రాష్ట్రీయం

పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 15: గోదావరి నదిలో వరద జలాల ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజికి ఎగువ నుండి చేరుతున్న వరద జలాలను వచ్చింది వచ్చినట్టుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం ఉదయం కాటన్ బ్యారేజి వద్ద 9.10 అడుగుల నీటి మట్టం నమోదైంది. బ్యారేజి అన్ని గేట్లను 0.80 మీటర్ల మేరకు ఎత్తివేసి వరద జలాలను దిగువకు విడిచి పెడుతున్నారు. ప్రస్తుతం 3.49 వేల 355 లక్షల క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. భద్రాచలం వద్ద 28.30 అడుగుల నీటి మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతుండటంతో ధవళేశ్వరం వద్ద కూడా నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ, ఆ నీరంతా దిగువకు అంటే కాటన్ బ్యారేజికి చేరుకుంటుంది. దీంతో కాటన్ బ్యారేజి వద్ద ఉద్ధృతి పెరుగుతోంది. కాటన్ బ్యారేజి నుంచి తూర్పు డెల్టాకు 2300 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు 700 క్యూసెక్కులు సాగునీటి కాలవలకు విడుదల చేశారు. పశ్చిమ డెల్టాకు నీటి విడుదలను నిలుపుదలచేశారు. జిల్లాలో విస్తారంగా వానలు పడుతుండటంతో పంట కాలవకు సాగునీటిని విడుదల చేయడం తగ్గించారు. బ్యారేజి నుంచి సముద్రానికి పరవళ్ళు తొక్కుతూ వెళ్తుండటంతో దిగువనున్న ఏటిగట్ల పరీవాహ ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.75 అడుగుల నీటి మట్టం వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక చేస్తారు. ఆదివారం రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద 48 అడుగుల నీటి మట్టం నమోదైంది. పశువుల్లంక మొండి రేవు వద్ద శనివారం జరిగిన పడవ ప్రమాదం నేపథ్యంలో అధికారులు గోదావరి పరీవాహ గ్రామాలను మరింత అప్రమత్తం చేసి ఏటిగట్లపై రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. కోనసీమలోని పలు లంక గ్రామాల రేవుల వద్ద గస్తీ ఏర్పాటుచేశారు. కోనసీమలో పడవ దారి తప్ప మరో గత్యంతరం లేని లంక గ్రామాల రేవుల వద్ద విపత్తుల నివారణ సిబ్బందిని ఏర్పాటుచేసి రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు.