రాష్ట్రీయం

సొంత ఆదాయంలో తెలంగాణ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూలో (రాష్ట్ర సొంత ఆదాయం) దేశంలోనే తెలంగాణ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర సగటు ఆదాయ వృద్ధి రేటు 17.2 శాతంతో ఇతర రాష్ట్రాల కంటే ముందు నిలిచిందని కంప్ట్రోర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు గణాంకాలను కాగ్ తన వెబ్‌సైట్లో పేర్కొంది. జూన్ 2014 నుంచి జూన్ 2018 వరకు నాలుగు సంవత్సరాల వ్యవధిలో 17.2 శాతం వృద్ధి రేటు సాధించి మొదటి స్థానాన్ని సంపాదించినట్టు పేర్కొంది. వృద్ధి రేటు 14.2 శాతంతో హర్యానా రెండవ స్థానం, 13.9 శాతం వృద్ధి రేటుతో మహారాష్ట్ర మూడవ స్థానం, 12.4 శాతం వృద్ధి రేటుతో ఒడిశా నాలుగవ స్థానం, 10.3 శాతం వృద్థి రేటుతో పశ్చిమ బెంగాల్ ఐదవ స్థానంలో నిలిచినట్టు ప్రకటించింది. మిగతా రాష్ట్రాలు 10 శాతానికి తక్కువ వృద్ధి రేటు మాత్రమే సాధించినట్టు కాగ్ పేర్కొంది. గడిచిన నాలుగేళ్లో 2015-16లో 13.7 శాతం, 2016-17లో 21.1 శాతం, 2017-18లో 16.8 శాతం వృద్ధి రేటు సాధించినట్టు నివేదికలో పేర్కొంది. తెలంగాణ అవలంభిస్తున్న ప్రగతికాముక విధానాలకు, పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణకు, పన్నుల చెల్లింపులో ప్రజలు చూపిస్తున్న చిత్తశుద్ధి వల్లనే ఆదాయవృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలువడానికి కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వంటి నిర్ణయాల తర్వాత కూడా తెలంగాణ సుస్థిరమైన ఆదాయాభివృద్ధితో ఆర్థిక ప్రగతి సాధించడం శుభసూచకమని కేసీఆర్ కొనియాడారు. రాష్ట్రంలో అమలు చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను మరింత బాగా అమలు చేయడానికి సొంత ఆదాయ వృద్ధిరేటు పెరుగుదల దోహదపడుతుందని ముఖ్యమంత్రి విశే్లషించారు.