రాష్ట్రీయం

మొక్కు తీరింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 28: బెజవాడ కనకదుర్గమ్మ మొక్కును తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీర్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు ముక్కుపుడక సమర్పిస్తానని మొక్కుకున్న కేసీఆర్ గురువారం మధ్యాహ్నం భక్తిప్రపత్తులతో కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించి తన మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ దంపతులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు కేసీఆర్ సమక్షంలోనే ఆ ముక్కుపుడకను అమ్మవారికి అలంకరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండేందుకు అభిషేకం చేయాలని కోరగా ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, తదితరులు అదే విధంగా ప్రత్యేక అభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూజా ఫలాలు
సమర్పించారు. అనంతరం కేసీఆర్‌చే ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి ఆలయ మర్యాదల ప్రకారం పట్టు వస్త్రాలను అందించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్‌లో ప్రజల సందర్శనార్ధం అమ్మవారికి ఈ ముక్కుపుడకను అలంకరిస్తామన్నారు. ఈ ముక్కుపుడక 57 వజ్రాలతో కూడుకున్నదని తెలిపారు. కృష్ణమ్మ పొంగి అమ్మవారి ముక్కుపుడకను అందుకుంటుందని, దాంతో కలియుగం అంతమవుతుందని పురాణాల్లో ఉన్నదన్నారు. ఈ సందర్భంగా ఆయన ముక్కుపుడక నేపథ్యాన్ని వివరించారు.
ఘనంగా స్వాగతం, వీడ్కోలు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తదుపరి రెండోసారిగా విజయవాడకు వచ్చిన కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం, ఆపై వీడ్కోలు లభించింది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని సమీపంలోని వెటర్నరీ యూనివర్సిటీ అతిధి గృహంలో కొంచెంసేపు సేద తీరారు. తర్వాత హోటల్ గేట్‌వేకు చేరుకున్నారు. కేసీఆర్ వెంట తెలంగాణా మంత్రులు నాయని నరసింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, బాల్క సుమన్, శాసనమండలి సభ్యులు కర్నే ప్రభాకర్, ఎస్.రాజు, ఎమ్మెల్యేలు జి.కిషోర్, యాదగిరిరెడ్డి, వీరేశం, రాకేష్ ఉన్నారు. స్వాగతం వీడ్కోలు పలికిన వారిలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నగర పోలీస్ కమిషనర్ దామోదర గౌతం సవాంగ్, ఇన్‌ఛార్జి కలెక్టర్ విజయ్‌కృష్ణన్, జాయింట్ కలెక్టర్ బాబూరావు, ఆలయ చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, కార్యనిర్వహణాధికారి పద్మ, దేవాదాయశాఖ కార్యదర్శి అనూరాధ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులున్నారు.
విజయవాడకు ఉజ్వల భవిష్యత్
విజయవాడ నగరం ప్రస్తుతం చాలా అందంగా ఉందని బందరు రోడ్డు చాలా విస్తరించారని, ముఖ్యంగా రోడ్డుకిరువైపులా గోడలపైనున్న డిజైన్‌లు తననెంతో ఆకర్షించాయని కేసీఆర్ అన్నారు. విజయవాడకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ వరకు డివైడర్‌పైనున్న గ్రీనరీ చాలా ముచ్చటగా ఉందంటూ కితాబునిచ్చారు. దుర్గమ్మ దర్శనం బాగా జరిగిందని మరోసారి వస్తానన్నారు.
ఒక్కో మొక్కు తీర్చుకుంటూ వస్తున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మొక్కుబడులన్నీ నింపాదిగా ఒక్కోటి తీర్చుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే విజయవాడ దుర్గమ్మకు కుటుంబ సమేతంగా 1129 గ్రాముల బంగారు ముక్కుపుడకను అందించారు. ఇప్పటికే తిరుమల శ్రీవారికి దాదాపు ఐదు కోట్లతో అద్భుతమైన 14.2 కిలోల సాలగ్రామ హారం, 4.65 కిలోల కంఠాభరణంను సమర్పించారు. మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలను, వరంగల్ భద్రకాళి అమ్మవారికి మూడుకోట్ల 70 లక్షల రూపాయల విలువైన 11 కిలోల 700 గ్రాముల బంగారు కిరీటాన్ని సమర్పించారు.
చిత్రాలు..కేసీఆర్‌కు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలుకుతున్న అర్చకులు
*కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తున్న కేసీఆర్