రాష్ట్రీయం

ఉత్తమ్ ప్రతిపాదన సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: సార్వత్రిక ఎన్నికల సమయంలో అభ్యర్థులను ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, ఇకమీదట ముందే పేర్లు ప్రకటిస్తే బాగుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానానికి చేసిన సూచన ఆచరణ సాధ్యమేనా? ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన ఆదివారం జరిగిన సీడబ్ల్యుసీ సమావేశంలో ఉత్తమ్ ప్రతిపాదించినట్టు ముందుగానే అభ్యర్థులను ప్రకటించి, తలుపులు మూసేస్తే, పార్టీలోకి వచ్చేది ఎవరు? ఇప్పుడు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలివి. ఉత్తమ్ సలహా బాగానే ఉంది కానీ ఆచరణలో అది సాధ్యమయ్యే పని కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ముందే అంటే ఎన్ని రోజుల ముందు ప్రకటించాలి? ఆరు నెలల ముందు ప్రకటించాలా?, అభ్యర్థులను ముందే ప్రకటిస్తే, మిగతా పార్టీల నుంచి బలమైన నాయకులు ఆ పార్టీలో చేరే అవకాశం ఉండదు. అలాంటి నాయకులు తమకు సీటు ఇచ్చే అవకాశం లేదని, తలుపులు మూసేసుకున్నారని భావిస్తారు. ఉదాహరణకు ఒక జనరల్ సీటులో ఇతర పార్టీ బీసీని లేదా దళిత నాయకున్ని బరిలోకి దింపితే, ఇవతలి పార్టీ కూడా వ్యూహం మార్చి అదే సామాజికవర్గానికి సీటు ఇస్తుంది. ముందే అభ్యర్థిని ప్రకటిస్తే అవతలి పార్టీ వ్యూహం ముందు చిత్తు కావాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వ్యూహం మారుస్తూ అడుగులు వేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో ప్రతిబంధకాలు తలెత్తుతాయి. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నా, ఇతర పార్టీ నుంచి జంప్ అయ్యే సీనియర్ నాయకులకైనా సీట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు మిత్రపక్షంగా మారిన ఒక పార్టీకి 10 సీట్లు ఇవ్వాల్సి ఉంటే, ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా పెద్ద లొల్లి, పంచాయితీ తప్పవు. ముందే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా తాను బోలెడంత డబ్బు ఖర్చు పెట్టుకున్నానని, రాత్రింబవళ్ళు కష్టపడ్డాననీ, ఇప్పుడు మరో పార్టీకి సీటు ఎలా ఇస్తారంటూ సదరు అభ్యర్థి నానా హంగామా చేయకుండా ఉండరు. అలా చేసినందుకు క్రమశిక్షణా చర్య తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, సదరు అభ్యర్థి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగి, ఓట్లు చీల్చడంతో, మూడో పార్టీ అభ్యర్థికి మేలు చేసినట్లు అవుతుంది. ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఇటువంటి చిక్కులన్నీ వస్తాయి. కాబట్టి అన్నీ పార్టీలూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్ల దాఖలుకు తుది గడువు వరకూ నానుస్తూనే ఉంటాయి. ఒక రకంగా అది రాజకీయ ఎత్తుగడే.
అయితే ఉత్తమ్ ఇవన్నీ ఆలోచించకుండానే అటువంటి సలహా, సూచన చేశారా? అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామంటే, ఇతర పార్టీల నాయకులు ఎవరైనా సీట్లు ఆశించే వారు ఉంటే అప్రమత్తమై ముందుగానే వస్తారేమోనని భావించి ఉండవచ్చు. ముందే ప్రకటించడం ద్వారా తమకు సీటు రాదు అనుకుని పార్టీని వీడే వారు ఎవరైనా ఉన్నా వారు ఇతర పార్టీల్లోకి వెళ్ళడంతో స్పష్టత వస్తుందని అనుకుని ఉంటారు. అంతేకాకుండా ముందే అభ్యర్థులను, ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తే, ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళేందుకు అవకాశం ఉంటుందని అనుకుని ఉంటారు. ఈ కారణాలను మనసులో ఉంచుకొని ఆయన ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చు. 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందే తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అప్పుడున్న 73 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరికి తప్ప అందరికీ సీట్లు ఇస్తానని ప్రకటించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌ను ధైర్యంగా ఎదుర్కొవడంలో ముందున్నారు. దీంతో వారికీ తిరిగి సీట్లు ఇస్తానని ఎన్టీఆర్ ప్రకటించారే తప్ప మిగతా 220 సీట్ల విషయంలో చివరి నిమిషం వరకూ వేచి చూస్తూనే పాచికలు కదిపారు. చివరికి వామపక్షాలనూ కలుపుకొని అనూహ్యంగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 227 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. మిత్రపక్షాలైన వామపక్షాలతో కలిపి 256 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్‌కు కేవలం 26 స్థానాలు మాత్రమే దక్కాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా లోగడ అంటే రాష్ట్ర విభజనకు ముందు కొన్ని స్థానాలను ముందే ప్రకటించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అభ్యర్థులను మార్చని సీనియర్లు, మంత్రుల సీట్లను ముందే ప్రకటించే వారు. అలా చేయడంలో గొప్ప విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఆయా స్థానాలను ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో పార్టీ ఫిరాయించే వారు ఆశించరు. ఏదైనా ఉత్తమ్ సలహా, సూచన చర్చనీయాంశంగా మారింది.