్రతిమ ఆసుపత్రిలో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను మంత్రి రాజేందర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణలు పరామర్శించి మెరుగైన వైద్య సేవలందించాలని, అవసరమైతే హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులను ఆదేశించారు. ఘటనపై సీఏం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి రాజేందర్‌కు ఫోన్‌చేసి దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారు. సాయంత్రం రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండి రమణారావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని, క్షతగాత్రులకు ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించారు.
చిత్రం..ప్రమాదంలో నుజ్జునుజ్జయన ఆర్టీసీ బస్సు