రాష్ట్రీయం

గిరిజన భాషకు బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 25: గిరిజనులకు వారి మాతృ భాషలోనే విద్యాబోధన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తిరిగి కసరత్తు ప్రారంభించింది. గతంలో గిరిజనులకు వారి మాతృ భాషలోనే చదువు చెప్పేందుకు ఏర్పాటు చేసిన కోయ భారతి పథకం మరుగున పడింది. ఉమ్మడి రాష్ట్రంలో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన విద్యావేత్తలు భద్రాచలం చేరుకుని ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. శిక్షణ పొందిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు విద్యా శాఖలో వచ్చిన వినూత్న మార్పులతో పథకం మరుగున పడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో వందచోట్ల ప్రత్యేకంగా గిరిజనుల కోసం విద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఐటిడిఏ పరిధిలో కనీసం 20 పాఠశాలలకు తగ్గకుండా గిరిజన భాషలోనే బోధన చేయాలని నిర్ణయించారు. తొలుత 1వ తరగతి నుంచి ఈ పద్ధతి అమలుచేసి విద్యార్థుల తరగతులను పెంచుతూ పాఠశాలలను కూడా అప్‌గ్రేడ్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు లక్ష మంది వరకు ఉన్నారు. వీరంతా గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ పాఠశాలల్లోనే కోయ భాష ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. కోయ భారతి పేరిట గిరిజన భాషలో రూపొందించిన పుస్తకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. కోయ భాషకు లిపి లేనందువల్ల దానిని తెలుగులోనే ముద్రిస్తున్నారు. గిరిజనుల సాంప్రదాయాలు,
రాష్ట్ర అభివృద్థి, సంతలు, జాతరలు, ఉత్సవాలు వంటి వాటిని ఈ పుస్తకాల్లో పొందుపర్చి వారిని నేర్పనున్నారు. గిరిజన భాషలోనే తెలుగు సులువుగా నేర్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భాషను నేర్పేందుకు ప్రత్యేకంగా ఆయా పాఠశాలల పరిధిలోనే విద్యా వాలంటీర్లను నియమించనున్నారు. ఆ ప్రాంతానికి చెంది, చదువుకున్న వారిని ఇందుకోసం నియమిస్తూ గిరిజనులను చైతన్యపర్చడమే కాకుండా విద్యావంతులను చేసేందుకు ఉపయోగించనున్నారు. గతంలో ఈ విధానాన్ని 2013వ సంవత్సరం వరకు కొనసాగించి సత్ఫలితాలు సాధించారు. భద్రాచలం ఐటిడిఏ పరిధిలో చర్ల, దుమ్ముగూడెం, ముల్కలపల్లి, గుండాల, ఇల్లెందు, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో కోయ భారతి అమలు చేయనున్నారు. ఇదిలా ఉండగా ఏటూరు నాగారం ఐటిడిఏ పరిధిలో కోయ భారతితో పాటు బంజారా భారతి పేరుతో ప్రత్యేకంగా పుస్తకాలు ప్రచురించనున్నారు. ఉట్నూరు ఐటిడిఏ పరిధిలో కోయ భారతితో పాటు గోండు భారతి పుస్తకాలను ప్రచురించి గిరిజనులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆయా ప్రాంతాల్లో నివసించే గిరిజనుల భాషకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేకంగా పుస్తకాలు ప్రచురించి వారికి బోధించనున్నారు. భవిష్యత్తులో అవసరమైతే వారి కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఇటీవల ఉన్నతాధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఐటిడిఎల నుంచి వచ్చిన పూర్తి సమాచారంతో ఎక్కడ పాఠశాలలు ఏర్పాటు చేయాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.