రాష్ట్రీయం

ఆ మూడు గంటలూ విమానాలు ఆపాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 13: విశాఖ విమానాశ్రయంలో నవంబర్ ఒకటో తేదీ నుంచి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పౌర విమాన సర్వీసులను నిలిపివేయాల్సిందేనని తూర్పు నౌకాదళ అధికారులు స్పష్టం చేశారు. 24/7 విశాఖ విమానాశ్రయాన్ని తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చాం. రోజుకు 24 గంటల్లో కేవలం మూడు గంటల స్లాట్ మాత్రమే నేవీ తీసుకోవాలని భావిస్తోందని తూర్పు నౌకాదళ కమాండ్ ఏవియేషన్ ఆఫీసర్ కమడోర్ సత్యన్‌వర్దక్, తూర్పు నౌకాదళ చీఫ్ స్ట్ఫా ఆఫీసర్ (ఆపరేషన్స్) రియర్ అడ్మిరల్ మహేష్ సింగ్, ఐఎన్‌ఎస్ డేగా సీఈఓ కెప్టెన్ త్యాగరాజన్ తెలిపారు. తూర్పు నౌకాదళ విమాన స్థావరమైన ఐఎన్‌ఎస్ డేగాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భారత దేశంలో ఎక్కడాలేని విధంగా విశాఖ విమానాశ్రయ భౌగోళిక స్వరూపం ఉందని అన్నారు. 10వేల అడుగుల వైశాల్యం కలిగిన రన్‌వే కలిగిన ఈ విమానాశ్రయంలో విమానాలు కేవలం ఒకపక్క మాత్రమే టేకాఫ్ తీసుకునే పరిస్థితి ఉందని అన్నారు. వీచే గాలికి అభిముఖంగా టేకాఫ్ తీసుకుంటే కొండలు అడ్డు వస్తున్నాయని, కేవలం అనుభవం కలిగిన పైలెట్లు మాత్రమే ఈవైపుగా టేకాఫ్ తీసుకోగలరని, అందువల్ల ఒకే రన్‌వేని విమానాలు ల్యాండింగ్, టేకాఫ్‌కు వినియోగించాల్సి వస్తోందన్నారు. పౌర విమానాలు ల్యాండ్ అయిన తరువాత వెంటనే పార్కింగ్ తీసుకోలేవని, అవి రన్‌వే మీద కొద్ది సమయం వేచి ఉండాల్సి వస్తోందని అన్నారు. దీనివలన మిగిలిన విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వివరించారు. ఇదే రన్ వే మీద నుంచి మిలటరీ విమానాలు కూడా టేకాఫ్, ల్యాండింగ్ తీసుకోవలసి వస్తోందని అన్నారు. ఒకవేళ ఇదే సమయంలో రన్ వే మీద మిలటరీ విమానాలు ఉంటే, పౌర విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాల్సి వస్తోందని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా విశాఖ విమానాశ్రయనికి వచ్చే పౌర విమానాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని వర్దన్ చెప్పారు. 2013-14లో విశాఖ విమానాశ్రయానికి ఏడాదికి 11,268 ఫ్లైట్ మూమెంట్స్ ఉంటే, 2017-18లో 19,956 మూమెంట్స్‌కు పెరిగాయని అన్నారు. అంటే రోజుకు 70 నుంచి 80 మూమెంట్స్ ఉంటున్నాయని, అలాగే రోజుకు 130 వరకూ మిలటరీ విమానాల మూమెంట్స్ ఉంటున్నాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా యుహెచ్ 3హెచ్, హాక్ విమానాలు పదే పదే టేకాఫ్, ల్యాండింగ్ తీసుకోవలసి వస్తుందని వివరించారు. గోవాలో రోజుకు 150 వరకూ పౌర విమానాల మూమెంట్స్ ఉంటాయని, అందువల్ల అక్కడ కూడా ఉదయం 8.30 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 గంటల వరకూ పౌర విమాన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నామని అన్నారు. పూనేలో రోజుకు 184 పౌర విమానాల మూమెంట్స్ ఉంటాయి. అక్కడ కూడా ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ పౌర విమాన సేవలు నిలిపివేస్తున్నామని వర్దన్ వివరించారు. విశాఖలో రోజుకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ మాత్రమే పౌర విమాన సేవలపై ఆంక్షలు విధిస్తున్నామని చెప్పారు. దీనివలన ఐదు, ఆరు సర్వీసులపై మాత్రమే ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ నిర్ణయాన్ని కేవలం నేవీ ఒక్కటే తీసుకోలేదని, విమానయాన సంస్థల ప్రతినిధులందరి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. వారందరితో చర్చించే ఈ సమయాన్ని కూడా నిర్ణయించామన్నారు. ఈ విషయమై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, నేవీ ప్రధాన కార్యాలయం కలిసి తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందని అన్నారు.
ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో ఉన్న రన్ వేకు సమాంతరంగా మరో రన్‌వే (టాక్సీ ట్రాక్) నిర్మించాల్సిన అవసరం ఉందని వర్దన్ చెప్పారు. దీని వలన పౌర విమానాల రాకపోకలకు ఇబ్బంది ఉండదని అన్నారు. అయితే, దీనికి చాలా సమయం పడుతుందని అన్నారు. కాగా, విశాఖ విమానాశ్రయానికి రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజాము ఆరు గంటల వరకూ ఒక్క విమానం కూడా రావడం లేదని, ఈ సమయంలో విమాన సర్వీసులను పెంచుకుంటే బాగుంటుందని నేవీ అధికారులు సూచించారు.
-------------