రాష్ట్రీయం

‘అనంత’ మామిడికి అంతర్జాతీయ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 28: ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో పండుతున్న పండ్లకు అంతర్జాతీయ మార్కెట్ ఆహ్వానం పలుకుతోంది. ప్రస్తుతం మామిడికాయలు అధికంగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ పండే పండ్లు, కాసే కాయలు టేబుల్ వెరైటీ (నిల్వ ఉంచుకునే వీలు)వి కావడంతో విదేశాల్లో డిమాండ్ ఏర్పడింది. అలాగే అరటి, దానిమ్మ కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సుమారు 120 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో జపాన్, హాలెండ్‌కు ఎక్కువగా అనంతపురం నుంచి మామిడి, ఇతర పండ్ల ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. అలాగే యూకే, యూఎస్‌ఏ, అరబ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కాగా రైతులు నేరుగా విక్రయించుకోవడానికి ట్రేడింగ్ సౌకర్యం లేకపోవడంతో, పలు ప్రైవేటు కంపెనీలపై ఆధారపడాల్సి వస్తోంది. వారు రైతుల నుంచి కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది మామిడి ఉత్పత్తి 6 లక్షల మెట్రిక్ టన్నులు రావచ్చని అంచనా. ఇప్పటికే సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల కాయలు దిగుబడి వచ్చినట్లు ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేశారు. ఇటీవల జిల్లాలో గాలివాన, వడగండ్ల వర్షం కారణంగా పండ్లతోటలకు కొంత నష్టం వాటిల్లినా, మామిడి పంట అంతగా నష్టపోకపోవడం గమనార్హం. అయినా రూ.20 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. రూ.2 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ అందాల్సి ఉంది. మామిడి, దానిమ్మ, అరటి ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతుండటంతో అత్యధిక సంఖ్యలో రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. జిల్లాలో 53 వేల హెక్టార్లలో పండ్ల తోటలు ఉండగా, సుమారు 46 వేల హెక్టార్లలో పండ్లు ఉత్పత్తి అయినట్లు అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా జిల్లాలో బేనీషా, తోతాపురి, మల్లిక, రసాలు బంగినపల్లి, ఆల్ఫంజో, దహేరీ తదితర రకాల మామిడి కాయలతో పాటు అరటి, దానిమ్మ, కర్బూజాను రైతులు పండిస్తున్నారు. ప్రస్తుతం మామిడికాయల ఎగుమతి భారీగా ఉంటోంది. జిల్లాలో 80 శాతం ఉత్పత్తి అవుతున్న బేనీషా రకం మామిడికి మంచి డిమాండ్ ఉంది. కియారా ట్రేడ్ నేమ్‌తో ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ జిల్లాలో మామిడితో పాటు వివిధ రకాల పండ్లను సేకరించి ఎగుమతి చేస్తోంది. ఎయిర్ కార్గో ద్వారా ఎగుమతి చేయడం అధిక వ్యయంతో కూడుకుని ఉన్నందున, ఎగుమతిదారులు సముద్రయానంపైనే ఆధారపడక తప్పడం లేదు. ఎయిర్ కార్గో అయితే ఏ పండ్లు అయినా కిలో రూ.3 అదనపు ఖర్చు వస్తుందని, సముద్ర రవాణా ద్వారా ఖర్చు తక్కువకావడంతో వ్యాపారులు అనంతపురం జిల్లా నుంచి సేకరించిన పండ్లను కృష్ణపట్నం, చెన్నై, ముంబాయి పోర్ట్ నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం మామిడి రకాన్ని బట్టి టన్ను ధర రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతోంది. దానిమ్మ టన్ను రూ.1.30 లక్షలు, అరటి కిలో రూ.13.75 చొప్పున రైతులు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మామిడి పండ్లను విదేశాలతో పాటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ మార్కెట్లకు తరలిస్తున్నారు. 6 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతి అంచనా కాగా, ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఎగుమతి అయి ఉంటుందని అంచనా. ఇందులో బేనీషా రకం మామిడి వాటా అధికంగా ఉంది. రసాలు పేరున్న మామిడి పంట పూర్తయింది. ఇంకా తోతాపురి, మల్లిక రకం హార్కెస్టింగ్ సాగుతోంది. కాగా సుమారు లక్ష మెట్రిక్ టన్నుల మామిడి మన రాష్ట్రంలోనే వినియోగం అయినట్లు అంచనా. కాగా మరో 2 లక్షల మెట్రిక్ టన్నులు మేరకు మామిడి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బరాయుడు తెలిపారు. సీజన్ ఇంకా నెల రోజులు ఉండటంతో మామిడి రుచులను వినియోగదారులు ఆస్వాదించే అవకాశం ఉంది. జిల్లాలోని రొద్దం, పుట్టపర్తి, బుక్కపట్నం, కదిరి, తలుపుల, నల్లచెరువు, గాండ్లపెంట, ఎన్‌పీ కుంట, పెనుకొండ, బుక్కరాయసముద్రం, గార్లదినె్న, కల్యాణదుర్గం, శెట్టూరు, రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు తదితర మండలాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఆయా ప్రాంత మామిడి తోపులు తక్కువ విస్తీర్ణంలో ఉన్న రైతులు అధికంగా స్థానిక మార్కెట్లకే ప్రాధాన్యత ఇస్తుండగా, లీజ్‌కు ఎక్కువ తోపులు తీసుకున్న వారు ఎగుమతి చేసే కంపెనీలకు విక్రయిస్తున్నారు. దీంతో అనంతపురం జిల్లాకు అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది.