రాష్ట్రీయం

రేపటి నుండి ఆంధ్రా అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 5వ తేదీ సాయంత్రం మూడు గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సీనియర్ పోలీసు అధికారులు, ప్రోటోకాల్ అధికారులు, అసెంబ్లీ సిబ్బందితో వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 18 రోజుల పాటు శాసనసభ జరుగుతుందని ప్రకటించారు. అంతకుమించి శాసనసభ కొనసాగింపు అంశంపై బిఎసిలో చర్చిస్తామని చెప్పారు.
కాగా 10వ తేదీన వ్యవసాయ బడ్జెట్, సాధారణ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. వారం రోజుల వ్యవధితో తెలంగాణ అసెంబ్లీ సైతం ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ ప్రాంగణంలోనూ, పరిసరాల్లోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాగా సాధారణ బడ్జెట్ 1.30 లక్షల కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. వ్యవసాయ బడ్జెట్ వేరుగానూ, బిసి సబ్‌ప్లాన్, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ వేరుగానూ ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు తెలిసింది. శాసనసభలో పేపర్ వినియోగాన్ని నివారించి అంతా హైటెక్, ఇంటర్‌నెట్ ఆధారితంగా సాగేలా చర్యలు చేపడుతున్నారు. ఈ సమావేశాల్లోనే ఇందుకు పూర్తి ఏర్పాట్లు జరగకున్నా, రానున్న రోజుల్లో పరిపూర్ణంగా ఇందుకు చర్యలు చేపట్టనున్నట్టు శాసనసభ కార్యదర్శి తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లును ఈ నెలాఖరులో ఆమోదించుకోవల్సిన రాజ్యాంగ నిబంధన కారణంగా బడ్జెట్ సమావేశాలు మార్చి రెండో వారంలోగా ప్రారంభించుకోవల్సిన అనివార్యత ఉంది. ఈ కారణంగానే ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభం కానుండగా, 10న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5న మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగంతో ఏపి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. 5వ తేదీ శనివారం కావడం వల్ల గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత, మంగళవారం నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయి. మూడు రోజుల పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి, ఆమోదిస్తారు. ఆ తర్వాత 10న ఏపి రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీ ఆమోదం కోసం రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2016-17) వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
సభ సజావుగా జరగాలి: స్పీకర్
శాసనసభ సమావేశాలు సజావుగా జరిగేలా సభ్యులు అంతా సహకరించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలను ఇవ్వడం వల్ల సభ సమావేశాలకు ఆటంకం ఏర్పడుతోందని, ప్రశ్నోత్తర కార్యక్రమం తర్వాత వాయిదా తీర్మానాలను ప్రవేశపెడితే మంచిదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సభను సభ్యులు అడ్డుకోవడం వల్ల ప్రజాసమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదని స్పీకర్ అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం కూడా మంచిది కాదని, గవర్నర్ ప్రసంగం సజావుగా సాగేలా చూడాలని స్పీకర్ చెప్పారు.
ప్రభుత్వంపై వైకాపా అవిశ్వాసం
రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించడంతో రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సమావేశాలు ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్‌కు అందజేయాలని నిర్ణయించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, దానిపై స్పీకర్ తప్పకుండా చర్చ చేపట్టాల్సి వస్తుందని, అప్పుడు తమ పార్టీనుంచి ఇటీవల ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ‘విప్’ జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని వైకాపా భావిస్తోంది.
ప్రశ్నల డ్రా
శాసనసభ్యులు పంపించిన ప్రశ్నలను డ్రా ద్వారా ఇప్పటికే ఎంపిక చేశారు. ఎంపికైన ప్రశ్నలకు సమాధానాలను సంబంధిత శాఖల అధికారుల నుండి తెప్పించారు.