రాష్ట్రీయం

కేంద్రానికి ఏపీ అంటే చులకన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రంటే కేంద్రానికి చులకనై పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోంది, మాకు సహకరిస్తే మేమూ సహకరిస్తాం.. లేదా పోరాడుతాం.. ఏం చేస్తారో చేసుకోండి’ అని విరుచుకుపడ్డారు. కడప ఉక్కు కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు చేస్తున్న దీక్ష శిబిరంలో శనివారం సీఎం మాట్లాడుతూ ఇక్కడున్న వైసీపీ నేత కేసుల కోసం లాలూచీ పడి కేంద్రంతో కుమ్మక్కయ్యారన్నారు. అందరం సంఘటితంగా ఉంటే రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోవచ్చునన్నారు. అవినీతి పార్టీని చంకలో పెట్టుకుని తిరుగుతున్నారని, అయినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని దుయ్యబట్టారు. వివిధ ప్రజాసంఘాలతో కలిసి తెలుగుదేశం పార్టీ అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసుకుని ఉక్కు పోరాటం చేయడం అభినందనీయమన్నారు. మరోవైపు పుట్టిన గడ్డకు న్యాయం జరగాలని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఆరోగ్యం సహకరించని మారెడ్డి రవీంద్రనాధరెడ్డి దీక్ష చేయడం అభినందనీయమన్నారు. ఒక పవిత్రమైన భావంతో చిత్తశుద్ధితో చేస్తున్నందువల్లే వీరి ఆరోగ్యం క్షీణించిందన్నారు. కొందరు దీక్షలపై విషప్రచారం చేస్తున్నారని, డాక్టర్లను అడిగితే చెబుతారని ముఖ్యమంత్రి అన్నారు. 40 ఏళ్ల వయసువారు ఢిల్లీలో దీక్షకు కూర్చుని రోజుకొక్కరుగా మూడురోజులకు విరమించారని, వారికి దీక్షలపై చిత్తశుద్ధి లేదని ముఖ్యమంత్రి పరోక్షంగా వైసీపీ ఎంపీలను ఉద్దేశించి అన్నారు.
గాంధీ మహాత్ముడు ఈ దీక్షలను మనకు నేర్పించారని, ఒక పద్ధతి ప్రకారం ఉప్పు సత్యాగ్రహం, నిరాహారదీక్షలు చిత్తశుద్ధితో చేశారని, అందుకే ఆయన జాతిపిత అయ్యారన్నారు. అల్లూరి సీతారామరాజులాంటి వారు మరో పద్ధతిలో పోరాడి ప్రాణత్యాగం చేశారన్నారు. పొట్టి శ్రీరాములు దీక్ష ఫలితంగా తెలుగువాళ్లకు రాష్ట్రం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. విశ్వనాథం, అమృతరావు విశాఖ ఉక్కు కోసం దీక్షలు చేశారని, దీంతో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ దిగివచ్చి విశాఖ ఉక్కు ఇచ్చారని గుర్తుచేశారు. విశాఖ ఉక్కుతో విశాఖపట్నం బాగుపడిందన్నారు. విభజన చట్టం కడప స్టీల్‌ప్లాంట్ పెట్టాలని చెప్పిందని, అయితే కేంద్రం మాత్రం దాన్ని మరుగున పడేసిందన్నారు.
విభజన సమయంలో రైతులకోసం తాను ఏడురోజులు దీక్ష చేశానని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఈరోజు అఖిలపక్ష కమిటీ పోరాటం, సీఎం రమేష్, బీకెట్ రవి దీక్షల ఫలితంగా ఉక్కు పరిశ్రమ వస్తుందని, సాధించుతీరుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా ఉక్కు పరిశ్రమపై తొలి నుండి కేంద్రంతో జరిగిన సంప్రదింపులు, చర్చలను వివరించారు. 2014 జూన్ 2వతేదీ సెయిల్ కమిటీని వేశారని, డిసెంబర్ 2వ తేదీ అది ఫీజుబులిటీ కాదని రిపోర్టు ఇచ్చిందన్నారు. దీంతో 15 మంది సభ్యులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారన్నారు. మెకాన్ సంస్థ ఫీజుబులిటీ ఉందని చెప్పడం, ఇటీవల సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేయడం వరకు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో మోదీ తిరుపతి, నెల్లూరులో సభలు పెట్టి విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదాతోపాటు అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఈరోజు రాష్ట్రం కోసం ఇక్కడ తాడోపేడో తేల్చుకోవాలని పోరాడుతుంటే, వైసీపీ కేంద్రంతో కేసుల మాఫీ కోసం లాలూచీ రాజకీయాలు నడుపుతోందని విమర్శించారు. ఈ సందర్భంలో మరో విషయం చెప్పాలంటూ, రాష్ట్రం అనుమతిస్తే ఫ్యాక్టరీ పెడతానని గాలి జనార్దనరెడ్డి చెప్పడాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ గాలిజనార్దనరెడ్డికి ఇక్కడొక స్టీల్ ఫ్యాక్టరీ పెడతారనే షరతుతో ఓబులాపురం మైన్స్‌ను రెన్యువల్ చేశారన్నారు. ఫైల్ డిపార్ట్‌మెంట్‌కు చేరిన తర్వాత అందులో ‘క్యాప్టివ్’ అనే పదాన్ని తొలగించి గాలి జనార్దనరెడ్డికి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. 110 మిలియన్ మెట్రిక్ టన్నుల మైన్స్‌ను స్వాధీనం చేసుకుని, ఇదే రోడ్లవెంట 2,500 లారీలతో బళ్లారి నుండి కృష్ణపట్నంకు ఐరన్‌ఓర్ తరలించుకుపోయారని విమర్శించారు. జనార్దనరెడ్డి స్వయంగా జగన్మోహన్‌రెడ్డిని తన తమ్ముడని చెప్పుకున్నాడని గుర్తు చేస్తూ, అన్నదమ్ములిద్దరూ స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో ఐరన్ ఓర్‌ను దోచుకుని చైనాకు తరలించుకుపోయారని ఆరోపించారు. ఈ కేసులో శ్రీలక్ష్మీ అనే ఐఏఎస్ ఆఫీసర్, రాజగోపాల్ అనే అధికారి జైలు పాలయ్యారన్నారు. గాలి, జగన్ ఈ కేసుల్లో ఇరుక్కున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు ఇచ్చిన 10,500 ఎకరాలు యాక్సిస్ బ్యాంక్‌లో పెట్టి రూ.500 కోట్లు అప్పుతీసుకున్నది వాస్తవం కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కడప జిల్లాకు ఉక్కుపరిశ్రమ ఇస్తే గాలి జనార్దనరెడ్డి పెట్టిన డబ్బు తిరిగిరాదని, అందువల్లే కేంద్రం గాలి జనార్దనరెడ్డి, వైఎస్ జగన్ కోసం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. మోసం చేసిన కేంద్రాన్ని ఇబ్బంది పెట్టడమే తమ ధ్యేయం గానీ, ప్రజలను ఇబ్బందిపెట్టడం కాదన్నారు.

చిత్రం.. సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు