రాష్ట్రీయం

వంద ప్రశ్నలతో ప్రజాబ్యాలెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: టిడిపి చేపట్టిన జన చైతన్య యాత్ర నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ వైకాపా వంద ప్రశ్నలతో ప్రజా బ్యాలెట్‌ను విడుదల చేసింది. టిడిపి చేపట్టింది జన చైతన్య యాత్ర కాదని, ప్రజలపై చేస్తున్న దండయాత్ర అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై ప్రజలను మొసం చేసిందని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వైకాపా విడుదల చేసిన ప్రజా బ్యాలెట్‌లో వంద ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేదా టిడిపి ప్రజలకు జవాబు ఇవ్వాలన్నారు. వ్యవసాయ రుణాలను భేషరతుగా మాఫీ చేస్తాం అని ఇచ్చిన మేరకు రుణాలు మాఫీ అయ్యాయా అని ప్రశ్నించారు. రైతులు కుదువపెట్టిన బంగారాన్ని విడిపిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారా ? రైతుల కోసం ఐదు వేల కోట్ల రూపాయలతో స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేశారా ? మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసే హామీ ఏమైంది ? ఆరు నెలల్లో బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామన్న హీమీని నిలబెట్టుకున్నారా ? ఏటా ఏపిపిఎస్ రిక్రూట్‌మెంట్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న మాటను అమలు చేశారా ? పేదలకు 3 సెంట్ల భూమిలో లక్షన్నరతో పక్కా ఇల్లు కట్టిస్తామన్న హామీ ఏమైంది ? కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించారా ? రుణమాఫీ చేసి డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని ఒక లక్షన్నర వరకు రుణాలు ఇస్తామన్న హామీ ఏమైంది ? ప్రతి జిల్లాలో ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారా ? అన్ని జాతీయ రహదారులను ఆరు లైన్ల రహదారిగా మార్చే ప్రతిపాదన ఏ దశలో ఉంది, పోలవరం ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్న హామీ అమలవుతుందనే నమ్మకం ఉందా ? ఇసుక రేవులను పంచాయితీలకే అప్పగిస్తామన్న హామీ ఏమైంది అని వైకాపా నిలదీసింది. జన చైతన్య యాత్రలకు వచ్చే టిడిపి ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలను ప్రశ్నించాలని ఆయన కోరారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ప్రచురించి ప్రజా బ్యాలెట్‌కు టిడిపి బదులివ్వాలన్నారు.

దక్షిణ కోస్తా,
తమిళనాడుకు వర్ష సూచన
స్థిరంగా కొనసాగుతున్న ద్రోణి

విశాఖపట్నం, డిసెంబర్ 1: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని, దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, తమిళనాడు ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే దక్షిణ కోస్తాతీరంలో ఈశాన్య దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో సాధారణ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

శ్రీసిటీలో ఇసుజు ప్రతినిధులు

తడ, డిసెంబర్ 1: ఇసుజు కార్లకు విడిభాగాలను తయారుచేయడానికి ఎంపిక చేసిన దేశ, విదేశ ఉన్నతాధికారుల బృందం మంగళవారం నెల్లూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌లో మంగళవారం పర్యటించింది. సుమారు 180 మంది సభ్యులు గల ఈ బృందాన్ని శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి స్వాగతం పలికి శ్రీసిటీలో ఏర్పరచిన వివిధ పారిశ్రామిక వసతుల గురించి సాధించిన ప్రగతిని వివరించారు. 2016 ఏప్రిల్‌లో ప్రారంభం కావడానికి ముస్తాబు అవుతున్న ఇసుజా కర్మాగారాన్ని కంపెనీ ప్రతినిధులు సందర్శించడం, కంపెనీ ప్రతినిధులతో వ్యాపారపరంగా సంప్రదింపులు చేయడం పారిశ్రామిక ప్రగతిని పరిశీలించి తమ వ్యాపార పెట్టుబడులకు గల అవకాశాలను తెలుసుకొనడం వారి పర్యటన ఉద్దేశం అన్నారు. సుమారు 3 వేల కోట్ల పెట్టుబడులతో తొలి దశలో 50 వేల వాహనాల ఉత్పత్తే లక్ష్యంగా ప్రారంభానికి పరుగెడుతున్న ఇసుజా మోటార్ కంపెనీ అవసరమైన విడిభాగాలను మనదేశంలోనే తయారుచేయాలన్న ఉద్దేశంతో వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.

తమిళనాట తెలుగు రక్షణకు
9న ఢిల్లీలో మహా ధర్నా

హైదరాబాద్, డిసెంబర్ 1: తమిళనాడులో మన మాతృభాష తెలుగును కాపాడుకుందాం అనే నినాదంతో తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఈ నెల 9వ తేదీన మహాధర్నా చేస్తామని ఆ సంస్థ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. మహా ధర్నా పోస్టర్‌ను మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. జంతర్‌మంతర్ నుంచి పార్లమెంటు వరకు పాదయాత్ర చేస్తామని చెప్పారు. శాసనసభ్యులు మాగంటి గోపినాథ్, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర రెడ్డి, లక్ష్మీ పార్వతి, వైకాపా నేత అంబటి రాంబాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపారు. అనంతరం జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం జోక్యం చేసుకుని తమిళనాడులో భాషాపరంగా అల్పసంఖ్యాకులైన తెలుగు ప్రజల హక్కులను పరిరక్షించాలన్నారు. నిర్బంధ తమిళ భాషా బోధనా చట్టాన్ని రద్దు చేయాలన్నారు. తెలుగును జాతీయ రెండవ అధికార భాషగా గుర్తించాలన్నారు. తెలుగువారిని తమిళులుగా చిత్రీకరిస్తున్న జనాభా లెక్కలను మళ్లీ చేపట్టి సవరించాలన్నారు.

అసలైన ప్రజాద్రోహి వైకాపాయే: టిడిపి

హైదరాబాద్, డిసెంబర్ 1: జన చైతన్య యాత్రలను విమర్శించే హక్కు ఎవరికీ లేదని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. అసలైన ప్రజాద్రోహి అంబటి రాంబాబేనని అనురాధ ఎద్దేవా చేశారు. జనచైతన్య యాత్రలకు ప్రజాద్రోహ యాత్రలు అంటూ అంబటి రాంబాబు విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎపిఐఐసి అధ్యక్షుడిగా ఉన్నపుడు అంబటి రాంబాబు అప్పటి సిఎం రాజశేఖరరెడ్డి భూ దందాలకు యధేచ్చగా కాపుకాశారని, చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై బురదజల్లాలని నేడు తంటాలు పడుతున్నారని అసలు వైకాపా నేత దోచుకున్న ప్రజాధనాన్ని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ జప్తుచేసింది వాస్తవమా కాదా అనేది ఆ పార్టీ నేతలే చెప్పాలని అనురాధ నిలదీశారు. ఇసుక విధానాన్ని ప్రభుత్వం సమీక్షించడంపై అంబటి దివాళాకోరు ఆరోపణలు చేస్తున్నారని , డ్వాక్రా మహిళలకు ఇసుక వ్యాపారంలో భాగస్వామ్యం కల్పించాలని భావించడం చంద్రబాబు చేసిన నేరమా ? పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పిన రాజశేఖరరెడ్డి తీరా మహిళలను మైక్రోఫైనాన్స్ దందాలకు గురిచేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. మైక్రోఫైనాన్స్‌ల బారిన పడిన మహిళలు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడినందుకు కారకులు ఎవరో వైకాపా నేతలే చెప్పాలని నిలదీశారు. ఇసుక మాఫియాలు, లిక్కర్ మాఫియాలను పెంచి పోషిచింది కాంగ్రెస్ నేతలేనని వైకాపా అండదండలతో లిక్కర్ సిండికేట్ నడిపిన లిక్కర్ నేత ఇపుడు కాంగ్రెస్‌ను వీడి వైకాపాలో చేరారని అన్నారు. గంగిరెడ్డి లాంటి స్మగ్లింగ్ డాన్‌ల సంపాదనతో పార్టీ నడిపిన ఘనత వైకాపాదేనని వ్యాఖ్యానించారు. అంబటి ఉద్యోగాల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని చెప్పారు. సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబేనని ఆ వాస్తవం అంగీకరించే నిజాయితీ వైకాపాకు లేకపోవచ్చని అన్నారు.

