రాష్ట్రీయం

జిల్లా ఆస్పత్రులు డీలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పివి రమణారావు
-----------------------

హైదరాబాద్, జూన్ 7: వైద్య, ఆరోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఉధృతంగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అవసరమైన సంఖ్యలో లేకపోవడంతో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. ఆధునిక వైద్య పరీక్షా పరికరాలు ఉన్నా..వాటిని నిర్వహించే సిబ్బంది లేక ఇబ్బంది అవుతోంది, రాజధానిలోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు మినహాయిస్తే జిల్లాస్థాయిలో ఉన్న దవాఖానాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో జిల్లా కేంద్ర దవాఖానాను మూడేళ్ల కింద బోధనాసుపత్రిగా మార్చారు. మహబూబ్‌నగర్‌లో మూడేళ్ల కింద ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో దానికి అనుబంధంగా జిల్లా కేంద్ర దవాఖానానే బోధనాసుపత్రిగా మార్చారు. ఈ దవాఖానాలో 17 విభాగాలు ఉండగా, దాదాపు 90 కిపైగా వైద్యులు పనిచేయాలి. అన్ని విభాగాల్లో కలిపి 30 మంది మాత్రమే వైద్యులు పనిచేస్తున్నారని ఆంధ్రభూమి పరిశీలనలో వెల్లడైంది. సిబ్బంది సరైన సంఖ్యలో లేకపోవడంతో సరైన వైద్యం అందించేందుకు ఇబ్బంది అవుతోంది. జనరల్ మెడిసిన్ విభాగంలో కనీసం 10 మంది డాక్టర్లు పనిచేయాల్సి ఉండగా ఒక్కరే పనిచేస్తున్నారు. మరొకు సెలవులో ఉన్నారు. ఆర్థోపెడిక్‌లో మూడు యూనిట్లు ఉన్నాయి. వీటిలో 13 మంది స్పెషాలిటీ డాక్టర్లు పనిచేయాల్సి ఉండగా, ఒక్కరే పనిచేస్తున్నారు. ఈఎన్‌టీ విభాగంలో ఎనిమిది మంది డాక్టర్లు పనిచేయాల్సి ఉండగా, ఒక్కరే పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటిపరీక్షలు ఉచితంగా చేసి, అవసరమైన వారికి చికిత్స చేసి, కళ్లద్దాలు కూడా ఇస్తామని విపరీతంగా ప్రచారం చేస్తోంది. విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే మహబూబ్‌నగర్ బోధనాసుపత్రిలో కంటి విభాగంలో కనీసం ఆరుగురు డాక్టర్లు పనిచేయాల్సి ఉండగా, ఒక్కరు కూడా లేకపోవడం శోచనీయం. ఈ పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు ఎలా చేస్తారో అర్థం కావడం లేదని ఈ దవాఖానకు వచ్చిన రోగులు అనుకోవడం వినిపించింది. మానసిక విభాగం (సైకియాట్రీ) విభాగంలో ఒక్క డాక్టర్ కూడా లేరు. అలాగే ప్రభుత్వం ‘్ఫ్లగ్‌షిప్’ పథకంగా మారిని కేసీఆర్ కిట్‌కు సంబంధించి చిన్లపిల్లల వైద్య విభాగంలో 14 మంది డాక్టర్లు పనిచేయాల్సి ఉండగా, కేవలం ఒక్కరంటే ఒక్కరే పనిచేస్తున్నారు. అత్యవసర కేసులు, గాయాలపాలైన వారికి చికిత్స అందించేందుకు అత్యవసరవిభాగం (క్యాజువాలిటీ) ఉన్నప్పటికీ, ఈ విభాగంలో కూడా డాక్టర్ల కొరత ఉంది. మూడు షిప్టుల్లో 18 మంది డాక్టర్లు పనిచేయాల్సి ఉన్నప్పటకీ, కేవలం ఒక్కరంటే ఒక్కరే పనిచేస్తున్నారు. మొత్తం దవాఖానాలో కనీసం ముగ్గురు ఆర్‌ఎంఓలు (రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు) పనిచేయాల్సి ఉండగా, ఒక్కరు కూడా లేరు. కాంట్రాక్ట్ ప్రాతిపదికపై కొంత మంది డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది పనిచేస్తుండగా, గత ఐదు నెలల నుండి వీరికి జీతాలు ఇవ్వడం లేదు. దీనికి కనీసం 270 మంది సానిటేషన్ సిబ్బంది అవసరం కాగా, కేవలం 90 మంది పనిచేస్తున్నారు.
మార్పులేని భవనం
జిల్లా కేంద్ర దవాఖానా భవనంలో నాలుగుదశాబ్దాల కింద వేసిన ఫ్లోరింగ్ నేటికీ అలాగే ఉంది తప్ప నేటి అవసరాలకు తగ్గట్టు మార్చలేరు. రోగుల వెంట వచ్చే అటెండెంట్లకు వేచి ఉండే గదులులేవు, కామన్ టాయిలెట్స్ లేవు. భవన నిర్వహణకు సర్కారు చిల్లిగవ్వ కూడా విదల్చడం లేదని తెలిసింది.

సేవ చేస్తున్నాం: సూపరింటెండెంట్ రాంకిషన్
తమ దవాఖానాలో రోగులకు మేలైన వైద్యం అందిస్తున్నామని మహబూబ్‌నగర్ బోధనాసుపత్రి సూపరింటెడెంట్ డాక్టర్ డి. రాంకిషన్ తెలిపారు. గురువారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ విజయవంతంగా కొనసాగిస్తున్నామన్నారు. 150 ఎంబిబిఎస్ సీట్లతో నడుస్తున్న మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న తమ దవాఖానాలో బెడ్ల సంఖ్యను 350 నుండి 500 కు పెంచామన్నారు. మరో రెండు వందల బెడ్లు అదనంగా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఔట్‌పేషంట్ల సంఖ్య గతంలో రోజూ 600 నుండి 800 వరకు ఉంగా ఇప్పుడిది 1500-1600 కు పెరిగిందన్నారు. క్యాన్సర్ చికిత్సకు 200 కోట్లతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. తలసీమియా వ్యాధికి చికిత్స అందించే విభాగాన్ని 2018 జూన్ 2 న ప్రారంభించామన్నారు. డయాలసిస్ విభాగంలో రోజూ 30 మందికి చికత్స చేస్తున్నామన్నారు. తమ దవాఖానాలో ప్రసవాల సంఖ్య గతంలో నెలకు 150-200 మధ్య ఉండగా, కేసీఆర్ కిట్స్ వచ్చిన తర్వాత ఈ సంఖ్య 700-800 కు చేరిందన్నారు. లేబర్‌రూంను ఆధునీకరించామన్నారు. పిల్లలకోసం హైరిస్క్ కేసులకు కూడా చికిత్స చేస్తున్నామన్నారు. దవాఖానాలో పరిశుభ్రత చాలా బాగా ఉందన్నారు. తమ దవాఖానాలో 1.40 కోట్లతో ఆధునిక సీటీ స్కాన్, 1.40 కోట్లతో ఆధునిక ఎక్స్‌రే విభాగం ఏర్పాటు చేశామన్నారు. ‘కంటివెలుగు’ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా, విజయవంతంగా నడుస్తోందన్నారు. తాము అందిస్తున్న వైద్య చికిత్సకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని రాంకిషన్ వివరించారు.