రాష్ట్రీయం

కాపు వర్గానికి నాయకుడు మీరొక్కరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: ‘కాపు సామాజిక వర్గానికి మీరొక్కరే నాయకుడు కాదు, ఆ భ్రమలోంచి బయటకు రండి. నిజంగా మీరు కాపుల ప్రయోజనాలకు కట్టుబడితే, మీ వైఖరి మార్చుకోండి’ అని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని తెలుగుదేశం అధికార ప్రతినిధి బోండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. ఈ మేరకు బోండా బహిరంగ లేఖ రాశారు. పదేళ్లపాటు కాపు జాతిని ప్రయోజనాలను పట్టించుకోని మీరు ఎవరి రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఇప్పుడు ఆందోళన చేస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడు స్పందించని మీరు ఇప్పుడు కాపులకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు కేటాయించి, 3.25 లక్షల మందికి ఉపాధికోసం రుణాలు మంజూరు చేసిన చంద్రబాబును విమర్శించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మీకు రాజకీయ జన్మనిచ్చి శాసనసభ్యుడిగా, మంత్రిగా మిమ్మల్ని ప్రోత్సహించిన ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ఫోటోలను పెట్టుకోకుండా కాపులను నిర్లక్ష్యం చేసిన వైఎస్ ఫోటోలను పెట్టుకుని వైఎస్‌ను దేవుడని చెప్పడం కాపులను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించి వ్యక్తిగా మీ సలహాలు, సూచనలు ఇస్తే తప్పకుండా స్వాగతిస్తామని, ఇకనుంచైనా మీ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.

పారదర్శక పాలనకు ప్రతిరూపం

గవర్నర్ ప్రసంగంపై టిడిపి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 5: శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ చేసిన ప్రసంగం ప్రభుత్వ పారదర్శక పాలనకు ప్రతిరూపమని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. బిసిలకు అన్యాయం జరుగకుండా కాపులను బిసిల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దడంతో పాటు వైజాగ్‌ను మహానగరంగా తీర్చిదిద్దనున్నారని, రాయలసీమలోని నీటి వనరుల అభివృద్థికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అనేక ఆర్థిక సమస్యల మధ్య ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తోందని అన్నారు. రాయలసీమలో ఆరు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తుందని, అనేక ఏళ్లుగా దోపిడీకి గురవుతున్న వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

వివిధ ప్రాజెక్టులను ఏ రీతిన పూర్తి చేయనుందో కూడా గవర్నర్ వివరించారని చెప్పారు. భవిష్యత్ అభివృద్ధికి గవర్నర్ ప్రసంగం ఒక కరదీపిక వంటిదని పేర్కొన్నారు.
10నుంచి చంద్రబాబు
లండన్ పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 5: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకూ లండన్‌లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వెంట 11 మందితో కూడిన బృందం కూడా పర్యటించనుంది. లండన్‌లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ఈ బృందం పాల్గొంటుంది. చంద్రబాబు వెంట మంత్రులు డాక్టర్ పి నారాయణ, యనమల రామకృష్ణుడు, ఎన్‌ఆర్‌ఐ సలహాదారుడు డాక్టర్ రవికుమార్ పి వేమురు, సిఎం ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పెనుమాక వెంకట రమేష్ బాబు, క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజిమెంట్ కార్పొరేషన్ చైర్మన్ డి లక్ష్మీ పార్ధసారధి, టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, సిఆర్‌డిఎ కమిషనర్ నాగులపల్లి శ్రీకాంత్, సిఎం పిఎస్ పెండ్యాల శ్రీనివాసరావు, చీఫ్ సెక్యూరిటీ అధికారి కూచిపూడి నాగేష్‌బాబు ఉన్నారు.

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతాం: వైకాపా

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 5: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామని ఆయన చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తాను ప్రసంగించిన తర్వాత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్‌కు అందజేస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీ నిబంధన ప్రకారం నోటీసు ఇచ్చిన రెండు రోజుల్లోనే సభ ఆమోదం తీసుకుని 10 రోజుల్లో చర్చ చేపట్టాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు 16 రోజుల పాటు జరగనున్నాయి కాబట్టి సమయం సరిపోతుందని చెప్పారు. ప్రభుత్వం అజెండా పూర్తి చేసుకుని ఆ తర్వాత కూడా చర్చ చేపట్టడానికి ఆస్కారం ఉందని పార్టీ నాయకులు తెలిపారు.
ఈ ప్రభుత్వాన్ని పడగొడతానని తాను ఎప్పుడూ చెప్పలేదని, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని జగన్ అన్నారు. లోగడ తాను రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో 13 నిమిషాల పాటు మాట్లాడనని, ఆ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను మీడియా ఎడిట్ చేసి తమకు అవసరమైన మేరకే ప్రసారం చేసిందని ఆయన చెప్పారు. ఆ మొత్తం చూస్తే అప్పుడు స్పష్టత వస్తుందని అన్నారు.
ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు వైకాపా 25 ప్రశ్నలను, అంశాలను సిద్ధం చేసుకున్నది. అందులో ప్రధానమైనవి: సిఆర్‌డిఎ భూ సమీకరణ, రైతుల అసంతృప్తి, అవినీతి, వ్యవసాయం, వ్యవసాయ రుణ మాఫీలో వైఫల్యాలు, ప్రాజెక్టుల అంచనా పెంపులో అవినీతి, అగ్రిగోల్డ్ బాధితులు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కృష్ణా నదీ జలాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలున్నాయ.