రాష్ట్రీయం

దళితులపై దాడులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 10: దేశంలో దళితులపై మోదీ ప్రభుత్వం, బీజేపీ దాడులు చేస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి వరంగల్‌లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అధ్యక్షతన జరిగిన దళిత, గిరిజన సంఘాల సింహగర్జన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో దళితులపై రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు అందరం కలసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కేంద్రం పూర్తిగా నీరుగార్చిందని దుయ్యబట్టారు. రోజుకు ఆరుగురు మహిళల చొప్పున అత్యాచారాలకు గురౌతున్నారని ముఖ్యంగా దళిత మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు మితిమీరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన మహిళలు, దళితుల ఇళ్లలో ఆరెస్సెస్, బీజేపీ ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తోందన్నారు. కర్నాటకలో ఇటీవలి ఎన్నికల్లో అల్లకల్లోలాన్ని సృష్టించి దొడ్డిదారిన అధికారంలోకి రావాలని బీజేపీ విఫలయత్నం చేసిందన్నారు. అయితే, వారి కుట్రలకు కోర్టు కళ్లెం వేసిందన్నారు. దళిత, గిరిజనులను రక్షించుకునేందుకు ఉద్యమాలు చేసే
సమయం అసన్నమైందని, అందరం సంఘటితంగా పోరాడి ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ చట్టాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కార్యక్రమంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమారి మాట్లాడుతూ దేశంలో దళితులపై అత్యాచారాలు జరిగితే మరణ శిక్ష విధించాలన్నారు. దళితుల హక్కుల కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతానని ప్రకటించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తించే రాష్ట్రం ఇస్తే, దళితుడిని తొలి సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పి మోసం చేశారని అన్నారు. ఇలాంటి సీఎంను గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. దళితులకు అధికారం వస్తుందనే తాను పార్లమెంట్ స్పీకర్‌గా తెలంగాణ బిల్లును పాస్‌చేశానని తెలిపారు. మార్చి 20న సుప్రీం కోర్టు ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ చట్టంపై తీర్పునిస్తే ఏప్రిల్ 6వరకు పార్లమెంట్ సమావేశాలు జరిపిన కేంద్రం ఇప్పటివరకు ఎందుకు ఆర్డీనెన్స్ తీసుకురాలేదని ప్రశ్నించారు. బీహార్‌లో దళితులను కొట్టి చంపిన సంఘటన తనను కలిచివేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో దళితులకు రక్షణ, అధికారం వచ్చే వరకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో దళిత ఉద్యమ నేత మందకృష్ణను జైల్లో పెట్టాల్సినంత నేరం ఏంచేశాడని ప్రశ్నించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ నేత డీ రాజా మాట్లాడుతూ తాను ప్రధానిని కాదని, ప్రధాన సేవకుడినేనని చెప్పుకునే మోదీ, ఆరెస్సెస్ ప్రధాన ప్రచారక్‌గా, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాడన్నారు. ఒరిస్సా మాజీమంత్రి, గిరిజన పోరాటనాయకుడు భక్త చరణ్‌దాస్ మాట్లాడుతూ దళిత, ఆదీవాసీలపై రోజురోజుకు దాడులు పెట్రేగిపోతున్నాయన్నారు. అట్రాసీటి చట్టాన్ని కేంద్రం నీరుగారుస్తుందని, ఈ చట్టాన్ని రక్షించుకునేందుకు దళిత, గిరిజన, ఆదివాసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికూడా దేశంలో అంటరానితనం కొనసాగడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు బాధకరమన్నారు. కేంద్రం కుట్రలను ఎండగట్టేందుకు బీజేపీయేతర శక్తులు ఏకంకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఒరిస్సా మాజీ మంత్రి భక్త చరణ్‌దాస్ తదితరులు మాట్లాడారు.
చిత్రాలు..వరంగల్‌లో జరిగిన సింహ గర్జనలో మాట్లాడుతున్న లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్.
* పెద్దఎత్తున హాజరైన జనం