ఆంధ్రప్రదేశ్‌

పవర్‌తోనే ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: కోతల్లేని విద్యుత్ సౌకర్యం కలిగిన రాష్ట్రంగా ఆంధ్ర అవతరించబోతోందని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. శనివారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటైన ఏపీ జెన్‌కో ధర్మల్ విద్యుత్ కర్మాగారంలో రెండవ యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. గాయత్రి, సింగపూర్‌కు చెందిన సెమ్‌కాప్ సంస్థ సంయుక్తంగా నెలకొల్పిన గాయత్రి థర్మల్ విద్యుత్కేంద్రాన్ని కేంద్ర మంత్రులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగసభలో బాబు మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే విద్యుత్ అవసరమని, విభజన తర్వాత కేంద్ర సహకారంతో 22.5 మిలియన్ యూనిట్ల కొరత అధిగమించగలిగామని అన్నారు. ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రపంచాన్ని సాంకేతికత శాసిస్తోందన్న సీఎం జూలైలోపు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఫైబర్‌కేబుల్ కనెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. సాంకేతికత అందిపుచ్చుకుంటేనే అభివృద్ధి సాధ్యమని, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పరిపాలన పుణ్యమాని డిస్కంలు రూ.14వేల కోట్ల నష్టంతో నడుస్తున్నాయని, ప్రస్తుతం ఈ పరిస్థితిని అధిగమిస్తున్నామన్నారు. సోలార్ విద్యుత్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దడంలో సింగపూర్ ప్రభుత్వ పాత్ర కీలకమైనదని కొనియాడారు. విశాఖపట్నం- రాయ్‌పూర్‌ల నడుమ రైల్వే లైను ఏర్పాటు వలన స్వర్ణచతుర్భుజి రోడ్డు మార్గంలాగా స్వర్ణ చతుర్భుజి రైల్వేమార్గం ఏర్పాటుకు అవకాశం ఉంటుందనీ, కేంద్రం ఈ దిశగా ఆలోచన చేయాలని కోరారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వ్యవసాయం, పరిశ్రమలు రెండూ దేశానికి రెండు కళ్లవంటివన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ముద్ర బ్యాంకు ద్వారా చిరు వ్యాపారులకు ఇప్పటివరకూ లక్ష కోట్ల రూపాయల రుణాలను అందించినట్లు తెలిపారు. పట్టణాల్లోని నిరుపేదలందరికీ శాశ్వత ఇళ్లు ఉండాలనే సంకల్పంతో కేంద్రం పట్టణ నిరుపేదలకు దేశవ్యాప్తంగా 2,50,000 ఇళ్లు మంజూరు చేయగా, ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే లక్షా 93వేల ఇళ్లను మంజూరు చేశామన్నారు. 24 గంటలపాటు నిరంతర విద్యుత్ అందించే వ్యవస్థను ప్రధాని మోదీ ప్రవేశపెట్టారని కితాబిచ్చారు. జిల్లాలో జరుగుతున్న పవర్ ప్రాజెక్టులు పూర్తయితే దక్షిణ భారతదేశానికంత ఇక్కడ నుంచే విద్యుత్ అందించగలమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కేంద్రాల వలన జిల్లా స్థితిగతులు పూర్తిగా మారుతాయన్నారు. రాజకీయాలు ఎన్నికలకు మాత్రమే పరిమితం కావాలనీ, బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవాలని విపక్షాలు ప్రయత్నించడం సరికాదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 748 విశ్వవిద్యాలయాలుండగా కేవలం 3 విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అందోళనలు, నిరసనలు జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పార్లమెంటుపై దాడిచేసిన వ్యక్తిని పొగిడిన వారిని సభలో ఉండే వ్యక్తులు సమర్థించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్‌గోయల్ మాట్లాడుతూ తాము అధికారం చేపట్టేనాటికి దేశంలో విద్యుత్‌లోటు తీవ్రంగా ఉందని, ప్రస్తుతం లోటును అధిగమించేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతూ సత్ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. ఒకే జిల్లాలో 13వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కావడం దేశంలో మరెక్కడా లేదనీ, అది నెల్లూరు జిల్లాకు మాత్రమే దక్కిన గౌరవమని కొనియాడారు. రాబోయే రోజుల్లో నెల్లూరుజిల్లా దేశానికే విద్యుత్ సరఫరా కేంద్రంగా మారనుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర అటవీ శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ నూతన రాజధానికి సంబంధించిన అటవీ అనుమతులు త్వరలోనే రానున్నట్లు వెల్లడించారు. లక్ష వ్యవసాయ పంపుసెట్లు రైతులకు ఉచితంగా అందచేయనున్నట్లు తెలిపారు. మరో కేంద్ర మంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయామన్నారు. ముఖ్యమంత్రి ఒక విజన్ పెట్టుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నెల్లూరు జిల్లాలోనే 10వేల మెగా వాట్ల విద్యుత్ సరఫరా అవుతోందనీ, ఇంకా 10వేల మెగా వాట్ల విద్యుత్ అనుమతులు లభించాయన్నారు. అంతకుముందు కేంద్రమంత్రులతో కలిసి చంద్రబాబు దామోదరం సంజీవయ్య సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్కేంద్రంలో 2వ యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. అదే విధంగా 3వ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, నారాయణ, జిల్లా ఎమ్మెల్యేలు నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఏపీ జెన్‌కో ఎండి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... నేలటూరులో సింగపూర్ సంస్థ సహకారంతో గాయత్రి సంస్థ నిర్మించిన పవర్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న
సిఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు, టి.సుబ్బిరామిరెడ్డి, సింగపూర్ ప్రతినిధులు తదితరులు