రాష్ట్రీయం

టీడీపీ నేతలలో ఉత్సాహం నింపని ‘మహానాడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే మిగిలి ఉన్నందున, తెలుగు దేశం పార్టీ మూడు రోజుల పాటు అట్టహాసంగా ‘మహానాడు’ నిర్వహించింది. విజయవాడలో 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన మహానాడుకు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ తదితర నాయకులు, కొంత మంది కార్యకర్తలూ హాజరయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికపై రమణను పక్కనే కూర్చోబెట్టుకున్నా, తెలంగాణలో పార్టీ బలోపేతం గురించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించలేదు. ఎపి రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంలో తెలంగాణలో పార్టీ పటిష్టంగా ఉందని పేర్కొన్నారు. కానీ వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలన్న కార్యాచరణ గురించి ప్రస్తావించలేదు. చంద్రబాబు తన ప్రసంగంలో తెలంగాణలో టిడిపికి ఢోకా లేదని, రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తామని చెప్పిన మాటలేవీ పార్టీ తెలంగాణ నాయకులకు రుచించలేదు. ఎందుకంటే పార్టీ రోజు, రోజుకూ బలహీనపడుతున్నదన్న ఆందోళన వారిని వెంటాడుతున్నది. 2014లో అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, డజను మంది టిఆర్‌ఎస్‌లో చేరారు. ఉన్న ముగ్గురిలో తాజాగా ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఆర్.కృష్ణయ్య పార్టీ కార్యాక్రమాల్లో పాల్గొనరు. ఈ నెల 24న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన టి.టిడిపి మహానాడుకూ ఆయన హాజరుకాలేదు. ఇక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఒక్కరే మిగిలారు. ఎంపీ మల్లారెడ్డి కూడా పార్టీ ఫిరాయించారు. ఇంకా అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులూ టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరారు. ఫిరాయింపులను నిలువరించే ప్రయత్నం చేయడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని, కనీసం చంద్రబాబు నాయుడైనా జోక్యం చేసుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. తాజాగా వంటేరు పార్టీ ఫిరాయించినా, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అసంతృప్తితో విమర్శలు చేస్తున్నా, నచ్చజెప్పే ప్రయత్నం చేయలేదని పార్టీ నాయకులే అంటున్నారు. దళిత నాయకుడైన మోత్కుపల్లిని కాపాడుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
నేనున్నాను..అని
ధైర్యం చెప్పని చంద్రబాబు
ముఖ్యమైన నాయకులు, సీనియర్లు ఇతర పార్టీల్లోకి ఫిరాయిస్తుంటే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల, కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటున్నదని పార్టీ నాయకులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి మహానాడు వేదిక నుంచి చంద్రబాబు నాయుడు పార్టీ తెలంగాణ నాయకులకు, కార్యకర్తలకు నేనున్నాను అని ధైర్యం చెప్పి ఉంటే బాగుండేదని, తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయిస్తానని, జిల్లాల్లో పర్యటిస్తానని, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించి, వారిని సైనికులుగా తీర్చిదిద్దుతానని చెప్పి ఉంటే బాగుండేదని వారు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు తన ప్రసంగంలో వైకాపా, బిజెపి, జన సేన పార్టీలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు గుప్పించినప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌పై పల్లెత్తు మాట అనలేదు. పార్టీకి 70 లక్షల మంది సైనికులు ఉన్నారని చెప్పారే కానీ తెలంగాణలో పార్టీ ఏ మేరకు బలంగా ఉంది?, ఎంత మంది సైనికులు ఉన్నారన్న అంశం ప్రస్తావించలేదు. ఇలాఉండగా పార్టీ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ బలంగా ఉందని, కార్యకర్తలు అధైర్యపడరాదని అన్నారు. అయితే మహానాడు వేదికపై తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయిస్తారని ఆయన తెలిపారు. ఈ నాలుగేళ్ళలో పార్టీ బలం పెరిగిందని, పూర్వ వైభవం తెచ్చేందుకు అందరమూ సమిష్టిగా కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేసే విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదని బక్కని నర్సింహులు అన్నారు.