రాష్ట్రీయం

గోవిందరాజస్వామి గోపురానికి రూ.32కోట్లతో బంగారు తాపడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 26: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ గర్భగుడిపై విమాన గోపురానికి రాగిరేకులపై బంగారు తాపడం చేసేందుకు 32.26 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ తెలిపారు. మంగళవారం స్థానిక అన్నమయ్య భవన్‌లో జరిగిన పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేఖరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలైన హైందవ భక్తుల కోసం ప్రారంభించిన దివ్యదర్శనం పథకానికి రవాణా సౌకర్యం కోసం 50 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, 50 శాతం వ్యయాన్ని టీటీడీ భరిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీకి 1.25 కోట్లు నిధులు చెల్లించాలని నిర్ణయించామన్నారు. తిరుమలలో అమలు చేయనున్న మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా 15 కోట్లతో మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయం మొదటి విడత అభివృద్ధి పనులకు రూ.36 కోట్లు మంజూరు చేశామన్నారు. యాత్రికుల వసతిగృహం కోసం 5.25 కోట్లు మంజూరు చేశామన్నారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు 25 లక్షలు మంజూరు చేశామన్నారు. అనంతపురం జిల్లా పరిగి మండలం మోద గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 75 లక్షలు, రొద్దం మండలం రొద్దకంభ ఆలయ సమీపంలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 75 లక్షలు, హిందూపురం మండలంలోని చౌళూరు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు 27 లక్షలు మంజూరు చేశామన్నారు. ఇక శ్రీవారి ఆలయ ప్రధానార్చకులుగా ఉద్యోగ విరమణ పొందిన రమణదీక్షితులు స్థానంలో వేణుగోపాల దీక్షితులును నియమించామన్నారు. అంతేకాకుండా ఆగమ సలహామండలిలో రమణ దీక్షితులును తొలగించి ఆయన స్థానంలో వేణుగోపాల్ దీక్షితులను నియమించామన్నారు. ఇక గత ఏడాది ఏప్రిల్ నుండి ఈ ఏడాది ఏప్రిల్ వరకు భక్తులు సమర్పించిన తలనీలాల విక్రయం ఈవేలం ద్వారా 133.32 కోట్లు ఆదాయం లభించిందన్నారు. ఇక కల్యాణ మండపాలు నిర్మాణానికు సంబంధించి సబ్ కమిటీని వేశామని, వారు ఇచ్చే నివేదిక ఆధారంగా కల్యాణమండపాలు నిర్మించాలా? వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక చిల్లర నాణేలకు సంబంధించి కూడా సబ్ కమిటీని వేశామని, పరిశీలించిన అనంతరం తగు చర్యలు చేపడతామన్నారు. అనంతరం ఈవో ఏకే సింఘాల్ మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ పెరుగుతుండడంతో వసతి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని చైర్మన్ చెప్పడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో అదనంగా ఒక పిలిగ్రిమ్స్ అమెనిటీస్ కాంప్లెక్స్‌ను నిర్మించాలని సూచించారన్నారు. ఈ మేరకు 70 కోట్లతో పిఏసీ నిర్మించాలని నిర్ణయించామన్నారు. అయితే ఎక్కడ నిర్మించాలనే అంశాన్ని పరిశీలించమని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించామన్నారు. వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక తిరుపతిలో ఫ్లైఓవర్‌లు, నాలుగురోడ్ల నిర్మాణానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు ఈవో స్పందిస్తూ టీటీడీ ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టడానికి సిద్ధపడిందన్నారు. రైల్వేశాఖ కూడా ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. ఈ క్రమంలో కేంద్రం నిధులు కేటాయిస్తుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ అధికారులు రైల్వే అధికారులతో చర్చలు జరిపిన అనంతరం భక్తుల సొమ్మును ఆదా చేయడం కోసం ఆ పనులపై దృష్టి సారించ లేదన్నారు. వారి నిర్ణయాల అనంతరం అవసరం అయితే తాము స్వామివారి నిధులు వెచ్చిస్తామన్నారు. ఇక 14 మంది అర్చకుల నియామకానికి చర్యలు చేపట్టామన్నారు. 20 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని, వీరిలో 12 మంది అర్హత సాధించారన్నారు. ఇందులో తొలి స్థానంలో నిలిచిన నలుగురికి తిరుమలలోను, మిగిలినవారికి గోవిందరాజస్వామి ఆలయంలో ఉద్యోగం ఇవ్వడానికి బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. మిగిలిన 2 స్థానాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, అర్హులైన వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇక విదేశీ కరెన్సీ టీటీడీకి విరాళం ఇచ్చే భక్తులకు, దాతలకు ఇచ్చే సౌకర్యాల కల్పనపై కూడా చర్చించామన్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవోలు శ్రీనివాసరాజు, పోల భాస్కర్, ధర్మకర్తల మండలి సభ్యులు శివాజీ, బోండా ఉమామహేశ్వర్‌రావు, రాయపాటి సాంబశివరావు, పొట్లూరి రమేష్‌బాబు, సండ్ర వెంకటవీరయ్య, సుధా నారాయణమూర్తి, రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి, డొక్కా జగన్నాథం, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ, ప్రత్యేక ఆహ్వానితులు అశోక్‌రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.

చిత్రం..టీటీడీ పాలకమండలి సమావేశంలో పాల్గొన్న చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యులు, అధికారులు