రాష్ట్రీయం

యూజీసీకి కాలం చెల్లు! -- కొత్త సంస్థ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: దేశంలో ఉన్నత విద్యారంగంలో పెను సంచలనాలకు కేంద్రప్రభుత్వం తెరతీసింది. ఉన్నత విద్యాసంస్థలకు నిధుల జారీ, గుర్తిం, పర్యవేక్షణ, తనిఖీల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని రద్దు చేసింది. దాని స్థానంలో భారత ఉన్నత విద్యా కమిషన్ (హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా/ హెచ్‌ఇసిఐ)కు రూపకల్పన చేసింది. కొత్త కమిషన్‌కు ఏర్పాటుకు ముసాయిదా కూడా రూపొందించింది. అయితే అమలులోకి తెచ్చేముందు ప్రజాభిప్రాయ సేకరణను కోరుతోంది. దీంతో దేశీయ ఉన్నత విద్యారంగంలో భారీ సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టినట్టయింది. ఫలితంగా, దశాబ్దాలుగా కొనసాగుతున్న యూజీసీకి ఇక కాలం చెల్లినట్టయింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రతిపాదిత బిల్లుపై ప్రజల నుండి సలహాలు కూడా కోరింది. వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని కేంద్రం యోచిస్తోంది. ఈ కొత్త కమిషన్‌తో విద్యాసంస్థలకు స్వయం ప్రతిపత్తి పెరుగుతుందని, సౌకర్యాలు మెరుగుపడతాయని కేంద్రం చెబుతోంది. అంతేగాక, భారత విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కూడా కేంద్రం పేర్కొంది. ఉన్నత విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇస్తోందని ఇటీవల ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం తీవ్రమైన చర్చకు దారితీసినట్టయింది. దీనిపై విపక్షాలు మండిపడే అవకాశం ఉంది. కేంద్రం తన ప్రతిపాదనను ప్రకటించిన వెంటనే దేశంలో అనేక ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కేంద్రం ఏం చెబుతోంది?
యూజీసీ చట్టం 1956ను రద్దు చేస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఇసిఐ)ని ప్రతిపాదించినట్టు కేంద్రం బుధవారం నాడు ప్రకటించింది. దీనిని ఇక మీదట భారత ఉన్నత విద్యా కమిషన్ చట్టం, 2018గా వ్యవహరిస్తారు. దీనికి ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 12 మంది సభ్యులు ఉంటారు. వీరి ఎంపికకు ఒక సెర్చి కమిటీని ఏర్పాటు చేస్తారు. సెర్చికమిటీకి క్యాబినెట్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఉన్నత విద్యారంగంలో సైతం మరింత ఉన్నతమైన సంస్కరణలను తీసుకువచ్చే క్రమంలో నియంత్రిత సంస్థల్లో మార్పులను చేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. గతంలో కేవలం తనిఖీల రాజ్యం కొనసాగేదని, దాని వల్ల అనుకున్న ఫలితాలు రాలేదని, ఉన్నత విద్యాసంస్థలకు స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా విద్యా ప్రమాణాలను పెంచేందుకు కేంద్రం యోచిస్తోందని, ఆ క్రమంలోనే కొత్త కమిషన్‌ను ప్రతిపాదించిందని జవదేకర్ ట్వీట్ చేశారు. ‘కనిష్ట ప్రభుత్వ జోక్యం, గరిష్ట సుపరిపాలన, నిధుల మంజూరుకు విడిగా విభాగాల ఏర్పాటు, తనిఖీల రాజ్యానికి తెరదించడం, విద్యాత్మక ప్రమాణాలపై దృష్టిసారించడం, అందుకు తగ్గ అధికారాలను ఇవ్వడం జరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యాసంస్థలు విశిష్ట విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దడం, సమగ్రాభివృద్ధికి తోడ్పడటం వంటి కీలక లక్ష్యాలతో ఈ కమిషన్‌ను ప్రతిపాదించామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పౌరుల నుండి జూలై 7వ తేదీ వరకూ సూచనలు సలహాలను స్వీకరిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు రీఫార్మ్ ఆఫ్ యూజీసీ ఎట్‌ద రేట్ జీమెయిల్ డాట్ కామ్‌కు పంపించవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపాదన ముసాయిదాను మానవ వనరుల మంత్రిత్వశాఖ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు.
కొత్త కమిషన్ విధులు:
ఉన్నత విద్యాసంస్థల బోధన - అభ్యసన పద్ధతుల పర్యవేక్షణ, నవీకరణ, నూతన లక్ష్యాలను నిర్దేశించడంతో పాటు విద్యాప్రమాణాలను కాపాడుతుంది. ఉన్నత విద్యాసంస్థలు సమగ్రాభివృద్ధికి , ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఆయా విద్యాసంస్థలు ఎదిగేందుకు, విజ్ఞాన వికాస రంగాల్లో నూతన ఒరవడిని పుణికిపుచ్చుకునేందుకు, వినూత్న పోకడలను అలవరచుకునేందుకు, విజయవంతమైన ప్రయోగాల సంలీనానికి, ఔత్సాహికత ప్రోత్సాహానికి, అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు, అందరినీ కలుపుకుంటూ, సమాన అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఉన్నత విద్యాసంస్థలకు స్వయంప్రతిపత్తి, స్వేచ్ఛను ప్రసాదించేందుకు ఈ కమిషన్ పనిచేస్తుంది. బోధనకు, అభ్యసనకు, పరిశోధనకు, మూల్యాంకనానికి, ప్రగతి సమీక్షకు ప్రమాణాలను నిర్దేశిస్తుంది. దాంతో పాటు పాఠ్యప్రణాళికల్లో మార్పులు తెస్తూ వార్షిక ప్రణాళికల్లో మార్గదర్శకంగా ఉంటూ అధ్యాపకులకు శిక్షణ, నైపుణ్యాలను అందిస్తుంది. ప్రతి ఉన్నత విద్యాసంస్థ ప్రగతిని గణించేందుకు సూచికలను రూపొందిస్తుంది.
ఆలోచన పాతదే.. ఆచరణే కొత్తది
యూజీసీ స్థానంలో ఉన్నత విద్యాసంస్థల పర్యవేక్షణకు దేశం అంతా ఒకే వ్యవస్థ ఉండాలని 2006లోనే నాలెడ్జి కమిషన్ సూచించింది. అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం యూజీసీ స్థానంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఎన్‌సీహెచ్‌ఇఆర్)ను ప్రతిపాదించింది. దాదాపు అందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే దశలో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తర్వాత యూజీసీ రివ్యూ కమిటీ సైతం 2014లో యూజీసీ స్థానంలో మరో ఉన్నత స్థాయి కమిషన్ ఏర్పాటు కావాలని పేర్కొనగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆచరణలో పెట్టింది.
నిరసనలు
జాతీయ స్థాయి యువజన సంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు కొత్త కమిషన్ ఏర్పాటుపై ఆందోళన వ్యక్తం చేశాయి. తల్లిదండ్రుల సంఘం జాతీయ కన్వీనర్ ఎన్ నారాయణ దీనిని కేంద్రం విద్యారంగంలో చేస్తున్న కుట్రగా పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని లేకుంటే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేస్తామని చెప్పారు.