రాష్ట్రీయం

మళ్లీ అవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 15: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపర్చిన హామీల అమలులో అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రానున్న పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాల్సిందిగా బీజేపీ, కాంగ్రెసేతర జాతీయ పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాశారు. విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలన్నింటినీ అమలు చేశామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన అంశాన్ని, రాష్ట్రానికి న్యాయసమ్మతంగా మంజూరైన సంస్థలు, నిధులు, తదితర అంశాలపై కూలంకషంగా వివరిస్తూ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై స్పందించాలని, ఉభయ సభల్లో తెలుగుదేశం పార్టీ సభ్యులకు అండగా నిలవాలని ఆ లేఖలో చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రానికి నెరవేర్చినవి, పెండింగ్‌లో ఉన్న అంశాలను అందులో వివరించారు.గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానివ్వకుండా నడిచిన వాయిదాల పర్వాన్ని గుర్తుచేస్తూ ఈసారి తీర్మానంపై చర్చ జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వివిధ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న ముప్పేట దాడిని తిప్పికొట్టేలా పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా గళం వినిపించాలని ఇప్పటికే పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇతర పార్టీల మద్దతు కూడగట్టే బాధ్యతను మాజీ కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, తదితరులకు అప్పగించారు. సుజనా బృందం ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎంపీలు కె కేశవరావు, జితేందర్‌రెడ్డిని కలిసి పార్లమెంట్‌లో తమకు మద్దతివ్వాలని అభ్యర్థించారు. అనంతరం ముంబైలో శివసేన అధినేత రాజ్‌థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో రాష్ట్రాలపై కేంద్రం
చూపుతున్న వివక్షపై వారు చర్చించినట్లు తెలిసింది. ఇదిలావుంటే సీఎం రమేష్ నేతృత్వంలోని మరో బృందం చెన్నైలో ఏఐఏడీఎంకే ఎంపీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. గత పార్లమెంట్ సమావేశాలు కొనసాగినన్ని రోజులు రాష్ట్ర శాసనసభ సమావేశాలను పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వర్షాకాల సమావేశాలను కూడా పార్లమెంట్ సమావేశాలతో పాటు నిర్వహించడం ద్వారా కేంద్రానికి కౌంటర్ ఇవ్వాలనే యోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. శాసనసభ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమాలోచనలు జరుపుతున్నారు. పార్లమెంట్ సమావేశాలతో పాటు కొనసాగిస్తే ఎవరి వాదనలు వారు వినిపించినట్లు ఉంటుందని, ఈవిధంగా రాష్ట్ర ప్రజలకు కేంద్రం వైఖరిపై తగిన సంకేతాలు అందించే వీలుంటుందని భావిస్తున్నారు. ఈ నెలాఖరు, లేదా వచ్చే నెల మొదటి వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల సంవత్సరంలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినకుండా అధికార యంత్రాంగంతో పాటు పార్టీ పరంగా కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 16 నుంచి గ్రామదర్శిని సభల ద్వారా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు పార్టీ పరంగా గ్రామవికాసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. శాసనసభ సమావేశాల అనంతరం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించాలనే భావనతో ఉన్నట్లు తెలిసింది. ఈ రెండు కార్యక్రమాలతో పాటు పార్లమెంట్‌లో జరిగే పరిణామాలను ప్రజలకు వివరించడం ద్వారా ముప్పేట దాడిని ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచనలిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేయటంతో సమావేశాలకు రాలేరు కనుక పార్లమెంట్‌లో పార్టీ ఎంపీలు ఆందోళన తీవ్రతరం చేయాలని చంద్రబాబు సూచించారు. అంతేకాకుండా కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌పై కూడా మద్దతిచ్చే పార్టీలతో చర్చించాలని ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.