రాష్ట్రీయం

అర్హులకు పక్కా ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 19: రాష్ట్రంలో అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. తొలుత ప్రభుత్వ స్థలాలకు ప్రాధాన్యత ఇచ్చి అవసరమైతే 500 కోట్లతో ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. మంగళవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో వాణిజ్య ఓడరేవులు, భోగాపురం విమానాశ్రయ పనులు చేపట్టాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. రేవుల అభివృద్ధిలో దేశంలోకెల్లా ఏపీని అగ్రస్థానంలో నిలపాలని తీర్మానించింది. తిరుపతిలో మరో ఎలక్ట్రానిక్ మెగా క్లస్టర్, విశాఖ తీరంలో అంతర్జాతీయ కనె్వన్షన్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా గృహనిర్మాణంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ప్రతిపాదించారు. ఇప్పటికే వివిధ జిల్లాలు, పట్టణాలలో 71వేల 862, గ్రామీణ ప్రాంతాల్లో 2,19,696 మందికి ఇళ్లస్థలాలు కేటాయించామన్నారు. ఇవికాక మరో 17వేల 785 మందికి ఇళ్ల పట్టాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో కొందరు ఇప్పటికే ఏళ్ల తరబడి ప్రభుత్వ స్థలాల్లో అనధికారికంగా ఇళ్లు నిర్మించుకున్నారని, అటువంటి స్థలాలను క్రమబద్ధీకరించటానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన అర్హులకు స్థల కేటాయింపు కోసం బడ్జెట్‌లో 500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా పది అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీల పరిధిలో ఉన్న గ్రామాల్లో అవసరమైన చోట్ల బహుళ అంతస్తుల ఇళ్ల నిర్మాణం చేపట్టే విషయమై సమావేశంలో చర్చించారు. తిరుపతిలో 3వేల కోట్లతో ఇఎంసి-2ను 322 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. తిరుపతిలో వికృతమాల గ్రామంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఇఎంసి) 2లో వౌలిక వసతులు కల్పన కోసం 30.27 కోట్లు వినియోగించుకునేందుకు ఐటీ ఈ అండ్ సీ విభాగానికి అనుమతించింది. దీనివల్ల 52వేల 930 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సెల్‌ఫోన్ల తయారీతో పాటు ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీకి ప్రోత్సాహం ఉంటుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ (పీఎంపీసీఎల్)ను పునరుద్ధరించి డెయిరీ రైతులను ఆదుకునేందుకు 35 కోట్ల రుణాన్ని అందించేందుకు మంత్రిమండలి అంగీకరించింది.
రాష్ట్రంలో కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుచేసేందుకు వీలుగా జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు మంత్రిమండలి సమ్మతించింది. ఇకపై ప్రభుత్వ స్థలాల్లో మొబైల్ టవర్లు ఏర్పాటు చేసుకోవాలంటే సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ టవర్స్ సంస్థ దీనికి నోడల్ ఏజన్సీగా వ్యవహరిస్తుంది మరో రెండు కంపెనీలతో కలసి ఏపీ టవర్స్ లిమిటెడ్ సంస్థ స్ట్రాటజిక్ పార్టనర్‌గా వ్యవహరిస్తుంది. పేస్ పవర్ సిస్టమ్, లైనేజి పవర్ సంస్థలతో కలసి ఏపీ టవర్స్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తుంది. రెండువేల కోట్ల మూలధనంతో కంపెనీ ఏర్పాటవుతుంది. తూర్పుతీరం నుంచి సముద్ర రవాణాలో ప్రస్తుతం ఏపీ నెంబర్ వన్‌గా కాకినాడ వాణిజ్యరేవు నిలిచింది. సముద్రతీర రవాణాలో దేశంలోకెల్లా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచేందుకు పోర్టులను అభివృద్ధి చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామం వద్ద వాణిజ్యరేవు అభివృద్ధి బాధ్యతలు కాకినాడ సెజ్ లిమిటెడ్ సంస్థకు ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. మచిలీపట్నంలో పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ టౌన్‌షిప్ ఏర్పాటుకు 1385 కోట్లు రుణం తీసుకునేందుకు మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి అనుమతించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నెలకొల్పనున్న గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిన అభివృద్ధి చేసేందుకు ఆమోదం లభించింది. ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భాగంగా గూడెపువలస గ్రామంలో సేకరించిన 27.87 ఎకరాల భూమికి 33లక్షల చొప్పున చెల్లించాలని సమావేశం నిర్ణయించింది. విశాఖ తీరంలో 14.15 ఎకరాల విస్తీర్ణంలో లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రైవేటు లిమిటెడ్ ఒక భారీ కనె్వన్షన్ ఏర్పాటు చేస్తోంది. లులూ గ్రూపునకు కేటాయించిన స్థలంపై కొన్ని సవరణలను మంత్రిమండలి ఆమోదించింది. పాలనాయంత్రాంగంలో ఆర్ధికపరమైన ఇబ్బందులను అధిగమించి మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సీఎంఎఫ్‌ఎస్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఏపీభవన్‌లో నూతనంగా జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లు పోస్టుల నియామకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజులు పెంచేందుకు అనుమతిచ్చింది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్యాకేజీ 2లో ఫీడర్ కెనాల్ సామర్ధం 85 క్యూమెక్స్ నుంచి 328 క్యూమెక్స్‌కు పెంచేందుకు అదనంగా ఖర్చుచేసిన 3878.966 లక్షల వ్యయం మంజూరు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఐబీఎం నిబంధన ప్రకారం 4.48 టెండర్ డిస్కౌంట్ వర్తిస్తుంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టులో 121.23 లక్షలతో నామినేషన్ పద్ధతిపై చేపట్టిన 29 అత్యవసర పనులకు చీఫ్ ఇంజనీరు గతంలోజారీచేసిన పాలనాపరమైన అనుమతులను మంత్రి మండలి ఆమోదించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణకు ఇప్పటికే పూర్తయిన ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆస్తులను ఏపీ జలవనరుల అభివృద్ధి సంస్థకు బదలాయించే ప్రతిపాదనను ఆమోదించింది. ప్రభుత్వ మెడికల్ అండ్ డెంటల్ ఇనిస్టిట్యూషన్స్ యాక్టు-2007 రద్దుకు ఆమోదం తెలిపింది. ఈ యాక్టు ప్రకారం సెమీ అటానమస్ ఇనిస్టిట్యూట్లుగా ఉన్న సంస్థలను ఇకపై ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, జనరల్ హాస్పటల్‌గా పరిగణిస్తారు. వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేస్తారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో కియా కార్ల కంపెనీ సైట్ వద్ద యర్రమంచి గ్రామంలో ఎఫ్ కేటగిరి పోలీసుస్టేషన్ ఏర్పాటు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందుకోసం 3.17 కోట్లు ఖర్చు కానుంది. నూతనంగా ఏర్పాటుచేసిన 11వ వేతన సవరణ సంఘానికి సహాయకారిగా ఉండేందుకు 16 పోస్టులు తాత్కాలిక ప్రాతిపదికన అందించాలని నిర్ణయించారు.