రాష్ట్రీయం

పొంచివున్న వరుణుడు --- ఉభయ గోదావరిలో మారిన వాతావరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, నవంబర్ 29: గోదావరి జిల్లాల్లో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదివారం మధ్యాహ్నం నుండి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. అప్పటి వరకు ఉన్న ఎండ మాయమై ఆకాశం మేఘావృతం కావటంతో పాటు, చలిగాలులు మొదలయ్యాయి. వాతావరణంలో సంభవించిన ఈ మార్పుతో గోదావరి జిల్లాల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉందన్న సమాచారంతో గోదావరి జిల్లాల రైతులు నిస్సహాయంగా చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలు, ఈదురు గాలులు కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు మళ్లీ వాతావరణంలో సంభవించిన మార్పుతో బెంబేలెత్తిపోతున్నారు. గత వారం రోజులుగా వాతావరణం పొడిగా ఉండటంతో గోదావరి జిల్లాల్లోని రైతులంతా వ్యవసాయ పనులు మొదలుపెట్టి, వర్షాల కారణంగా దెబ్బతినగా మిగిలిన పంటను జాగ్రత్త చేసుకునే పనిలోపడ్డారు. సరిగ్గా అదే సమయంలో మళ్లీ ఆకాశం మేఘావృతమవటంతో రైతులు బిక్కు బిక్కుమంటూ ఆకాశం వైపు చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే పొలాల్లోని మురుగు నీరు బయటకొచ్చి, నేల ఆరుతున్న నేపథ్యంలో మళ్లీ వర్షాలు కురిస్తే ఇక మిగిలిన పంట కూడా సర్వనాశనమవుతుందని రైతులు కలవరపడుతున్నారు. ఒక్క రోజు వర్షం కురిసినాగానీ పది రోజులు పనులు ఆగిపోతాయని, మొలకెత్తి, రంగు మారగా మిగిలిన పంట కూడా దెబ్బతింటుందని రైతులు చెబుతున్నారు. ఏదో విధంగా మిగిలిన పంటను జాగ్రత్త చేసుకునే పనిలో ఉన్న రైతులంతా ఒకేసారి పనులు మొదలుపెట్టడంతో ఇప్పటికే కూలి రేట్లు పెరిగాయి. అయినా సరే చేతికి ఎంత వస్తే అంత దక్కుతుందన్న ఆశతో రైతులు ఆతృతతో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో మళ్లీ వాతావరణంలో మార్పు సంభవించటంతో రైతులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ వర్షాలు కురిస్తే మాత్రం అంతో ఇంతో మిగిలి ఉన్న పంట కూడా దెబ్బతిని కనీసం కూలి ఖర్చులు కూడా దక్కవని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆ నైపుణ్యం ఇప్పుడేదీ?!
ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు రైతులు కోసిన పంటను కుప్పలుగా పోసి, వర్షాలు తగ్గిన తరువాత నూర్పిళ్లు చేపట్టేవారు. కుప్పలు వేయటంలో నాటి నైపుణ్యం నేటి రైతుల్లో చాలామందికి లేదు. గత కాలం నాటి రైతులు కుప్పలు వేస్తే, ఎంత వర్షం వచ్చినా చుక్క నీరు కూడా కుప్ప లోపలకు వెళ్లేది కాదు. కానీ ఇప్పటి రైతుల్లో చాలా మందిలో అంతటి నైపుణ్యం లేకపోవటం వల్ల వర్షాలు కురిసినపుడు కుప్పల్లోకి నీరు చొరబడి పంట మొత్తం కుళ్లిపోతోంది. కొన్ని చోట్ల ఈదురు గాలులకు కుప్పలే కూలిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

స్థిరంగా
ఉపరితల ఆవర్తనం
మరో 24 గంటల్లో
అల్పపీడనంగా మారే అవకాశం

విశాఖపట్నం, నవంబర్ 29: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని, ఇది రాగల 24 గంటల్లో బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. ఆవర్తనం అల్పపీడనంగా మారిన 24 గంటల తరువాత కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాగల 24 గంటల్లో కోస్తాలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే తీరం వెంబడి ఈశాన్య దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

నెల్లూరు, చిత్తూరుల్లో
మళ్లీ వర్షాలు
పొంగుతున్న వాగు దాటుతూ ఒకరు మృతి

నెల్లూరు, నవంబర్ 29: నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. వారం రోజుల క్రితం వరకు పొంగి ప్రవహించిన వాగులు, వంకలు ఇప్పుడిప్పుడే శాంతించగా, మళ్లీ పడుతున్న వానలతో ఇంకోమారు ప్రవాహం ఊపందుకుంటోంది. దక్షిణ కోస్తాలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో నెల్లూరు ప్రజానీకం భీతిల్లుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతోనే జిల్లాలోని దాదాపుగా అన్ని చెరువుల్లోనూ నీరు సమృద్ధిగా చేరింది. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 300కుపైగా చెరువులకు గండ్లు పడగా, ఇప్పుడు మళ్లీ వానలతో ఇంకొన్నింటికీ అదే మాదిరి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జిల్లాలోని అనుమసముద్రంపేట మండలం కావలిఎడవల్లి గ్రామం వద్ద ఓ వ్యక్తి వాగు దాటుతూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇదిలాఉంటే జిల్లాలోని సూళ్లూరుపేట పట్టణంతో సహా పరిసర గ్రామాల్ని కాళంగి నది ఇటీవల వర్షాలతో ముంచెత్తింది. చిత్తూరు జిల్లాలోని కాళంగి రిజర్వాయర్ క్రస్ట్‌గేటు వరద ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోవడంతో ఆ ప్రవాహం అంతా సూళ్లూరుపేటకు తరలివచ్చింది. అప్పట్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్రస్ట్‌గేట్ మళ్లీ ఇప్పుడు వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సూళ్లూరుపేట వాసులు బెంబేలెత్తుతున్నారు. కాగా, వారం రోజుల క్రితం తగ్గిన వర్షాలతో చాలామంది రైతులు వరినార్లు, నారుమళ్లు పనులతో సేద్యం పనుల్లో హడావుడిగా ఉన్నారు. భారీ వర్షాలతో ఆ పంట పనులన్నీ వృథా అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.
తిరుపతి: చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ చెదురుమదులు వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తిలో అడపాదడపా వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలావుండగా గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో కెవిబిపురం మండలంలోని కాళంగి రిజర్వాయర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యే లోపలే ఇటీవల అమర్చిన గేటు కూడా మళ్లీ ఊడిపోయింది. రిజర్వాయర్ మొత్తం నీళ్లు సముద్రం పాలయ్యాయి. అధికారులు కూడా ఎలాగైనా తిరిగి అమర్చాలని మరో గేటును కూడా ఎత్తి నీటిని వదిలేస్తున్నారు.