భూగర్భ జల మట్టాన్ని తెలిపే ఫీజోమీటర్ ప్రారంభం

విజయవాడ, డిసెంబరు 1: జల సంరక్షణ పద్దతుల్ని వినియోగించి భూగర్భ జల మట్టాన్ని ఒక మీటరు పైకి తేగలిగితే 90 టీఎంసిల నీరు భూ గర్భంలో నిల్వ చేయగలమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో భూగర్భ జల మట్టం వివరాలను తెలిపే ఫిజో మీటరును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని మొత్తం భగర్భాన్ని ఒక జలాశయంగా మార్చేందుకు అవసరమైన అధ్యయనాలు చేపట్టాల్సిందిగా ఇంజనీర్లను ఆదేశించారు. భూగర్భజలం 3 నుంచి 8 మీటర్ల వరకు ఉండేలా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి పది చదరపు కిలోమీటర్లకు ఒక రైన్‌గేజ్, ఒక ఫిజోమీటర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 735 పరివాహక ప్రాంతాల్లో 1254 ఫిజోమీటర్ల ఏర్పాటును డిసెంబరులోగా పూర్తి చెయ్యాలన్నారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 1960 మిల్లీ మీటర్లుగా ఉంటుందని ఇందువల్ల లభ్యమైన నీటి వల్ల 450 టిఎంసీల మేర భూగర్భ జలాలు ప్రతి ఏటా రీచార్జ్ అవుతుండాలని సిఎం పేర్కొన్నారు. నవంబర్‌లో రాయలసీమ జిల్లాల్లో కురిసిన వర్షం వల్ల 200 టిఎంసీల మేర భూగర్భ జలాలు నమోదైయ్యాయని, ఇందువల్ల రాయలసీమ ప్రాంతంలో భూగర్భ జలాలు 8.59 మటీర్లు, ఆంధ్రప్రాంతంలో 3.84 మీటర్లు పెరిగాయన్నారు.

రాష్ట్రంలో అవినీతిని అంతమొందిస్తా: బాబు

గుంటూరు, డిసెంబర్ 1: వేలిముద్రలు, కనురెప్పలు చూసిన తరువాతనే రేషన్ పంపిణీ చేసే టెక్నాలజీని తీసుకురావటంతో రాష్ట్రంలో అవినీతిని ప్రక్షాళన చేస్తున్నామని సిఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో జనచైతన్య యాత్రలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఈ-పోస్ విధానం ద్వారా ఒక్క గ్రాము కూడా తక్కువ రాకుండా రేషన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించామని అన్నారు. అందులో భాగంగానే మీఇంటికి-మీభూమి కార్యక్రమం చేపట్టామన్నారు. అధికారుల జోక్యంతో భూముల నమోదులో తలెత్తున అవకతవకలను నిరోధించేందుకే కంప్యూటరీకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. మీ సెల్‌ఫోన్‌లోనే భూముల వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించామన్నారు. గ్రామంలో పర్యటించిన సమయంలో పింఛన్‌దారులను లంచాలు ఇస్తున్నారని 10 మందికి పైగా ప్రశ్నించటం జరిగిందన్నారు. అయితే ఎవరూ కమీషన్లు, లంచాలు ఇవ్వకుండా రూ.1000ల పింఛను తీసుకుంటున్నట్లు తెలపటంతో తనకు ఎంతో ఆనందం కలిగిందన్నారు. నేను మీ పెద్ద కొడుకునని, ఎవరైనా లంచాలు అడిగితే నాకు ఫోన్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.