రాష్ట్రీయం

ప్రాజెక్టుల్లో అవినీతిపై చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ చార్జిషీట్ ప్రజల ముందుంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ వెల్లడించారు. మంగళవారం ఇక్కడ తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మార్పు కోసం చేపట్టిన బీజేపీ జన చైతన్య యాత్రకు విశేష స్పందన వచ్చిందని చెప్పారు. పక్షం రోజుల పాటు ప్రజల పక్షాన సాగిన యాత్రలో అనేక సమస్యలను తమ దృష్టికి తెచ్చారని అన్నారు. ప్రజల ఆలోచనల నుండే ప్రజా సమస్యల ఆధారంగానే ప్రజా మేనిఫెస్టో తయారుచేస్తామని బీజేపీ చీఫ్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రాజెక్టుల్లో అవినీతిని ప్రశ్నిస్తే, ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్న ఆయన ‘ కేసీఆర్ సర్కార్‌పై చార్జిషీట్ వేయడానికి సిద్ధమవుతున్నాం’అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ పట్ల ప్రజలకు విపరీతమైన అభిమానం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం పట్ల వారికి విశ్వాసం పోయిందని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమం నాటికి రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయో, ఇపుడు కూడా అవి అలానే ఉన్నాయని లక్ష్మణ్ చెప్పారు. చేపలు, బర్రెలు, గొర్రెలు పంపిణీ పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని, ఇదేనా బీసీల అభ్యున్నతి అని ఆయన నిలదీశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణ మాఫీ, రైతులకు ఉచితంగా బోర్లు, రైతుల అప్పులకు వడ్డీ మాఫీ వంటి హామీలను ఇచ్చామని ఆయన అన్నారు. రైతులకు మేలు చేసేలా 14 పంటలకు మద్దతు ధర కల్పించిన ప్రధాని మోదీ రైతు పక్షపాతి అని లక్ష్మణ్ పేర్కొన్నారు. పంటలకు మద్దతు ధరపై తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బీజేపీ జన చైతన్య యాత్రతో టీఆర్‌ఎస్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ మునిగిపోయిన నావ అయితే టీఆర్‌ఎస్ మునిగిపోతున్న ఓడ అని లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు సిద్ధించే వరకూ బీజేపీ జన చైతన్య యాత్ర ఆపేది లేదని ఆయన ప్రకటించారు. తొలి విడత యాత్ర విజయవంతం కావడంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శుభాకాంక్షలు తెలిపారని ఆయన అన్నారు. యాత్ర విజయవంతం గురించి తెలుసుకున్న మోదీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభును పంపించారని లక్ష్మణ్ చెప్పారు. కాగా కేసీఆర్ ముందస్తు అనడం కాదని, ప్రజలే ముందస్తు ఎన్నికలు వస్తే కేసీఆర్‌ను ఇంటికి పంపంచాలని ఎదురుచూస్తున్నారని అన్నారు. ఫాం హౌస్, ప్రగతి భవన్‌లో కూర్చుని పగటి కలలు కంటున్న కేసీఆర్ పార్టీలో ఓ ఎమ్మెల్యే రాజకీయాల నుండి సన్యాసం తీసుకుంటున్నారని ఇవన్నీ చూస్తుంటే పార్టీలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధమవుతోందని ఆయన దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి ఎండగట్టి, కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో ద్రోషిగా నిలబెడతామని, అవినీతి, కుటుంబ పాలనతో కమిషన్లకు కక్కుర్తి పడి మిషన్ కాకతీయ, మిషన్ బగీరథ పథకాల్లో నీళ్లకు బదులు డబ్బు పారిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న
టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇంటిముఖం పట్టించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలు అంతా బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు.

చిత్రం..మిట్ ద ప్రెస్‌లో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్