రాష్ట్రీయం

కత్తికి నగర బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ రచయిత, విశే్లషకుడు కత్తి మహేశ్‌కు ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ విధిస్తూ తెలంగాణ పోలీసు శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అభ్యంతరకరమైన వాఖ్యలతో కూడిన క్లిప్పింగ్స్‌ను పదేపదే ప్రసారం చేసిన ఒక టీవీ చానెల్‌కు నోటీసులు పంపింది. ఒక వర్గం వారి మనోభావాలను కించపరుస్తూ, శాంతిభద్రతలకు ముప్పువాటిల్లే విధంగా ఇటీవల వ్యాఖ్యలు చేసిన కత్తిపై పోలీసు శాఖ వేటు వేసింది. ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో అడుగుపెడితే వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని, ఆ తర్వాత మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం డిజిపి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతానికి హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మాత్రమే ఈ బహిష్కరణ ఆదేశాలు ఉన్నప్పటికీ, అవరమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే వీలు ఉంటుందని స్పష్టం చేశారు. 1980 అసాంఘిక శక్తులు, హానికర కార్యకలాపాల నిరోధక చట్టాన్ని అనుసరించి కత్తిపై నగర బహిష్కరణ వేటు పడిందన్నారు. ఇతనిపై ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మూడు కేసులు నమోదై ఉన్నాయని, వాటిలో ఏదోఒకదానిలో అరెస్టు చేసి జైలుకు పంపవచ్చని డీజీపీ అన్నారు. అయితే, తర్వాత వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా న్యాయ నిపుణుల సలహా మేరకు నగర బహిష్కరణ చేస్తే మంచిదని, ఒక వేళ దీని ఉల్లంఘనకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ వివరించారు. గత నాలుగేళ్లగా హైదరాబాద్ ప్రశాంతవాతావరణంలో ఉంటే శాంతిభద్రతలకు భంగం వాటిల్లే
విధంగా ఎవరు ప్రవర్తించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. మతాలు, కులాల పేరుతో సమస్యాత్మకంగా మారే వ్యాఖ్యలు చేయడం, అవి ప్రసార మాధ్యమాల్లో పదే పదే ప్రసారం చేయడం ద్వారా హైదరాబాద్‌లో పథకం ప్రకారం అల్లర్లు, ఆందోళనలు సృష్టించి అస్ధిరపర్చే కుట్ర జరుగుతోందని తమకు సమాచారం అందిందన్నారు. ఈ కారణంగానే అతనిపై బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించినట్లు డీజీపీ చెప్పారు. కత్తి వ్యాఖ్యల వెనుక రాజకీయ ప్రేరేపిత ఉద్దేశ్యాలు ఉన్నట్లు సమాచారం ఉండడం వల్ల బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించ తప్పలేదన్నారు. ఒకరు ఉద్రిక్తతకు దారితీసేలా మాట్లాడితే, దానిని వ్యతిరేకిస్తూ వ్యతిరేక గ్రూపు మరో రకమైన స్టేట్‌మెంట్లు ఇస్తూ, నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టడం వల్ల శాంతిభద్రతలు క్షీణించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇటువంటి వాటిని అసలు ఉపేక్షించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. పత్రికలు, మీడియా కూడా సంయమనం పాటించి ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా ద్వారా కూడా భావోద్వేగాలను రెచ్చగొట్టే, శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లేలా వ్యాఖ్యల ప్రసారం జరిగినా, తాము నిరంతరం నిఘా ఉంచామని, అటువంటి వారు దొరికితే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, పోలీసు కమిషనరేట్లకు కూడా ఇటువంటి అంశాలపై సీరియస్‌గా స్పందించాలని ఆదేశించినట్లు డీజీపీ చెప్పారు. కత్తి మహేశ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ డీజీపీకి కూడా లేఖ రాసి, శాంతిభద్రతల క్షీణతకు దోహదపడే అంశాలపై సహకరించాలని కోరనున్నట్టు తెలిపారు. ఏపీ పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని కత్తి మహేశ్‌ను అదుపులో పెడతామని చెప్పారు. ఏపీ అయినా, తెలంగాణ అయినా, మరే రాష్టమ్రైనా శాంతిభద్రతలకు ముప్పు కలిగించే కత్తి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఇలావుంటే, కత్తి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేస్తూ కథనాలను, చర్చలను చేపట్టిన ఒక టీవీ చానల్‌కు కూడా నగర పోలీసు కమిషనరేట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. వివాదాస్పద, ఉద్రిక్తతకు అవకాశం ఉన్న వ్యాఖ్యలు చేయడం, ఒక వర్గం వారిని కించపర్చేవిధంగా మాట్లాడినా, అటువంటి వార్తలు, విశే్లషణలు, కథనాలు, చర్చలను పదేపదే ప్రసారం చేసినా నేరమే అవుతుందని డీజీపీ వ్యాఖ్యానించారు. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ నియంత్రణ చట్టం 1995 సెక్షన్ 16, 17ను అనుసరించి ప్రోగ్రామ్ కోడ్ నిబంధనల ఉల్లంఘన కింద ఒక టీవీ చానల్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆ నోటీసులకు స్పందించి ఇచ్చిన వివరణ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని డీజీపీ అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అన్న మాట నిజమేనని, కానీ ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉంటే మాత్రం నేరమవుతుందని పేర్కొన్నారు. ఆ నిబంధనల మేరకే కత్తి మహేశ్‌కు సోమవారం ఉదయం నోటీసు ఇచ్చి, ఆ తర్వాత అతని స్వస్ధలం చిత్తూరు జిల్లాకు తీసుకెళ్లి వదిలి వచ్చేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. కాగా, తెలంగాణ పోలీసు శాఖ కత్తిపై బహిష్కరణ నిర్ణయం సాహసోపేతమని పలువురు సమర్ధిస్తున్నారు. అనేక వర్గాల్లో ఈ నిర్ణయం పట్ల సానుకూల వైఖరి వ్యక్తమవుతున్నది.

చిత్రం..మీడియా సమావేశంలో కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ ప్రకటన చేస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి