రాష్ట్రీయం

ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 14: రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ను 12 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో ఓడించే లక్ష్యం దిశగా కాంగ్రెస్ ముందస్తు కసరత్తుకు శ్రీకారం చుట్టింది. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో నేడు నల్లగొండలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్‌లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం, రేపు భువనగిరిలో ధనలక్ష్మి గార్డెన్‌లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ ఆహ్మద్ ఈ రెండు
లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సంస్థాగత నిర్మాణం, బూత్, బ్లాక్, మండల స్థాయి కమిటీల ఏర్పాటు, శక్తియాప్ ఎన్‌రోల్‌మెంట్‌లపై సమీక్షించనున్నారు. అలాగే కాంగ్రెస్ నుండి అధికార టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వారిని తిరిగి ఈ సమావేశాల్లో పార్టీలో చేర్చుకునే ఘర్ వాపసీ ప్రక్రియను సైతం నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గాల వారి సమీక్ష అంతా పైకి ఆయా ఆంశాలపై కనిపిస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వారు గ్రూపుల వారీగా ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ ఆహ్మద్ ముందు తమ బల ప్రదర్శనకు దిగే అవకాశముండటంతో సమావేశాలు ప్రశాంతంగా జరుగుతాయో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా పార్లమెంట్ స్థాయా సమావేశాలు విజయవంతంగా నిర్వహించుకున్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్లమెంట్ స్థాయా సమావేశాలు సైతం ప్రశాంతంగా సాగాలని ఆశిస్తోంది. నల్లగొండ పార్లమెంట్ స్థాయి సమావేశంలో భాగంగా పార్లమెంట్ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకండ అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సమీక్షను మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి 8గంటల వరకు వరుస క్రమంలో నిర్వహించనున్నారు. అలాగే రేపు జరిగే భువనగిరి పార్లమెంట్ స్థాయి సమావేశంలో తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, నకిరేకల్, మునుగోడు, జనగామ, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సమీక్షను సైతం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి 8గంటల వరకు వరుసగా నిర్వహించనున్నారు.
ఐక్యతా రాగం వినిపించేనా..!
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలకమైన పదవుల్లో ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కే.జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే. వారి మధ్య సఖ్యత లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పరంగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజాపోరాటాల పరంగా తలోదారి అన్నట్లుగా తమ రాజకీయాలను కొనసాగిస్తుండటంతో జిల్లా పార్టీ అంతా గ్రూపుల సమూహంగా తయారైంది. ఈ సమస్యపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలో అధికారం సాధన దిశగా ముందుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించాలని భావిస్తోంది. ఈ లక్ష్య సాధనకు ముందుగా జానా, ఉత్తమ్, దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ల మధ్య ఐక్యత ఏర్పడాలని నిర్ధేశించింది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారి సమీక్ష సమావేశాల్లో ఈ దిశగా అడుగు ముందుకు పడాలని ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి బ్రదర్స్‌లను అధిష్ఠానం ఆదేశించినట్లుగా పార్టీ వర్గాల సమాచారం. అసలే అధికార టీఆర్‌ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఈ దఫా దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలో అత్యధిక స్థానాలు గెలువాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇందుకు ఈ జిల్లాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్‌ను ఓడించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ తన బలం మేరకు టీఆర్‌ఎస్‌ను ఓడించి అన్ని స్థానాలు గెలవాలంటే పార్టీ నాయకులను, కార్యకర్తలను ఒక్కతాటిపైకి తేవడంపై అధిష్ఠానం ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీకి ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించేందుకు ఏఐసీసీ సర్వేలు జరిపిస్తుండటంతో నేడు, రేపు నిర్వహించే పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాల్లో ముందస్తుగా అభ్యర్థుల ప్రకటనపై కేడర్ నుండి డిమాండ్లు వినిపించే అవకాశం సైతం ఉంది. దీంతో నాయకులంతా ఈ సమావేశాలను తమ బల ప్రదర్శన వేదికలుగా భావించి అనుచరగణంతో తరలిరానుండగా పార్టీలోని వివిధ గ్రూపుల మధ్య పోటాపోటీ నినాదాల హోరు తప్పదనిపిస్తోంది. ఉత్తమ్, జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైతే సమావేశాల్లో గందరగోళానికి ఆస్కారముంది. ముఖ్యంగా నల్లగొండ పార్లమెంటరీ పరిధిలో దేవరకొండ నియోజకవర్గం సమీక్షలో, భువనగిరి పార్లమెంట్ పరిధిలో భువనగిరి, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్, మనుగోడు, జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల సమీక్షలో టికెట్లు ఆశించే ఆశావహుల అనుచర వర్గాల హంగామా సమావేశాల నిర్వాహణకు సవాల్‌గా మారనుంది.

చిత్రం..సమావేశం ఏర్పాట్లను పరిశీలిస్తున్న డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్