రాష్ట్రీయం

రైతు వ్యతిరేకి తెరాస సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 3: రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న తెరాస ప్రభుత్వం గద్దె దిగే సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. ఎన్నికల్లో ఎంపీ కవిత పోటీ చేస్తే కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలువడం కష్టంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, సాగునీటి కోసం పరితపిస్తూ రైతులు గడిచిన నాలుగు రోజులుగా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే, జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ కవిత ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పంటలను కాపాడుకునేందుకు ఎస్సారెస్పీ నుండి కేవలం అర టీఎంసీ నీటిని వదలాలని కోరుతూ రైతులు తమ ఇళ్లను పొలం పనులను మానుకుని నిరసనలు తెలుపుతున్నా, తెరాస సర్కారుకు అన్నదాతల గోసపై కనికరం రావడం లేదన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 15.93 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా, గతేడాది ఇదే సమయానికి కేవలం 9.58 టీఎంసీలే ఉండేవని వివరించారు. ఎగువన మహారాష్టల్రోని ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయి నీటిమట్టాలను సంతరించుకున్నాయని, మునుముందు కురిసే వర్షాలతో వరద జలాలన్నీ ఎస్సారెస్పీలోకి వచ్చి చేరుతాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కేవలం అర టీఎంసీ నీటిని కాకతీయ కాలువకు విడుదల చేయకపోవడం శోచనీయమని ఆక్షేపించారు. ఓవైపు కేంద్రంలోని మోదీ సర్కార్ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు మద్దతు ధరలను గణనీయంగా పెంచుతూ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలను అమలు చేస్తుంటే, రాష్ట్రంలో మాత్రం తెరాస ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. పైపెచ్చు కేంద్రం అమలు చేస్తున్న పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూరితే ఎక్కడ బీజేపీకి పేరు వస్తుందోననే అభద్రతా భావంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలపై అన్నదాతలకు అవగాహన కల్పించడం లేదని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంటలకు బోనస్ అందిస్తున్నారని, వ్యవసాయాధారిత పరిశ్రమలకు భారీ ఎత్తున సబ్సిడీలు వర్తింపజేస్తున్నారని తెలిపారు. ఇక్కడ మాత్రం పూర్తిగా అవినీతి తతంగాల్లో మునిగి తేలుతున్న తెరాస సర్కారు, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయేలా చేసిందని విమర్శించారు. గడిచిన నాలుగేళ్ల నుండి స్థానికంగా ఏ ఒక్క వర్గానికి కూడా ఎంపీ కవిత మేలు చేకూర్చలేకపోయారని అన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటూ, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటీవల కేటీఆర్‌ను పిలిపించి ఐ.టీ హబ్‌కు శంకుస్థాపన చేయించారని ఎద్దేవా చేశారు. నిజానికి అనేక ప్రాంతాల్లో ఐ.టీ పరిశ్రమలు కుదేలవుతున్న తరుణంలో, ఎలాంటి వౌలిక సదుపాయాలు లేని నిజామాబాద్‌లో ఐ.టీ పరిశ్రమ ఎలా వేళ్లూనుకుంటుందని ప్రశ్నించారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, వారి చెవిలో పూలు పెట్టేందుకే ఐ.టీ హబ్ పేరిట నాటకానికి తెర లేపారని దుయ్యబట్టారు. యువతకు, విద్యార్థులకు నిజంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆకాంక్ష ఉంటే స్థానికంగా వ్యవసాయాధారిత పరిశ్రమలను ఎందుకు స్థాపించడం లేదని, నిజాం షుగర్స్‌ను ఎందుకు తెరిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. చికాగో యూనివర్శిటీతో కుదుర్చుకున్న ఎంఓయూ ఒప్పందాన్ని అనుసరిస్తూ తెలంగాణ యూనివర్శిటీ నుండి ఎంతమంది విద్యార్థులను అమెరికాకు పంపించారో ఎంపీ కవిత వెల్లడించాలన్నారు. భూతద్దం పెట్టి వెదికినా ఆమె జిల్లా అభివృద్ధికి ఉపయోగపడేలా ఏ ఒక్క పని చేసిన దాఖలాలు కనిపించడం లేదని, ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలువడం కష్టంగా మారిందని అన్నారు. విలేఖరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బస్వా లక్ష్మీనర్సయ్య, బీసీ, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్, మచల్ శ్రీనివాస్, శ్రీను, వీరేందర్ పాల్గొన్నారు.