రాష్ట్రీయం

అదుపులేని అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: రాష్ట్రంలో మద్యం వల్ల సర్కారుకు ఏటా ‘కాసుల పంట’ (ఖజానాకు ఆదాయం) పెరుగుతుండగా, ఆనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతోంది. మద్యం (ఆల్కహాల్) తాగడం వల్ల వచ్చే రోగాల కారణంగా ఏటా 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక వేల మంది జీర్ణవ్యవస్థ, కాలేయానికి సంబంధించిన వ్యాధులకు గురవుతున్నారు. అలాగే నరాల బలహీనత, మెదడుకు సంబంధించిన వ్యాధులకు కూడా గురవుతున్నారు. వీటన్నింటికీ మించి మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణమవుతోంది. 2016 లో దాదాపు 17 వేలపైగా ప్రమాదాలు జరగగా, 5వేల మందికిపైగా మరణించారు. 2017లో కూడా 16 వేలపైగా ప్రమాదాలు జరగగా 4800 మంది మరణించారని రోడ్డ్భుద్రతా శాఖ అధికారికంగానే ప్రకటించింది. గాయపడుతున్న వారి సంఖ్య ఏటా 10 వేలకు పైగా ఉంది. మద్యం సేవించి నడపడం వాహన ప్రమాదాలకు మరో ప్రధాన కారణం.
రాష్ట్ర ప్రభుత్వం గుడుంబాను (ఇల్లిసిట్ లిక్కర్-ఐడి) నిషేధించిన తర్వాత గుడుంబా తాగేవారు సాధారణ మద్యానికి (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) అలవాటు పడుతున్నారు. 2017-18 లో 266 లక్షల కేసుల లిక్కర్ (ఒక కేసులో 8.64 లీటర్ల లిక్కర్ ఉంటుంది) విక్రయం కాగా, 370 లక్షల కార్టన్ల
బీరు (ఒక కార్టన్‌లో 7.88 లీటర్ల బీరు) విక్రయం జరిగింది. గత నాలుగేళ్లలో లిక్కర్, బీరు అమ్మకాలు 30 శాతానికి పైగా పెరిగాయి. అంటే గుడుంబా స్థానాన్ని లిక్కర్, బీరు భర్తీ చేస్తున్నాయి. 2014-15 లో ప్రభుత్వానికి ఆబ్కారీ శాఖ ద్వారా రూ. 10238 కోట్ల ఆదాయం రాగా, 2017-18 సంవత్సరానికి ఇది రూ. 14,244 కోట్లకు పెరిగింది. నాలుగేళ్లలో సరాసరిన ఏటా 10 శాతం ఆదాయం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2216 పైగా లిక్కర్ దుకాణాలున్నాయి. దాదాపు ప్రతి దుకాణంలో పర్మిట్‌రూంలు ఉన్నాయి. అంటే దుకాణంలో కొన్న లిక్కర్‌ను ఇంటికి తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా పర్మిట్‌రూంలో తాగేందుకు అవకాశం కల్పించారు.
పేరుకే నిషేధం
రాష్ట్రప్రభుత్వ అధీనంలో ఉన్న శాఖల్లో మద్యపాన నిషేధానికి ఆబ్కారి శాఖ (ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్) అత్యంత ముఖ్యమైంది. మద్యపాన నిషేధం అని శాఖ పేరులోనే ఉన్నప్పటికీ ఎక్కడా నిషేధం ఆనవాళ్లు కానరావడం లేదు. ఆబ్కారీ వ్యాపారం మాత్రం బ్రహ్మాండంగా కొనసాగుతోంది. గుడుంబాను నిషేధించడంతో హైదరాబాద్‌తో పాటు గ్రామాల్లో గుడుంబా తయారీ నిలిచిపోయింది.
మద్య విమోచన కమిటీ ఎక్కడ?
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా మద్య విమోచన కమిటీని ఏర్పాటు చేశారు. ప్రముఖ సంఘసేవకుడు మల్లికార్జున శర్మ చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ మూడేళ్లపాటు పదవిలో ఉంది. ఈ కమిటీ మద్య విమోచన కోసం గ్రామాల్లో తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మద్య విమోచన కమిటీని ఏర్పాటు చేయలేకపోయారు. ఇదే విషయాన్ని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరిని ఆంధ్రభూమి ప్రశ్నిస్తే, అది ప్రభుత్వ పాలసీఅని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు.
మంచిది కాదు: డాక్టర్ శ్రీనివాస్
మద్యం (ఆల్కహాల్) తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ జి.ఆర్. శ్రీనివాస్ రావు తెలిపారు. ఆల్కహాల్ వల్ల స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యలు వస్తాయన్నారు. స్వల్పకాలిక సమస్యల్లో మానసికస్థితి దెబ్బతినడం, ఆవేశానికి గురికావడం, తగాదాలకు పాల్పడటం, ప్రమాదాలకు గురికావడం జరుగుతుందన్నారు. దీర్ఘకాలిక సమస్యల్లో లివర్ చెడిపోవడం, కామెర్లు రావడం, క్లోమగ్రంథి పనిచేయకపోవడం వల్ల ఆహారం జీర్ణంకాకపోవడం, రకరకాల క్యాన్సర్లు రావడం, అన్నవాహిక దెబ్బతినడం, గుండెసంబంధిత వ్యాధులకు గురవుతారన్నారు.
ప్రజల్లో చైతన్యం అవసరం : మల్లికార్జున శర్మ
మద్యం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందని ‘ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన కమిటీ’ మాజీ చైర్మన్ మల్లికార్జున శర్మ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రభుత్వం ఒకేసారి మద్య నిషేధాన్ని అమలు చేయలేదని, అయితే దశలవారీగా దీన్ని అమలు చేయవచ్చన్నారు. తనతోపాటు కమిటీలో ఉన్న 10 మంది సభ్యులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించామన్నారు. అసలు మద్యానికి సంబంధించిన శాఖను కేంద్రప్రభుత్వం స్వాధీనం చేసుకుని దేశం మొత్తంమీద ఒకే రకమైన విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.