రాష్ట్రీయం

జాడ లేని చినుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 7: అనంతపురం జిల్లా రైతులను కరవు ముందుగానే నిరాశపరిచింది. వర్షాభావ పరిస్థితుల వల్ల వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. వాతావరణంలో మార్పులతో ఆశించిన మేరకు నైరుతి రుతుపవనాలు జిల్లాపై ప్రభావం చూపలేదు. దీంతో ఆకాశం మేఘావృతం వడం చినుకు రాల్చకుండానే మేఘాలు కదిలిపోవడం రైతులను కలచివేస్తోంది. గాలి వేగం గంటకు 25 నుంచి 32 కిమీ ఉండడంతో మేఘాలు వర్షించకుండానే కదిలిపోతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వర్షాధార వేరుశెనగ పంటతో పాటు బోర్లు, బావుల కింద సాగుచేసిన పంటలు సైతం ఎండుముఖం పట్టాయి. జూన్ నెలలో పడిన వర్షం కొంతమేరకు ఆశాజనకంగా ఉండటంతో వేరుశెనగ పంట సాగుకు రైతులు మొగ్గుచూపారు. జూలై, ఆగస్టు నెలలో ఇప్పటి వరకూ వరుణుడి కరుణలేదు. దీంతో 15 వరకు కూడా వర్షం రాకుంటే ఆ తర్వాత వచ్చినా వేరుశెనగ పంట సాగు చేయకూడదని
నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఇప్పటికే పంట విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించేశారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది వేరుశెనగ సాగు దారుణంగా పడిపోయింది. గత ఖరీఫ్‌లో సుమారు 5 లక్షల హెక్టార్లలో వర్షాధార వేరుశెనగ పంట సాగైతే, ఈ ఖరీఫ్‌లో ఈ నెల 6వ తేదీ నాటికి 2,26,798 హెక్టార్లకు మించకపోవడం జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితికి అద్దం పడుతోంది. వాస్తవంగా సాగు కావాల్సింది 5,43,439 హెక్టార్లు అయినప్పటికీ, వర్షాధారంగా, బోర్లు, బావుల కింద ఇతర పంటలన్నీ కలిపి మొత్తంగా సాగైంది 37.5 శాతం మాత్రమే. రెండో స్థానం అక్రమించే కంది పంట ఈ ఏడాది 53,816 హెక్టార్లు కాగా, కేవలం 18,958 హెక్టార్లలో సాగైంది. వరి పంట పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. 20,216 హెక్టార్లలో సాగు చేయాల్సిన వరి పంట 1,168 హెక్టార్లలో మాత్రమే వేశారు. జొన్న, రాగి, కొర్ర, పెసర, ఆముదం, పొద్దుతిరుగుడు, సోయాబీన్, పత్తి, చెరకు, మిరప, ఉల్లి, పొగాకు, మొక్కజొన్న, సజ్జలు తదితర సుమారు 24 రకాల పంటల సాగు కుదేలైంది. ఈ పంటలన్నీ కలిపి 7,46,882 హెక్టార్లకు గానూ, 2,79,900 హెక్టార్లలో మాత్రమే సాగైంది. వరి పంట 32 మండలాల్లో అస్సలు వేయనేలేదు. జొన్న 57 మండలాల్లో సాగే లేకపోగా, 16 మండలాల్లో మాత్రమే సజ్జ వేశారు. కంది పంట ఆరు మండలాల్లో సాగులోకి రాలేదు. ప్రత్నామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నా సెప్టెంబర్‌లో కూడా వర్షాలు కురుస్తాయన్న ఆశ రైతుల్లో సన్నగిల్లింది. దీంతో ఒకవేళ ప్రత్యామ్నాయ పంటలు వేసినా వర్షం రాకుంటే అదనపు భారం భరించాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది. కొన్నిచోట్ల రైతులు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి మొక్కలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు చెల్లించాల్సి వస్తోందని, అయినా మొక్కలు బతుకుతాయన్న ఆశలేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రెయిన్‌గన్ల ద్వారా వేరుశెనగ, ఇతర పంటలను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు భూగర్భ జలాలు లేకపోవడంతో బెడిసి కొడుతున్నాయి. చాలాచోట్ల రెయిన్‌గన్లు అందుబాటులో లేవని, ఉన్నా నీళ్లు అస్సలే లేవని రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. కర్నాటక రాష్ట్ర సరిహద్దు మండలాలైన కదిరి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, హిందూపురం, రాయదుర్గం, మడకశిర, పుట్టపర్తి నుంచి రైతులు, రైతు కూలీలు చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు కేరళ రాష్ట్రానికి వలస పోవడం ప్రారంభించారు. వృద్ధులైన తల్లిదండ్రులు, పిల్లలను ఇళ్లవద్దే వదిలి భార్యాభర్తలు తరలిపోతున్నారు. యువకులు, యువతులు సైతం సుదూర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు.
చిత్రం..అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో
ఎండిపోతున్న వేరుశనగ పంటను ట్యాంకర్ నీటితో తడుపుతున్న రైతు చౌడప్ప