రాష్ట్రీయం

ముదురుతున్న వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 26: తూర్పు నౌకాదళం, రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలు పౌర విమాన సేవలకు శాపంగా పరిణమిస్తున్నాయి. విశాఖ విమానాశ్రయానికి వచ్చే పౌర విమానాలపై నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆంక్షలు విధించాలన్న నిర్ణయంపై తూర్పు నౌకాదళం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. దేశ భద్రత దృష్ట్యా విశాఖ విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్ స్టేషన్‌లో నవంబర్ ఒకటి నుంచి సైనిక శిక్షణను ముమ్మరం చేయనుంది. ఇందుకోసం పౌర విమానాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తోంది. వారానికి ఐదు రోజులు ఉదయం తొమ్మిది గంటల నుంచి 12.30 గంటల వరకూ పౌర విమానాలు విశాఖ రావడానికి వీల్లేదు. వీటితోపాటు మంగళ, గురువారాల్లో రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ కూడా సివిల్ ఫ్లైట్స్‌పై ఆంక్షలు ఉంటాయి. పర్యాటకంగా ఎదగాల్సిన విశాఖకు ఈ ఆంక్షలు గొడ్డలిపెట్టుగా మారబోతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విశాఖలో నేవీ అధికారులతో ఈనెల 22న చర్చలు జరిపినా, ప్రయోజనం కనిపించలేదు. నేవీ దారికి రాకపోతే, వారికి నీటి సరఫరా బంద్ చేస్తామంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రకటిస్తున్నారు. దీంతో రోజు రోజుకూ ఈ వివాదం రాజుకుంటోంది. అయితే, ఇందులో నేవీతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
నేవీకి ముందు చూపు ఏదీ?
చాలా కాలంగా విశాఖ విమానాశ్రయానికి వచ్చే విమానాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ విషయాన్ని పక్కనే ఉన్న నేవీ గుర్తించలేదా? ఇప్పటికిప్పుడు ఈ పెరుగుదల గుర్తొచ్చి, తమ సైనికుల శిక్షణకు ఈ విమానాలు అడ్డొస్తున్నాయంటూ కొత్త పల్లవి అందుకుంది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని పౌర విమానాలపై ఆంక్షలు విధించడానికి సిద్ధపడింది. ఆంక్షలు లేకుండా అటు సివిల్ ఫ్లైట్స్, ఇటు మిలటరీ ఫ్లైట్స్ స్వేచ్ఛగా తిరిగేందుకు మార్గాన్ని నేవీ గతంలోనే కనుగొంది. ప్రస్తుతం
విమానాశ్రయంలో ఉన్న రన్‌వేకు పక్కనే మరో రన్‌వే (టాక్సీ ట్రాక్) నిర్మించాలని నిర్ణయించింది. ఈ రన్ వే నిర్మాణానికి విశాఖ పోర్టు 34 ఎకరాల భూమిని నేవీకి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అయితే, ఈ భూమిని 30 సంవత్సరాలు లీజుకు ఇస్తామని, ఇందుకు 60 కోట్ల రూపాయలు చెల్లించమని పోర్టు డిమాండ్ చేసింది. ఇందుకు నేవీ అధికారులు సుముఖత చూపలేదు. పోర్టు గొంతెమ్మ కోరిక ఇలా ఉంటే, సమాంతర రన్‌వే నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఈ మొత్తం విడుదల చేయడానికి రెండేళ్లు పడుందని, రన్ వే నిర్మించడానికి మరో మూడేళ్లు పడుతుందని నేవీ చెపుతోంది. అయితే, వంద కోట్లు ఇస్తే, ఎనిమిది నెలల్లో నిర్మించి ఇస్తామని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా డైరక్టర్ చెపుతున్నారు. వెరసి ఇన్ని కోట్ల రూపాయలను ఎవరు చెల్లించాలన్న దగ్గర వ్యవహారం మొత్తం నిలిచిపోయింది. నేవీ ముందస్తు ప్రణాళిక లేకుండా పౌర విమానాలపై ఆంక్షలు విధించడం శోచనీయం.
భోగాపురాన్ని నిర్లక్ష్యం చేశారు!
నేవీ తొందరపాటు నిర్ణయం ఇలా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం కూడా లేకపోలేదు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం పరుగులు తీసింది. ఎయిర్‌పోర్టుతోపాటు, విమాన మరమ్మతులు, సర్వీసింగ్ వగైరాలకు సంబంధించిన పలు అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు తొలుత 15 వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ప్రజల నుంచి వ్యతిరేక వ్యక్తం అవడంతో దాన్ని పదివేల ఎకరాలకు కుదించింది. చివరకు ఇవేవీ కావని 5,400 ఎకరాలను నోటిఫై చేసింది. ఇందులో 2,700 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. 2,400 ఎకరాల భూమిని సేకరించింది. మిగిలిన 300 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. ఇప్పటికే మిగిలిన 2,700 ఎకరాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ భూములు డీ నోటిఫై కాకపోవడం వలన అక్కడి రైతులు తమ భూములను అమ్ముకోలేని దుస్థితిలో ఉండిపోయారు.
ఇదిలా ఉండగా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ టెండర్‌ను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా దక్కించుకున్నప్పటికీ, అనివార్య కారణాల వలన ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఆ టెండరే ఖరారై ఉండి ఉంటే, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కావల్సిన అనుమతులు ఇట్టే వచ్చేవి. కేంద్రం కూడా నిధులు ఇవ్వడానికి సంశయించేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది. నేవీ విశాఖ విమానాశ్రయాన్ని ఎప్పటికైనా ఆక్రమించుకునే అవకాశం ఉన్నందువలన భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేయాలి. షాంఘైలో అత్యంత వేగంగా, అత్యాధునికంగా నిర్మిస్తున్న సంస్థకు ఈ విమానాశ్రయ నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తే సమస్య వీలైనంత త్వరగా పరిష్కారం అవుతుంది. లేకుంటే, భోగాపురంలో ఇప్పటికే సేకరించిన భూమిని నేవీకి అప్పగించి, వారిని అక్కడికి వెళ్లేలా ఒప్పించడానికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం 1250 ఎకరాల్లో ఉంది. ఇందులో 350 ఎకరాల్లో విశాఖ విమానాశ్రయం ఉండగా, 900 ఎకరాల్లో ఐఎన్‌ఎస్ డేగా ఉంది. ఇందుకు మూడు రెట్లు స్థలం ఉన్న భోగాపురానికి నేవీ వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అయితే, నేవీ అందుకు అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు. భారత నౌకాదళం దేశంలోని అనేక ప్రాంతాల్లో వ్యూహాత్మ ఎయిర్ స్టేషన్లు నిర్మించింది. ఇందులో భాగమే ఐఎన్‌ఎస్ డేగా. దీన్ని ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి తరలించడానికి నేవీ అంగీకరించే అవకాశం లేదు. రాంబిల్లి వద్ద నేవీ కొత్తగా నిర్మిస్తున్న నేవల్ బేస్‌లో ఎయిర్‌పోర్టు నిర్మించుకోడానికే నేవీ అధికారులు ససేమిరా అంటున్నారు. బొబ్బిలికి సమీపంలోని బాడంగి వద్ద ఉన్న ఎయిర్ ఫీల్డ్‌కు వెళ్లడానికి కూడా నేవీ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని విశాఖ ఎయిర్‌పోర్టును వేరే చోటికి మార్చాల్సిన అవసరం ఉంది.

చిత్రం..భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం సేకరించిన స్థలం