రాష్ట్రీయం

మా గెలుపే మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 5: విభజన కష్టాలు, కేంద్రం నమ్మకద్రోహం నేపథ్యంలో వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి చారిత్రక అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర పరిస్థితులు గాడిన పడుతున్నాయని, మరో నాలుగైదేళ్లు కష్టపడితేనే ఇతర రాష్ట్రాల స్థాయికి ఎదగగలమన్నారు. లేనిపక్షంలో పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా మారుతుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మంగళవారం జరిగిన నవ నిర్మాణ దీక్ష బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి పరోక్షంగా వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీని గెలిపించని పక్షంలో రాష్ట్రం పరిస్థితి దారుణంగా తయారవుతుందని హెచ్చరించారు. బీజేపీ, వైసీపీ, పవన్ కుట్ర, కుతంత్రాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతోందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బీజేపీ, వైసీపీకి భయం పట్టుకుందన్నారు. కేంద్రం సహకరించకపోయినా
భారతదేశంలోనే ఏపీ నెంబర్ అయిందన్నారు. లోటు బడ్జెట్ నిధులు ఇవ్వలేదని, విశాఖ రైల్వే జోన్‌కు ఏదో అడ్డుపుల్లలు వేస్తున్నారని, గిరిజన యూనివర్సిటీ మాటేమిటో అర్ధం కావడంలేదని, అడుగడుగునా కుట్రలు పన్నుతోందన్నారు.
కేంద్రం భయపెడితే భయపడేది లేదని, కుట్రలకు పాల్పడితే ఖబడ్దార్ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మనందరి ఆరాధ్య దైవం వేంకటేశ్వరస్వామి సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన నరేంద్రమోదీ తర్వాత అన్యాయం చేశారన్నారు. పేదలు, రైతుల ముఖాల్లో ఆనందం చూడాలని, ప్రజల కష్టాన్ని భుజాన వేసుకుని, 29 సార్లు ఢిల్లీ వెళ్ళి ఆర్థిక ఇబ్బందులు, విభజన బిల్లు అమలు చేయాలని, హోదా ఇవ్వాలని కోరితే మన మాటలను పెడచెవిన పెట్టారన్నారు. మోదీ మన రాష్ట్రానికి అన్యాయం చేశారా లేదా అని ప్రశ్నిస్తూ ఢిల్లీకి విడబడేలా చప్పట్లతో అభిప్రాయాన్ని తెలియజేయాలని సభికులను కోరారు.
ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పోరాటం సాగిస్తుంటే విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ రాజీనామాల నాటకం ఆడుతోందన్నారు. ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సివస్తుందని భయపడి బీజేపీతో లాలూచీపడిన వైసీపీ రాజీనామాల అమోదాన్ని వాయిదా వేయించుకుందన్నారు. కుట్రలు, కుతంత్రాలకు సూత్రధారులు, పాత్రదారులను రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి మన కసి, కక్ష నిరూపించుకోవాలన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కర్ణాటకలో తెలుగువారంతా స్పందించి, బీజేపీని ఓడించారని, అయితే అక్కడ బీజేపీకి అనుకూలంగా వైసీపీ అక్కడ ప్రచారం నిర్వహించిందంటే అది కుమ్మక్కు రాజకీయం కాదా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవదని, మనకు కావాల్సిన వ్యక్తే ప్రధాని కానున్నారని, కేంద్ర రాజకీయాల్లో టీడీపీ చక్రం తిప్పనుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. బీజేపీతో విభేధించిన తర్వాత పవన్‌కళ్యాణ్ యూ టర్న్ తీసుకుని తన పైనా, ఎమ్మెల్యేలపైనా ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. తనపై అలిపిరిలో నక్సలైట్లు 24 క్లెమోర్ మైన్స్ పేల్చారని, అయితే ఆ వెంకన్నబాబు ఆశీస్సుతో ప్రాణాలతో బయటపడ్డానని, రాష్ట్రానికి మేలు చేయాలనే తనకు పునర్జన్మ ప్రసాదించారన్నారు. చివరికి అందరికీ ఆరాధ్యదైవమైన ఆ వెంకటేశ్వరస్వామివారిపై కూడా కుట్రలు పన్నుతున్నారన్నారు. కులమతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. బీజేపీతో విభేధించినందుకు రాయలసీమను రెచ్చగొడుతున్నారని, జగన్‌ను ఉత్తరాంధ్రలో ప్రయోగిస్తున్నారన్నారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులా బతికిన తనను 16 నెలల పాటు జైలులో ఉన్న జగన్ విమర్శించడం దారుణమన్నారు. తనకు ఎటువంటి ఆశలూ లేవని, తన ఆశల్లా ఒకటే రాష్ట్రం అభివృద్ధి చెందాలనేదేనని, తనపై బురద జల్లితే వారికే అంటుకుంటుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సంఘీభావం తెలియజేసి సహకారం అందించాలని కోరారు. నవ నిర్మాణ దీక్ష అనేది రాష్ట్రం కోసం, ఐదు కోట్ల మంది కోసమన్నారు.
ఎన్నో పార్టీలు గతంలో కాపులకు ఎన్నో హామీలు ఇచ్చాయని, కానీ ఇచ్చిన హామీని నెరవేర్చిన పార్టీ టీడీపీ అన్నారు. ప్రతీ సంవత్సరం రూ.1000 కోట్లతో కాపు కార్పొరేషన్ పనిచేస్తుందన్నారు. బీసీలకు నష్టం వాటిల్లకుండా అదనపు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపించామన్నారు. చెప్పింది చేసినందుకే కాపుల నుంచి ఇంత మంచి ఆదరణ కోనసీమలో లభించిందన్నారు. అమలాపురం శాసన సభ్యుడు అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, సుజయ రంగారావు, ఎంపీలు పండుల రవీంద్రబాబు, తోట నర్శింహం, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు మెట్ల రమణబాబు, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మైకు ఇబ్బందితో అసహనం
చంద్రబాబునాయుడు ప్రసంగానికి అడుగడుగునా మైకు ఇబ్బంది పెట్టింది. దీంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. మొదట్లో ప్రసంగం చాలాసేపు వీడియో కాన్ఫరెన్స్‌కు తలపించింది. అత్యధిక సార్లు ప్రజాభిప్రాయ సేకరణ మాదిరిగా చప్పట్లు, చేతులెత్తాలంటూ సీఎం కోరడం కన్పించింది. చంద్రబాబునాయుడు బహిరంగ సభ సమయంలో చిన్నపాటి వర్షం మొదలైంది. ప్రసంగం అనంతరం రూ. కోట్ల విలువైన వివిధ ఉపకరణాలను, చెక్కులను లబ్ధిదారులకు అందించారు. అంతకు ముందు వివిధ సంక్షేమ పథకాల స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.