రాష్ట్రీయం

రాజకీయ దురుద్దేశంతోనే నా కుటుంబంపై కుట్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 3: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ దురుద్దేశంతో తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు డీ. శ్రీనివాస్ తనయుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అనుమానాలు వెలిబుచ్చారు. తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ఖండించారు. చిన్నపిల్లలు చాలా పెద్దపెద్ద మాటలు మాట్లాడారని, తెర వెనుక ఉండి వారిని ఎవరో ప్రేరేపించినట్టుగా స్పష్టంగా తెలిసిపోతోందని సంజయ్ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నర్సింగ్ కళాశాల తన పేరిటే ఉన్నప్పటికీ నిర్వహణ బాధ్యతలను గత చాలాకాలం క్రితమే వేరే యాజమాన్యానికి అప్పగించడం జరిగిందన్నారు. అప్పటి నుండి తాను కాలేజీకి కూడా వెళ్లడం మానుకున్నానని, అసలు నర్సింగ్ కోర్సులో ఎవరు చదువుతున్నారో కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు. కాలేజీలో అడ్మిషన్లు ఎవరు చేపట్టారు, ఫీజులు ఎవరికి కట్టారు, సర్ట్ఫికెట్లు ఎవరు సేకరించారనే అంశాలను విచారిస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుందన్నారు. విద్యార్థుల సర్ట్ఫికెట్లు ప్రస్తుతం కాలేజీ నడిపిస్తున్న యాజమాన్యం వద్దే ఉన్నాయని, ఒకవేళ విద్యార్థినులు వేరే కళాశాలలో చేరాలనుకుంటే వారికి వారి సర్ట్ఫికెట్లు ఇప్పించేందుకు తాను కూడా కృషి చేస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులకు అన్యాయం జరగకూడదని అన్నారు. తానెవరితోనో సహజీవనం చేస్తున్నట్టుగా కూడా దుష్ప్రచారం సాగిస్తున్నారని అసహనం వెళ్లగక్కారు. తనకు భార్య, పిల్లలు ఉన్నారని, ఈ జన్మంతా వారితోనే కలిసి ఉంటానని సంజయ్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయంగా దెబ్బతీయాలనే దురుద్దేశ్యంతో తమ కుటుంబాన్ని ఎవరో లక్ష్యంగా చేసుకుని ఈ తరహా కుట్రలను తెరపైకి తెస్తున్నట్టు స్పష్టమవుతోందని అన్నారు. వారు ఎవరనేది తనకు తెలియనప్పటికీ, ఎన్నికలు సమీపిస్తున్నందున తమను టార్గెట్‌గా చేసుకున్నారని మాత్రం తెలుస్తోందన్నారు. బీజేపీలో దూకుడును కొనసాగిస్తున్న సోదరుడు అర్వింద్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ తరహా తప్పుడు ఆరోపణలు చేయించి ఉంటారా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు కావచ్చేమోనని సంజయ్ సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ప్రభుత్వం విచారణ చేపడితే పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.
ఇది తెరాస అంతర్గత వ్యవహరం : ధర్మపురి అరవింద్
మాజీ మేయర్ డీ.సంజయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఆయన సోదరుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ వద్ద ప్రస్తావించగా, ఆయన తేలిగ్గా కొట్టిపారేశారు. ఈ వ్యవహారంలో తాను స్పందించేందుకు ఏమీ లేదని, ఇది తెరాస అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. తన సోదరుడు సంజయ్‌తో తనకు గడిచిన 20 సంవత్సరాల నుండి సంబంధాలు లేవని, ఈ విషయాన్ని ఇదివరకే తాను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగిందన్నారు. తన కుటుంబ సభ్యులపై ఈ తరహా ఆరోపణలు చేసినంత మాత్రాన తన రాజకీయ పలుకుబడి, వ్యక్తిగత ప్రతిష్టకు ఎలాంటి భంగం వాటిల్లబోదని అరవింద్ స్పష్టం చేశారు.