రాష్ట్రీయం

నవ శోభితంగా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 29: అమరావతి రాజధాని ప్రాజెక్టుకు అంతర్జాతీయ సంస్థల నుంచి విశేష స్పందన లభిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జాతీయ స్థాయి వర్క్‌షాపులు ఏర్పాటు చేసి అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించాలని రాష్ట్ర రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత నవ నగరాలతో రాజధానిని ప్రపంచంలోనే ఉత్తమ సంతోష నగరంగా, నవకల్పనల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను వివరించాలన్నారు. అమరావతి మీడియా సిటీపై ఢిల్లీలో ఇప్పటికే వర్క్‌షాప్ నిర్వహించామని గుర్తుచేశారు. ప్రతిపాదిత నవ నగరాల అభివృద్ధి ప్రాజెక్టులపై వర్క్‌షాపులు నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. అమరావతిలో మీడియా, క్రీడలు, ప్రభుత్వ, న్యాయ, ఆర్థిక, నాలెడ్జి, పర్యాటక, ఎలక్ట్రానిక్, ఆరోగ్య వంటి తొమ్మిది నగరాలను విశిష్ఠ పాలన, ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధి కార్యకలాపాల కేంద్రాలుగా మార్చాలని అధికారులకు సూచించారు. తొమ్మిది నగరాల నిర్మాణంలో సూచనలు, సలహాలకు అంతర్జాతీయ నిపుణులను ఆహ్వానించాలని సీఆర్డీఏ అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు నిర్దేశించారు. అమరావతిని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని నిర్ణయించిన నేపథ్యంలో 9 నగరాలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా రూపొందించాలని ఆకాంక్షించారు. అమరావతి ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలుస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. మన దేశాభివృద్ధిలోనూ అది కీలకంగా, ఆర్థికాభివృద్ధిలో శక్తికేంద్రంగా మారనుందని వివరించారు. రాజధానిలో తొమ్మిది ప్రత్యేక నగరాల ఏర్పాటు కానె్సప్ట్ మరే ఇతర దేశంలోనూ లేదన్నారు. ఈ నగరాలు ప్రజలకు ప్రపంచ శ్రేణి జీవన ప్రమాణాలు కల్పించటంతో పాటు ప్రజలు సంతోషంగా ఉండేందుకు దోహదపడాలన్నారు. అమరావతి అభివృద్ధి ఫలాలు రాష్ట్రం అంతటికీ చేరతాయని తెలిపారు. అదే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అమరావతి తెలుగువారు గర్వంగా చెప్పుకునే రాజధాని అని, వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అనేక అంశా ల్లో ఎంతో ప్రగతి సాధించిందన్నారు. దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు సాధించామని, తలసరి ఆదాయం పెంచామని, ఉద్యోగావకాశాలు కల్పించామని చెప్పారు. పేదలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని గుర్తుచేశారు. గడచిన నాలుగేళ్లలో అన్ని హా మీలు నెరవేర్చామని తెలిపారు. ఇక రాజధాని నిర్మాణాన్ని వేగవంతం
చేయటంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు సైతం గుర్తించాయన్నారు. డిసెంబర్‌లోగా అమరావతికి ఒక రూపు తీసుకొస్తే అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు కచ్చితంగా ముందుకొస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి, ఇంధన, పెట్టుబడులు, వౌలిక సదుపాయాలు, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, స్పెషల్ కమిషనర్ రామ్మోహన్‌రావు, అదనపు కమిషనర్ షణ్మోహన్ తమ పరిధిలోని అంశాలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అమరావతిలో 2050 కల్లా 15లక్షల ఉద్యోగాలను సృష్టించటం, 35 బిలియన్ డాలర్ల జీడీపీని చేరుకోవటమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు అజయ్ జైన్ తెలిపారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీ్ధర్ నవ నగరాల ప్రాధాన్యతను వివరించారు. సీఎం పిలుపు మేరకు రాష్ట్రానికి చెందిన చుక్కపల్లి ఆకాష్ నేతృత్వంలోని యువ వాణిజ్యవేత్తల బృందం అమరావతి నిర్మాణ కార్యక్రమాల్లో అనుసరించాల్సిన అంతర్జాతీయ ఉత్తమ విధానాలపై ఆధ్యయనం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిందని తెలిపారు. ఆర్థిక నగరాన్ని 2091 హెక్టార్లలో ఏర్పాటు చేస్తామని, ఇందులో ఎకనామిక్ కోర్, ఇళ్లు, వాణిజ్య సముదాయాలు ఉంటాయని అజయ్ జైన్ తెలిపారు. 3459 హెక్టార్లలో ఏర్పాటయ్యే ఎలక్ట్రానిక్ నగరంలో ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఉంటాయని, మరో 2663 హెక్టార్లలో ఆరోగ్య నగరం నిర్మితమవుతుందన్నారు. క్రీడల నగరంలో భారీ స్టేడియంలు, వేదికలు, అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, మీడియా సిటీని 2067 హెక్టార్లలో ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణానదీ తీరం వెంట పర్యాటక నగరం రూపుదిద్దుకుంటుందని సమావేశంలో వివరించారు.