రాష్ట్రీయం

అనంతలో క్రాప్ హాలిడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 16: ఈసారి కూడా వర్షాభావం అనంతపురం జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేసేలా ఉంది. నెలన్నర క్రితమే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా, జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు ముందుకు సాగడం లేదు. రుతుపవనాలు చెప్పుకోదగ్గ ప్రభావం చూపకపోవడంతో సాగుబడి కుదేలవుతోంది. దీంతో ఈసారి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి తలెత్తనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నెలాఖరు వరకు ఖరీఫ్ వర్షాధార పంటలు సాగు చేసుకోవచ్చని వాతావరణశాఖ సూచనల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కోస్తా, కర్ణాటక, మహారాష్టల్రో భారీ వర్షాలు పడుతున్నా, రైతుల్లో మాత్రం ఆందోళన తప్పడం లేదు. ఈ నెలాఖరులోగా వర్షం పడకపోతే సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయి జిల్లాలో ముందస్తు వలసలు మొదలయ్యే పరిస్థితి నెలకొననుంది. ఇప్పటికే కదిరి, రాయదుర్గం, మడకశిర, హిందూపురం, గోరంట్ల తదితర ప్రాంతాల నుంచి చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు బెంగళూరు, చెన్నైకు వలస వెళ్లారు. వీరంతా ఏటా వెళ్లే వారేనని అధికారులు చెబుతున్నా కరువు పరిస్థితులను ముందుగా అంచనా వేసుకుని పంటలు వేయకుండా వెళ్లిన వారూ ఉన్నారని సమాచారం. ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో వేరుశెనగ పంటే ప్రధానంగా అధికంగా సాగవుతోంది. ఈ ఏడాది అన్ని రకాల పంటలూ కలిపి 7.41 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా, నెలన్నర రోజుల్లో కేవలం 1.19 లక్షల హెక్టార్లలో 16.1 శాతం మాత్రమే సాగైంది. తొలకరి ప్రారంభం నుంచి జూన్ నెలలో 63.9 మిల్లీమీటర్ల వర్షానికి గానూ 62.9 మిమీ వర్షపాతం నమోదైంది. ఇది కొంత ఆశాజనకంగా ఉండటంతో రైతులు వర్షాధారంగా ముందస్తుగా వేసిన వేరుశెనగ మొలకెత్తినా వర్షం రాకపోవడంతో నిలువునా ఎండిపోతోంది. జూలై నెలలో సాధారణ వర్షపాతం 67.4 మిమీ కాగా, 16వ తేదీ నాటికి కేవలం 17.6 మి. మాత్రమే కురిసింది. ఈ లెక్కన ఈనెల 53.4 శాతం తక్కువగా ఉంది. అలాగే 80 శాతం మంది రైతులు దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచుకుని, విత్తనాలు నిల్వ చేసుకుని, రోజూ ఆకాశం వైపు, దోబూచులాడుతున్న మేఘాల వంక చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అందించిన సబ్సిడీ విత్తనాలతో పాటు రైతులు అప్పుచేసి మరీ సొంతంగా విత్తనం సమకూర్చుకున్నారు. పంటల సాగు మొదలు ఆఖరు వరకు కనీసం ఎకరాకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. విత్తనం వేయకుంటే తక్కువ ధరకే వేరుశెనగ విత్తనాలు వ్యాపారులకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కొనుగోలు చేసిన దానికన్నా కనీసం రూ.వెయ్యి వరకు నష్టపోవడం ఖాయమని రైతులు భయపడుతున్నారు. ఈ నెలాఖరులోగా వర్షం పడకపోతే కనీసం 4-5 లక్షల హెక్టార్లు కూడా సాగయ్యేలా లేదు.జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట వేరుశెనగతో పాటు కంది, వరి, జొన్న, సజ్జ, పత్తి, ఆముదం అధికంగా సాగు చేస్తారు. తృణధాన్యాలు, నూనె గింజలు, వాణిజ్య పంటలు తదితరాలు 21 రకాలు వేస్తారు. కాగా, ఈనెల 16 నాటికి కేవలం 17.6 మిమీ వర్షం కురిసినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఈనెలలో జిల్లాలోని 63 మండలాలకు గానూ 39 మండలాల్లో చినుకు జాడే లేదు. 24 మండలాల్లో 2.5 మిమీ మేరకు వర్షపాతం నమోదైంది. రెండు దశాబ్దాల క్రితం సగటు వార్షిక వర్షపాతం 540 మిల్లీమీటర్లుగా ఉండేది. గత కొనే్నళ్లుగా 520 మిల్లీమీటర్లకు పడిపోయింది. జూన్ నుంచి అక్టోబర్ వరకు ప్రభావం చూపే నైరుతి రుతుపవనాల కారణంగా జిల్లాలో 20 నుంచి 30 రోజులు వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జిల్లాకు నైరుతి రుతుపవనాలు ప్రయాణించే సరికి బలహీనపడటం రివాజు. అందుకు భిన్నంగా ఈ ఏడాది జూలైలోనే వర్షాలు మొహం చాటేయడంతో అనంత రైతాంగం భవిష్యత్ ఆందోళనలో పడింది.