రాష్ట్రీయం

కదం తొక్కిన రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్/బాల్కొండ, ఆగస్టు 1: కళ్లెదుటే ఎండుతున్నపంటలను ఎలాగైనా కాపాడుకోవాలనే తాపత్రయంతో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ రైతులు కదం తొక్కారు. అన్నదాతల నిరసనలతో మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్.ఈ కార్యాలయం వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెగ్మెంట్ పరిధిలోని సుమారు రెండు వేలమంది వరకు రైతులు తమ కుటుంబ సభ్యులతో పోచంపాడ్‌కు చేరుకుని ఎస్.ఈ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోని ఏసీ మెషీన్‌లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. అక్కడి నుండి 44వ నెంబర్ జాతీయ రహదారి పైకి చేరుకుని రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీస్ కమిషనర్ కార్తికేయ హుటాహుటిన పోచంపాడ్ వద్దకు చేరుకుని భారీ పోలీసు బలగాలను మోహరింపజేశారు. అయినప్పటికీ రైతులు ఏమాత్రం వెరువకుండా తమ నిరసన కార్యక్రమాలను యథాతథంగా కొనసాగించారు.
ఒకదశలో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వావాదం, పరస్పర తోపులాట చోటుచేసుకుని ఒకరిద్దరు పోలీసు కానిస్టేబుళ్లు స్వల్పంగా గాయపడ్డారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన నిరసనల పర్వం సాయంత్రం 6గంటల వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు కార్యాలయం వద్దే రైతులు వంటా-వార్పు చేసుకుని, అవసరమైతే నిరవధిక ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. కర్షకులు ఇంతటి తీవ్రస్థాయిలో కనె్నర్ర జేయడానికి ఎస్సారెస్పీ కాకతీయ కాల్వకు లీకేజీ జలాలు వదలకపోవడమే నిరసనలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఏటా కాకతీయ కాల్వకు స్వల్ప పరిమాణంలోనైనా లీకేజీ జలాలను విడుదల చేస్తుంటారు. దీంతో ఎస్సారెస్పీ దిగువ ప్రాంతాలైన మెండోరా, వెల్కటూర్, వెంచిర్యాల్, రెంజర్ల, సావెల్, కమ్మర్‌పల్లి మండలంలోని ఉప్లూర్, నల్లూర్ తదితర గ్రామాలకు చెందిన రైతులు కాలువలో మోటార్లు ఏర్పాటు చేసుకుని తమ పంటలకు నీటిని మళ్లించుకుంటారు. అదే నమ్మకంతో ప్రస్తుత ఖరీఫ్‌లోనూ పంటలు విత్తుకున్నారు. అయితే ఈసారి లీకేజీ జలాలను విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయే స్థితికి చేరుకుంటుండడంతో కలత చెందిన రైతులు మూడు రోజుల క్రితం ఎస్సారెస్పీ అధికారులను సంప్రదించి కాకతీయ కాల్వలోకి లీకేజీ జలాలు వదలాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల్లో విడుదల చేస్తామని అధికారులు నమ్మబలకడంతో రైతులు వెనుదిరిగారు. కానీ నీటి విడుదల జరగకపోవడంతో ఆగ్రహించిన ఆయా గ్రామాల రైతులు ఇంటికి ఇద్దరు చొప్పున సుమారు రెండు వేల మంది ట్రాక్టర్లు, వివిధ వాహనాల్లో బుధవారం ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకుని ఎస్‌ఈ కార్యాలయం ఎదుట బైఠాయించారు. రైతులను పోలీసులు అడ్డుకుని, ఐదుగురు ప్రతినిధులను మాత్రమే చర్చల నిమిత్తం లోనికి పంపించారు. అయితే వారం రోజుల అనంతరం లీకేజీ జలాలను కాల్వలోకి వదులుతామని, అది కూడా ప్రభుత్వం నుండి అనుమతి వస్తేనే సాధ్యమవుతుందని, తమ చేతుల్లో ఏమీ లేదని నిస్సహాయత వెలిబుచ్చారు. ప్రతినిధులు బయటకు వచ్చి ఇదే విషయాన్ని తెలపడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి లోనై కార్యాలయంలోని కుర్చీలు, ఏసీ యంత్రాలను ధ్వంసం చేశారు. మహిళా రైతులు సైతం మూకుమ్మడిగా నిరసనకు దిగడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు ఆపసోపాలు పడాల్సి వచ్చింది. పోలీసుల సమక్షంలోనే రైతులు కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేస్తూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మధ్యాహ్నం సమయంలో కార్యాలయం ఆవరణలోనే వంట చేసుకుని సామూహిక భోజనాలు చేశారు. అనంతరం రైతులు 44వ నెంబర్ జాతీయ రహదారిపైకి చేరుకుని రాస్తారోకోకు పూనుకున్నారు. మధ్యాహ్నం 3గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా రాస్తారోకో కొనసాగిస్తుండడంతో ఎక్కడికక్కడ వందలాది వాహనాలు స్తంభించిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాకతీయ కాలువకు లీకేజీ రూపంలో 200 క్యూసెక్కుల నీటిని వదిలే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు భీష్మించుకు కూర్చున్నారు.