రాష్ట్రీయం

భగ్గుమన్న భోజన కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ (జగదాంబ), జూలై 30: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌పరం చేయడాన్ని నిరసిస్తూ ఈ పథకం కార్మికులు విశాఖలోని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని సోమవారం ముట్టడించారు. స్థానిక ఎంవీపీ కాలనీలో ఉన్న మంత్రి ఇంటి వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్న మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ధర్నా, కొద్ది సేపటికే ఉద్రిక్తతకు దారితీసింది. మహిళా కార్మికులు ఒక్కసారిగా గంటా ఇంటిని ముట్టడించేందుకు దూసుకువచ్చారు. ఇంటికి సమీపంలో ఉన్న బారికేడ్లను తోసుకుంటూ మంత్రి ఇంట్లోకి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ దశలో పోలీసులు, కార్మికులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా మహిళలు గంటా ఇంటి వెనుక ఉన్న హైవేపైకి దూసుకెళ్లి, అక్కడ బైఠాయించారు. దీంతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై రోడ్డుపై బైఠాయించిన మహిళలను లాగిపారేశారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను ఆరెస్ట్ చేసి వాహనాల్లో నగర శివారు పోలీస్ స్టేషన్లుకు తరలించారు.
ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు వరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను బడిబాట పట్టించడంతోపాటు, వారికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో విద్యాశాఖ అధికారులు క్లస్టర్ విధానాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రంలో 71 క్లస్టర్లుగా విభజించి వాటిని అక్షయపాత్ర, నవ ప్రయాస, ఎక్‌తాశక్తి వంటి ప్రైవేట్ సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సరికాదున్నారు. గత 15 ఏళ్లుగా ఇదే పనిలో ఉన్న తమకు కనీస వేతనం ఐదు వేలు, ఉద్యోగ భద్రత, గుర్తింపుకార్డులు, ప్రతి నెలా 5లోపు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పథకం ప్రారంభంలో ఉన్న మెస్ చార్జీలే నేటికి అమల్లో ఉన్నాయని, వాటిని పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా పెంచాలన్నారు. మధ్యాహ్న భోజన పథక కార్మికులకు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని, మంత్రి గంటా శ్రీనివాసరావు కార్మికుల సమస్యలను తెలుసుకుని వారికి న్యాయం చేయాలని, లేకుంటే పోరాటాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సోమవారం జిల్లాలోని ఏ పాఠశాలలోనూ మధ్యాహ్న భోజనం వండకుండా కార్మికులు నిరసన తెలిపారు.