రాష్ట్రీయం

సాగర్ కాల్వల పరవళ్లకు 51 వసంతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఆగస్టు 3: భారతదేశ భాండాగారం, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అన్నపూర్ణగా పేరుగాంచిన నాగార్జునసాగర్ నందికొండ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల చేసి నేటికి 51 వసంతాలు నిండి 52వ వసంతంలోకి అడుగు పెట్టింది. సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఒక దశకు చేరుకున్న తరుణంలో సాగర్ జలాశయానికి ఎగువ నుంచి నీరు వచ్చి చేరడంతో 1967 ఆగస్టు 4వ తేదీన అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల చేశారు. 1955 డిసెంబర్ 10న సాగర్ ప్రాజెక్టుకు నెహ్రూ శంకుస్థాపన చేస్తూ ‘ఈనాడు నాగార్జున సాగరానికి నేను ఇక్కడ జరిపే కార్యక్రమాన్ని పవిత్ర కార్యంగా పరిగణిస్తున్నాను. ఇది భారత ప్రజాస్వామ్య మందిరానికి శంకుస్థాపన. మనం అసేతు హిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న ఆధునిక దేవాలయానికి ఇది చిహ్నం’ అని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే, 960 మెగావాట్ల కరెంటుని ఉత్పత్తి చేస్తూ తెలుగు రాష్ట్రాలకు వెలుగునిస్తూ కోట్ల జనానికి దాహాన్ని తీరుస్తున్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం 12 సంవత్సరాల పాటు రోజు 45 వేల మంది కార్మికులు శ్రమించి సాగర్ ప్రాజెక్టును పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల అయకట్టు రైతాంగానికి ఆసరాగా నిలవాల్సిన సాగర్ ప్రాజెక్టు కృష్ణ నీరు నేడు సాగునీటి అవసరాల కోసమే ప్రాధాన్యతనిస్తున్న పరిస్థితి నేడు దాపురించింది. సాగర్ కాల్వల నీటి కోసం రైతాంగం ఎదురుచూపులతోనే కాలం గడిచిపోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా సాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండకపోవడంతో కాల్వలకు పూర్తిస్థాయ నీటి విడుదల జరగని కారణంగా ఒక పంటకు నీరు ఇచ్చి మరో పంటకు నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలున్నాయి. సాగర్, శ్రీశైలం ఎగువ భాగాన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణా నదిపై ఇష్టం వచ్చినట్లుగా అనకట్టలు కట్టుకొని ఎత్తులు పెంచుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వరద నీరు రావడం ప్రాజెక్టులు నిండడం గగనమైంది. ఇటువంటి పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలు తాగునీరు, సాగు నీరు కోసం పరోక్షంగా ప్రత్యక్షంగా నీటి యుద్ధాలు జరుపుకొనే పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన ఉన్న అన్ని ప్రాజెక్టులు ఇప్పటికే జలకళతో పూర్తిస్థాయికి చేరుకొని కళకళలాడుతుండగా సాగర్ ప్రాజెక్టు మాత్రం కనీస నీటిమట్టంతో వెలవెలపోతోంది.