రాష్ట్రీయం

పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 27: తాను పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు జిల్లాకు చెందిన తెరాస ప్రజాప్రతినిధులు ఆరోపించడంలో ఎలాంటి వాస్తవం లేదని తెరాస నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ స్పష్టం చేశారు. డీఎస్ వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా నేతలంతా అధిష్ఠానానికి లేఖ రాసిన విషయంపై మీడియా డీఎస్‌ను వివరణ కోరగా, ఆయన పైవిధంగా స్పందించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇప్పటివరకు రెండు పార్టీల్లోనే కొనసాగానని గుర్తు చేస్తూ, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విధానాలు, సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశానే తప్ప, ఎన్నడూ వ్యతిరేకంగా వ్యవహరించలేదని అన్నారు. పార్టీకి ద్రోహం చేయడం తన చరిత్రలోనే లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ తనపై చర్యలు కోరుతూ స్థానిక ప్రజాప్రతినిధులు అధిష్ఠానానికి లేఖ రాసినట్టు మీడియాలో వార్తల ద్వారా తెలుసుకున్నానని, దీనిపై తానేమీ స్పందించదల్చుకోలేదని డీఎస్ పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా లేఖ రాయడం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నానని అన్నారు. క్రమశిక్షణ చర్యల సిఫార్సు విషయం మరింత స్పష్టతతో స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధులు పదేపదే కోరినప్పటికీ, డీఎస్ నో కామెంట్ అని పేర్కొంటూ ఒకింత అసహనాన్ని ప్రదర్శించారు. స్థానిక నాయకులు తనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారే తప్ప...తన గొంతు కోస్తామని అనలేదు కదా? అని అసహనం వెళ్లగక్కారు.
ముఖ్య అనుచరులతో డీఎస్ భేటీ
కాగా, తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో డీ.శ్రీనివాస్ ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. డీఎస్‌పై చర్యలు కోరుతూ తెరాస నేతలు అధిష్ఠానానికి లేఖ పంపిన సమాచారం తెలిసిన వెంటనే ఒక్కొక్కరుగా డీఎస్ అనుయాయులు నిజామాబాద్‌లోని ప్రగతినగర్‌లో గల ఆయన నివాసానికి చేరుకున్నారు. వారితో డీఎస్ గుట్టుగా మంతనాలు జరిపినట్టు తెలిసింది. ఒకవేళ తెరాస అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలకు పూనుకుంటే ఏం చేయాలనే దానిపై చర్చించినట్టు సమాచారం. అనంతరం తన కులస్తులైన మున్నూరుకాపు సంఘాల బాధ్యులతోనూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముందస్తుగానే ఖరారు చేసినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం డీఎస్ మధ్యాహ్న సమయంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లగా, ముఖ్య అనుచరులు కూడా ఆయన వెంట రాజధానికి పయనం అయ్యారు. నిజానికి గత కొంతకాలం నుండే డీఎస్ పార్టీ ఫిరాయించే అవకాశాలున్నట్టు పదేపదే పుకార్లు తెరపైకి వస్తుండగా, అలాంటిదేమీ లేదంటూ డీ.శ్రీనివాస్ వాటిని ఖండిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే నెల రోజుల క్రితం జిల్లా కేంద్రంలో తన అనుచరులతో డీఎస్ ఆత్మీయ సమావేశం నిర్వహించగా, అనుయాయులంతా తెరాస నాయకత్వంపై బాహాటంగానే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీలో డీఎస్‌కు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్ కూడా తెరాసలో ఇమడలేక తీవ్ర అసహనానికి గురవుతున్నట్టు పార్టీ శ్రేణుల్లో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. తాజాగా ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతలను కలిసినట్టు సమాచారం తెలుసుకున్న జిల్లా తెరాస ప్రజాప్రతినిధులంతా డీఎస్ తీరును ఆక్షేపిస్తూ, ముందస్తుగానే ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసినట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో తెరాస అధినేత కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారనే దానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.