రాష్ట్రీయం

మహా దగానాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 30: తెలుగుదేశం పార్టీ తాజాగా నిర్వహించింది మహానాడు కాదని, అది ఒక దగానాడు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అబద్ధాలు, మోసాలు, కుట్ర, కుతంత్రాలు, దగా, వంచన, వెన్నుపోటుపై సమావేశాల్లో పోటీలు జరిగాయన్నారు. ఈసారి జరిగిన చర్చల్లోనూ మరోసారి చంద్రబాబు ఛాంపియన్‌షిప్ సాధించారని, తరువాతి స్థానంలో నారా లోకేష్ నిలిచారన్నారు. తనపై విమర్శలే లక్ష్యంగా నేతల ప్రసంగాలు సాగాయన్నారు. అసత్య తీర్మానాలతోపాటు మంత్రులు అబద్దాల ప్రోగ్రెస్ రిపోర్టులు చదివారని ఆక్షేపించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ బుధవారం సాయంత్రం నర్సాపురం పట్టణంలోని స్టీమర్ రోడ్డులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వస్తే మత్స్యకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొత్తబోట్లకు రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. డీజిల్‌పై ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీని పెంచుతామన్నారు. చేపల వేటపై నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలకు నెలకు పది వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చేస్తామన్నారు. ప్రమాదవశాత్తూ మృత్యువాతపడిన మత్స్యకారులకు పది లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తామన్నారు. రాజధాని అమరావతిపై నాలుగేళ్లుగా సినిమా చూపిస్తున్నట్లుగానే నర్సాపురంలో వసిష్ఠ వారధిపై కూడా చంద్రబాబు సినిమా చూపిస్తున్నారన్నారు. ఆ వంతెన పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు జరగడం లేదన్నారు. అదేవిధంగా
బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ కూడా ఆయనకు ప్రతీ ఎన్నికల సమయంలో గుర్తుకు వస్తుందన్నారు. ఆ తరువాత మరచిపోతారన్నారు. ఈ ప్రాంతంలో నాలుగు వేల ఎకరాల్లో ఉప్పు సాగవుతుండగా దాదాపు ఆధారపడిన 10 వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉప్పు నిల్వకు గోడౌన్లు లేకపోగా, మార్కెట్‌లోనూ ధర లేదని చెప్పారు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పారు. నర్సాపురంలో చేతి అల్లికలమీద దాదాపు 15 వేల మంది మహిళలు జీవిస్తున్నారని, వారి బాగుకు మహానేత వైఎస్ ఇక్కడ లేసుపార్కు ఏర్పాటుచేసి, వారికి శిక్షణను కూడా ఇప్పించారన్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత కార్మికులకు మాదిరిగా చేతి అల్లికల వారికి కూడా ప్రోత్సాహం ఇచ్చే విధంగా వారికి కూడా నెలకు రెండు వేల రూపాయలు చొప్పున చెల్లిస్తామన్నారు. నాలుగేళ్లు బిజెపితో కాపురం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీకి విడాకులు ఇచ్చి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారన్నారు. 2017 మహానాడులో ప్రత్యేక హోదా అడగకుండా ప్యాకేజీ గురించి మాట్లాడిన చంద్రబాబు బిజెపితో తెగతెంపులయ్యాక 2018లో ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి 44 లక్షల మందికి పింఛను అందుతుండగా ఆ తర్వాత వాటిని 37 లక్షలకు తగ్గించారని చెప్పారు. మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో పింఛన్లు పెంచబోతున్నట్లు పత్రికల్లో లీక్‌లు ఇస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నాయకుడికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ పూర్తిగా పునరుద్ధరిస్తామని, వెయ్యి రూపాయలు దాటిన వైద్యం ఖర్చులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. అంతేకాకుండా ఖర్చులు పెరుగుతున్న పరిస్థితుల్లో అవ్వా, తాతలకు పింఛను మొత్తాన్ని రెండు వేల రూపాయలకు పెంచుతామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో అర్హులైన అక్కలకు 45 ఏళ్లకే రెండు వేల రూపాయల పింఛను ఇస్తామన్నారు.
కాగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం నాటికి 176వ రోజుకు చేరుకుంది. కొప్పర్రు శివారు నుంచి ప్రారంభమైన యాత్ర లిఖితపూడి, సరిపల్లి, చినమామిడిపల్లి మీదుగా నర్సాపురం వరకు సాగింది. సరిపల్లి వద్ద మేదర కులస్థులను జగన్ కలుసుకుని వారితో కొద్దిసేపు ముచ్చటించారు.

జగన్‌కు అస్వస్థత
* నేడు యాత్రకు బ్రేకు
ఏలూరు:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్రకు గురువారం విరామం ప్రకటించారు. జగన్మోహన్‌రెడ్డి తలనొప్పి, జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో ఆయన్ను పరీక్షించిన వైద్యులు మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ బుధవారం పాదయాత్ర కొనసాగించిన జగన్ ఎండవేడిమికి మరింత నీరసించడంతో వైద్యులు, పార్టీ నాయకుల సూచనల మేరకు గురువారం పాదయాత్రకు విరామం ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. జగన్ పాదయాత్ర శుక్రవారం యథావిథిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.