రాష్ట్రీయం

డెంగీపై పోరుకు ‘వోల్బేషియా’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 4: రాష్ట్రాన్ని వణికిస్తున్న డెంగీ వ్యాధిని తరిమికొట్టేందుకు కొత్త పద్ధతిని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వోల్బేషియా అనే బ్యాక్టీరియాను ఈడిస్ ఎజిప్టీ దోమలో ప్రవేశపెట్టడం ద్వారా డెంగీ, తదితర దోమ కారక వ్యాధులను నియంత్రించనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పరిశోధనా ఫలితాలను వినియోగంలోకి తీసుకురానున్నారు. దోమల కారణంగా డెంగీ, చికున్‌గున్యా, మలేరియా తదితర వ్యాధులు వ్యాపిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. వ్యాధిబారిన పడి వారు కోలుకునేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీనిని దృష్టిలో ఉంచుకుని దోమలను కొత్త విధానం ద్వారా నియంత్రించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విదేశీ పర్యాటకులు తాము పర్యటించే ప్రాంతంలో డెంగీ వ్యాధి గురించి కూడా ఆరా తీస్తుంటారు. రాష్ట్రంపై వివిధ రకాల ప్రభావాన్ని చూపుతున్న డెంగీని నియంత్రించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రకృతిలో సహజంగా లభించే బ్యాక్టీరియా వోల్బేషియా. దాదాపు 60 శాతం కీటకాల్లో, కొన్ని రకాల దోమల్లో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. అయితే డెంగీ కారక ఈడిస్ ఎజిప్టీ దోమలో మాత్రం ఉండదు. ఈ దోమలో వోల్బేషియా అనే బ్యాక్టీరియాను ప్రవేశపెడతారు. ప్రయోగశాలల్లో ఈడిస్ దోమ గుడ్లలో కానీ దోమలో కానీ మైక్రో ఇంజక్షన్ విధానంలో వోల్బేషియా బ్యాక్టీరియాను ప్రవేశపెడతారు. వోల్బేషియా ఉండటం వల్ల ఈడిస్ దోమ మనుషులను కుట్టినప్పుడు, డెంగీ కారక వైరస్ వ్యాపించకుండా నిరోధిస్తుంది. తద్వారా వ్యాధి ఒక దశలో పూర్తిగా అదుపులోకి వస్తుంది. వోల్బేషియా బ్యాక్టీరియా కలిగిన ఈడిస్ దోమలను డెంగీ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలో విడుదల చేస్తారు. వోల్బేషియా ఉన్న ఈడిస్ దోమలు ఆయా ప్రాంతాల్లో ఉన్న దోమలతో కలిసి, సంతానోత్పత్తి చేస్తాయి. వోల్బేషియా ఉన్న ఆడ ఈడిస్ దోమ గుడ్లను పెట్టినప్పుడు, ఆ గుడ్లలో కూడా వోల్బేషియా ఉండటం వల్ల డెంగ్యూ కారక వైరస్ వ్యాప్తిని నిరోధిస్తుంది. ఈ దోమలు, మళ్లీ ఇతర దోమలతో కలిసినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా ఆ గుడ్లలో కూడా ఉంటుంది. వోల్బేషియా ఉన్న మగ దోమ గుడ్లు పెట్టేందుకు సహకరిస్తుంది కానీ గుడ్లను పొదగదు. దీంతో ఆ గుడ్లు పని రాకుండాపోతాయి. వోల్బేషియా ఉన్న ఈడిస్ దోమలతో ఇతర దోమలు కలవడం వల్ల ఒక దశలో అన్నీ వోల్బేషియా ఉన్న దోమలే ఉంటాయి. తద్వారా డెంగీ, తదితర వ్యాధులను నియంత్రించే వీలు ఉంటుంది. ఈ విధానాన్ని ఆస్ట్రేలియా, శ్రీలంక, చైనా, మలేషియా తదితర దేశాల్లో అమలు చేస్తున్నారు. అక్కడ ప్రజలు సహకరించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈడిస్ ఎజిప్టీ దోమలో వివిధ రకాల్లో ఒక రకాన్ని మలేషియాలో, మరో రకాన్ని చైనాలో ఉపయోగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న దోమల్లో 20 నుంచి 30శాతం మేర వోల్బేషియా ఉన్న దోమలు ఉంటే, దోమ కారక రోగాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఈ విధానం వల్ల మానవులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేనట్టు అధ్యయనాల్లో గుర్తించారు. తక్కువ ఖర్చుతో పాటు సమర్థవంతంగా రోగాలను నియంత్రించే ఈ విధానం అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పరిశోధనలను బెంగళూరులో జరుగుతున్నాయి. స్థానిక వాతావరణాన్ని, ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాన్ని గుర్తించి, దోమలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. వీటిని ఎంపిక చేసిన ప్రదేశాల్లో వారానికి ఒకసారి విడుదల చేయడం వల్ల ఈడిస్ దోమ నియంత్రణ సాధ్యం అవుతుంది. త్వరలోనే ప్రయోగాల ఫలితాలను అమల్లోకి తీసుకువచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.