రాష్ట్రీయం

నేడు తెరుచుకోనున్న ‘బాబ్లీ’ గేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 30: దిగువ గోదావరిలో జలకళకు ప్రధాన అవరోధంగా మారిన ‘బాబ్లీ’ బంధనం తాత్కాలికంగా వీడనుంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ నేడు బాబ్లీ గేట్లను తెరువనుండగా, వరద జలాలు దిగువ గోదావరిలోకి పరుగులు పెట్టనున్నాయి. నిజామాబాద్ జిల్లా సరిహద్దున మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అక్టోబర్ 28వ తేదీ వరకు తెరిచి ఉంచనున్నారు. దీంతో ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా వరద జలాలు తెలంగాణలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుకోనున్నాయి. బాబ్లీ గేట్లు ఎత్తేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. కేంద్ర జల సంఘం ప్రతినిధి సమక్షంలో నాందేడ్, ఎస్సారెస్పీ అధికారుల పర్యవేక్షణలో గేట్లు తెరవనున్నారు. ఈ సందర్భంగా బాబ్లీ వద్ద బంధించబడి ఉన్న దాదాపు 0.40టీఎంసీల నీరు ఎస్సారెస్పీలోకి వచ్చి చేరే అవకాశాలున్నట్టు ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే బాబ్లీ వద్ద గోదావరి నది ఒకింత జలకళను సంతరించుకుని కనిపిస్తోంది. స్థానికంగా నిజామాబాద్ జిల్లాలో గోదావరి నది ప్రవేశించే కందకుర్తి త్రివేణి సంగమంతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర వద్ద కూడా కొంతవరకే నీటి జాడలు కనిపిస్తూ, నది పాయలుగా చీలి ప్రవహిస్తోంది. బాబ్లీ ప్రాజెక్టు నీటి నిలువ ప్రాంతంలో మాత్రం కొత్తగా వచ్చి చేరిన వరద జలాలతో గోదావరి నదికి ఆ మూలన నుండి ఈ మూల వరకు అలలుఅలలుగా ఒడ్డును తాకుతూ కనువిందు చేస్తున్నాయి.
ఈ దృశ్యం బాబ్లీకి ఎగువన కనిపిస్తుండగా, 14గేట్లను కిందకు దించి నీటి ప్రవాహాన్ని నిలిపివేసినందున బాబ్లీకి దిగువన నీటి ప్రవాహం అంతంతమాత్రంగానే ఉండింది. అయితే నేటి నుండి మహారాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆ నీటిని బాబ్లీ గేట్లు పైకి లేపి దిగువ గోదావరిలోకి విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే వర్షాకాలం సీజన్ ప్రారంభమైన మొదటి, రెండు రోజుల్లోనే మహారాష్టల్రో కురిసిన భారీ వర్షాల కారణంగా బాబ్లీ పూర్తిస్థాయిలో నిండడంతో జూన్ 11వ తేదీన నాలుగు గేట్లను పైకి లేపి సుమారు 98వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఫలితంగా దాదాపు రెండు రోజులకు పైగా ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫ్లో కొనసాగి నీటి మట్టం ఆశాజనకంగా మారింది. బాబ్లీ గేట్లు తెరవడానికి ముందు వరకు కూడా ఎస్సారెస్పీలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉండిపోయాయి. 90టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం గల రిజర్వాయర్‌లో కేవలం 6.4టీఎంసలకే పరిమితం అయ్యాయి. ఇందులో 5టీఎంసీలను డెడ్‌స్టోరేజీగా పరిగణిస్తారు. ఇలాంటి తరుణంలో తొలకరి వానలకే బాబ్లీ బ్యారేజీని వరదలు ముంచెత్తడంతో మిగులు జలాలు దిగువకు వచ్చి చేరడంతో ఎస్సారెస్పీ నీటిమట్టం 10.40అడుగులకు పెరిగింది. అంటే ఈ సీజన్‌లో బాబ్లీ గేట్లు అధికారికంగా తెరుచుకోకముందే దాదాపు 4టీఎంసీల నీటి నిల్వలు శ్రీరాంసాగర్‌లోకి వచ్చి చేరాయి. ఇప్పుడైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దాదాపు నాలుగు నెలల పాటు బాబ్లీ బ్యారేజీకి చెందిన మొత్తం 14 గేట్లను తెరిచి ఉంచనున్నారు. బాబ్లీ బంధనాలు దూరం కావడం వల్ల ఇకపై ఎగువన కురిసే వర్షాలతో ఏర్పడనున్న వరద జలాలు బాబ్లీ మీదుగానే వడివడిగా దిగువ గోదావరిలోకి పరుగులు తీయనున్నాయి. ఈ సీజన్‌లో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఒక మోస్తారు వర్షాలు కురియగా, మహారాష్టల్రోని నాందేడ్ ఎగువ ప్రాంతాల్లోని క్యాచ్‌మెంట్ ఏరియాలో కురిసిన వర్షాల వల్ల గోదావరి నదిలో బాబ్లీ వరకు నీటి నిలువలు ఒకింత ఎక్కువగానే నిలువ ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం బాబ్లీ బంధనాల నుండి తాత్కాలికంగా విముక్తి లభించనున్నందున అక్కడ నిలువ ఉంచిన నీరు ఎలాగూ దిగువకు చేరుకోనుంది. ఒక్క బాబ్లీయే కాకుండా వర్షాకాలంలో మహారాష్టల్రోని పైతాన్, సిద్ధేశ్వర్ ప్రాజెక్టుల గేట్లను కూడా జూలై 1 నుండి అక్టోబర్ 28వ తేదీ వరకు పైకి ఎత్తి ఉంచాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నందున వర్షాలు అనుకూలిస్తే ఈసారి ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా భాసిల్లుతున్న ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకుంటుందనే దృక్పథం స్థానిక రైతాంగంలో నెలకొని ఉంది.